bharathanatyam
-
హీరోగా చేస్తానని అనుకోలేదు: సూర్య తేజ
‘దొరసాని’ ఫేం కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భరతనాట్యం’. ఈ మూవీతో సూర్య తేజ హీరోగా పరిచయం అవుతున్నాడు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో హీరో సూర్య తేజ ఏలే విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో కి రావాలి, డైరెక్షన్ చేయాలనే ఆసక్తి ఉండేది. కాలేజ్ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథలు రాయడం, నెరేట్ చేయడం.. ఇలా స్ట్రగులింగ్ లో ఉన్న సమయంలో హితేష్ గారికి నేను చెప్పిన కథ నచ్చింది. తర్వాత దర్శకుడు కెవిఆర్ మహేంద్ర గారికి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. ఈ సినిమాకి మీరు డైరెక్షన్ చేస్తే బావుంటుంది కోరాను. కథ నచ్చి అంగీకరించారు. ► ఈ సినిమా కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుటుంది. దర్శకుడు, నిర్మాతలు ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత చేయడం జరిగింది. అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. డీవోపీ వెంకట్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వివేక్ సాగర్ గారు రావడంతో సినిమా స్కేల్ మరింత గా పెరిగింది. ► 'భరతనాట్యం' ఫిక్షనల్ స్టొరీ. కానీ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఒక మనిషి షార్ట్ కట్ లో వెళితే ఏం జరుగుతుందనేది ఈ సినిమా పాయింట్. పర్శనల్ గా ఫీలైన స్ట్రగుల్స్ ని కామికల్ గా చేసి రాసింది. కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్ టైనర్. ఈ కథకు 'భరతనాట్యం' పర్ఫెక్ట్ టైటిల్. అది ఎలా అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ► కాసర్ల శ్యామ్ , అనంత శ్రీరామ్ , భాస్కర భట్ల గారు ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రాశారు. అనంత శ్రీరామ్ గారు చాలా ఫన్ పర్శన్. కథ వింటూ మాతో ట్రావెల్ అయ్యారు. భాస్కర భట్ల గారు చాలా నాలెడ్జ్ షేర్ చేశారు. ఈ ముగ్గురితో బ్యూటీఫుల్ జర్నీ. పాటలన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. ► భవిష్యత్ లో సినిమాల్లో ఉందామని అనుకుంటున్నాను. అది ఎలా అయినా పర్లేదు. రచయితగా కొన్ని కథలు ఉన్నాయి. ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది. చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నా తదుపరి సినిమాకి హెల్ప్ అవుతాయి. -
Hybrid Bharatham: 20 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి..
శ్రద్దాశక్తులతో శ్రమటోడిస్తేగానీ భరతనాట్యం రాదు. అంతటి కష్టమైన భంగిమలకు వెస్ట్రన్ హిప్హప్ను జోడించి ఆడియెన్స్‌ను అలరిస్తోంది ఉషా జే. సంప్రదాయ చీరకట్టులో భరతనాట్యానికి వెస్ట్రన్ డ్యాన్స్∙జోడించి చేస్తోన్న వీడియోలు నెటిజన్లచేత ఔరా అనిపిస్తున్నాయి. శ్రీలంకకు చెందిన 25 ఏళ్ల ఉషా జే కొరియోగ్రాఫర్. శ్రీలంకలో జరిగిన సివిల్ వార్ నేపథ్యంలో ఉషాజే కుటుంబం పారిస్‌కు వలస వెళ్లింది. దీంతో ఉషాజే అక్కడే పుట్టి పెరిగింది. పారీస్‌లో ఉన్నప్పటికీ తమిళ సంప్రదాయాలను గౌరవిస్తూ పెరిగిన అమ్మాయి. ఓరోజు స్కూల్లో జరుగుతోన్న వార్షికోత్సవంలో నాట్యం చేసింది. అది చూసిన వారంతా ‘ఇక ఆపు, ఇలా కాదు కొత్తగా ఏదైనా ప్రయత్నించు’ అని చెప్పారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకున్న ఉష ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. హిప్హప్తో.. అప్పటిదాక హిప్హప్ డ్యాన్స్ నేర్చుకోవాలని అనుకోని ఉష..తన స్నేహితులు హిప్హప్ నేర్చుకుంటున్నారని తను కూడా వాళ్లతోపాటు నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఒకపక్క వెస్ట్రన్ నేర్చుకుంటూనే తన సంప్రదాయ నృత్యం భరతనాట్యం కూడా నేర్చుకోవడం మొదలు పెట్టింది. అందరూ చాలా చిన్నవయసులో నేర్చుకునే భరతనాట్యాన్నీ, ఉషా ఇరవై ఏళ్ల వయసులో నేర్చుకోవడం మొదలు పెట్టింది. దీంతో నాట్య భంగిమలు తనకి బాగా కష్టంగా అనిపించేవి. అయినప్పటికీ భరతనాట్యాన్ని ఔపోసన పట్టింది. తొలి వీడియోకు .. లక్షల్లో వ్యూస్ ‘‘సంప్రదాయ నృత్యాలన్నింట్లోకి భరతనాట్యం కాస్త కష్టమైనది. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేగానీ పర్ఫెక్ట్ స్టెప్పులు రావు. ఇలాంటి భరతనాట్యానికి వెస్ట్రన్ స్టెప్పులను జోడిస్తే బావుంటుంది’’ అన్న ఆలోచనతో సరికొత్తగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది ఉష. భరతనాట్యానికి హిప్హప్ స్టెప్పులను జోడించి చేసిన డ్యాన్స్ వీడియోలను ‘హైబ్రిడ్ భరతం’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 2019 డిసెంబర్ 27న తొలి వీడియోను పోస్టు చేయగా వీడియోకు ముఫ్పైలక్షల వ్యూస్ వచ్చాయి. మంచి స్పందన లభించడంతో..ఈ డ్యాన్స్ వీడియోలను మరిన్ని రూపొందించేదుకు వర్క్‌షాపులు నిర్వహించి, తనలాంటి డ్యాన్సర్లను తన టీమ్‌లో చేర్చుకుంది. ఇలా తన టీమ్‌తో ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ పాటలకు ౖహె బ్రిడ్ డ్యాన్స్ వీడియోలను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పోస్టుచేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. ఆడియెన్స్ ఇస్తోన్న సలహాలు, సూచనలతో తన డ్యాన్స్‌ను మెరుగుపరుచుకుంటూ పోతోంది. ఇటీవల ఉషా విడుదల చేసిన వీడియోలో ఆమెతోపాటు మితుజా, జనుషా చీరకట్టులో స్టెప్పులేస్తున్నారు. వీరి హైబ్రిడ్ డ్యాన్స్ వీడియోకు ఇప్పటిదాకా నలభైలక్షల వ్యూస్ వచ్చాయి. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉష భరతనాట్యానికి సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలిచేలా కనిపిస్తోంది. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 -
పట్టుచీర కట్టుతో.. అతనే ఆమైతే..!
సాక్షి, ఆదోని(కర్నూలు): అబ్బాయి అమ్మాయి అయితే ఎలా వుంటుంది? సంప్రదాయ పట్టుచీర కట్టుతో వేదికపైకి వచ్చి.. చక్కటి హావభావాలతో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంటే ఎలా అనిస్తుంది. ఆదోని పట్టణం మండగిరి వీధికి చెందిన శ్రీనివాసులు అచ్చం ఇలాగే చేస్తున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టి, ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 23న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్ఎస్ఎస్ రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యంలో బెస్ట్ ఫర్మామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాడు. ఇటీవల ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సెట్కూర్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కళా ప్రదర్శన పోటీల్లో కూడా కూచిపూడిలో మొదటి బహుమతి, భరత నాట్యంలో తృతీయ బహుమతి అందుకున్నాడు. అంతేగాక అంతర్జిల్లా పోటీలకు అర్హత సాదించాడు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో కూడ తన అద్భుత నాట్య కళాభినయంతో అందరి మెప్పు పొందుతున్నాడు. వర్ధమాన కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీనివాసులు.. స్థానికంగా ఉన్న అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా డ్యాన్స్ మాస్టర్లు విజయ్‌కుమార్, వాసు, రాజ్‌కుమార్‌తో శిక్షణ పొందుతున్నాడు. డిగ్రీ దాకా పూర్తి చేసిన శ్రీనివాసులు తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేస్తానని చెప్పారు. తండ్రి బసన్న.. కట్టెల మండి వ్యాపారి. తల్లి రంగమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందింది. అంతర్ జిల్లా పోటీలకు అర్హత సాదించిన శ్రీనివాసులును అవ్వ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచోటి రామయ్య బుధవారం అభినందించారు. నాట్యమే తన జీవితంగా భావిస్తున్న శ్రీనివాసులుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని రాచోటి రామయ్య అకాంక్షించారు. తనకు చిన్నతనం నుంచి నాట్యమంటే ఎంతో మక్కువ అని, తన అసక్తి మేరకు నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సొసైటీ నిర్వాహకులు, డాన్స్ మాస్టర్లకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను నాట్యంలో అత్యుత్తమ కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి : శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం -
ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి
సాక్షి, విజయనగరం : నృత్యం చిన్నారులకు దేవుడిచ్చిన వరం. చిన్నప్పటి నుంచి నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ ఇప్పిస్తే మెలకువలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక నాట్యంలో రాణిస్తారు. వేదికలపై అలరిస్తారు. దీనికి గొట్లాం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని బోడసింగి త్రివేణి నిదర్శనం. చిన్నవయసులోనే నాట్యంలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంటోంది. విద్యల నగరమైన విజయనగరం జిల్లా ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేస్తోంది. ఓ వైపు చదువులో ప్రతిభ చూపుతూ మరోవైపు కూచిపూడి, భరతనాట్యంలో కీర్తనలకు అడుగులు కదిపి అలరిస్తోంది. చక్కని ప్రతిభ... త్రివేణి కూచిపూడి, భరతనాట్యంలో నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సును పూర్తిచేసింది. పదవర్ణం, థిల్లానా, శబ్దం, అష్టపదులు అద్భుతంగా చేస్తూ అందరిమన్ననలు అందుకుంటోంది. కూచిపూడిలో బ్రహ్మాంజలి, భామా కలాపం, కొలువైతివా.. జతిస్వరం, థిల్లానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి త్రివేణి నాట్యంపై ఉత్సాహం చూపడంతో తల్లిదండ్రులు బి.అప్పలనారాయణ, లక్ష్మిల నర్తనశాల డాక్టర్ భేరి రాధికారాణి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. నాటినుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆమె వద్దనే శిక్షణ పొందుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇప్పటి వరకు సుమారు వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చిన త్రివేణి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో త్రివేణి విశేష ప్రతిభ కనబరుస్తోంది. జిల్లాలో ఎక్కడా ఎటువంటి కార్యక్రమమైనా తమ బృందం తరఫున ప్రధా న పాత్ర వహిస్తూ, గురువుల సారథ్యంలో అద్భుతమైన ప్రతిభను కనబరచి అందరిమన్ననలు అందుకుంటోంది. రాజస్థాన్, శ్రీకాళహస్తి, విజయవాడ, భు వనేశ్వర్, హైదరాబాద్, గుణుపూర్, బొబ్బిలి, సాలూ రు, శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, తుని, తిరుపతి, భద్రాచలం, ఇలా ఆంధ్ర రాష్ట్రమంతా ప్రదర్శనలిస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. పశంసలు, రికార్డులు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది నామ సంవత్సవ వేడుకల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనతో అవార్డును సొంతం చేసుకుంది. గురజాడ ఫౌండేషన్ (అమెరికా) సంస్థ నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆçహూతుల ప్రశంసలందుకుంది. విజయనగర ఉత్సవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మ్యూజిక్ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో త్రివేణి నృత్యం చూపరులను కట్టిపడేసింది. యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో త్రివేణి నృత్యానికి చోటు దక్కింది. డివిజనల్ యూత్ ఫెస్టివల్, గురజాడ 154వ జయంతి, శిల్పారామం, ఇంటర్నేనేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి వేడుకలులో ఇచ్చిన ప్రదర్శనలకు ప్రశంసపత్రాలు, మన్ననలు అందుకుంది. విశాఖరత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో త్రివేణి ప్రతిభకు నృత్యరత్న అవార్డు వరించింది. -
భరతనాట్యంలో భళా..!
నల్లగొండ టూటౌన్ : సంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా రామకృష్ణ – నాగేశ్వరి దంపతుల కుమార్తె దేవీనిఖిత. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నిఖిత నాలుగేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ పొందుతూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక బహుమతులు, ప్రశంసపత్రాలు సాధించింది. నిఖితకు చిన్నప్పటినుంచి నృత్య ప్రదర్శనపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి ఎక్కడ పోటీలు జరిగినా తన నృత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటూ బహుమతులు సొతం చేసుకుంటోంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర స్థాయి బతుకమ్మ పోటీల్లో భరతనాట్యంలో కష్టతరమైన నాట్యరీతులను ప్రదర్శించి ఆకట్టుకుని నిర్వాహకుల చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసపత్రం అందకుంది. జాతీయస్థాయిలో ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యం నాకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచే పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో నృత్యం చేసే దానిని. ఇప్పటికి వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. అన్ని చోట్ల ప్రతిభ చూపి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నా. జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శన ఇచ్చి జిల్లాకు పేరు తేవాలలన్నదే నా ఆకాంక్ష. – దేవీనిఖిత, నల్లగొండ -
బ్రిటన్ పార్లమెంట్లో పన్నెండుసార్లు
పదం పలికితే పరవశం. పాదం కదిలితే అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నాట్య వేదికలపై నర్తించి విశ్వవాప్తంగా గుర్తింపు పొందారామె. భారతీయ కళలకు సుపరిచితమైన చిరునామా ఆమె. ఐదో ఏటనే నాట్యంలో అరంగ్రేటం, ఆ పిదప భరతనాట్య శైలిలో మహిళల సాధికారత అంశాలను అక్కున చేర్చుకున్నారు. నర్తిస్తూ, బోధిస్తూ, నృత్య దర్శకత్వం వహిస్తూ నాట్యశాస్త్రం అధ్యయనం చేస్తూ హైదరాబాద్ నగర ఖ్యాతిని ఖండాంతరాలకు చేరుస్తున్నారామె. నగరంలోని చిక్కడపల్లికి చెందిన రాగసుధ.. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న ఆమె, ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి తన నృత్యంతో ఆకట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న రాగసుధ సోమవారం ‘సాక్షి’తో ముఖాముఖీ మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. సాక్షి: నాట్యం ఏ వయసులో నేర్చుకున్నారు? రాగసుధ: ఐదో ఏట నుంచే నృత్యంలో అడుగు పెట్టా. నాన్న వింజమూరి శేషాచార్యులు సాహిత్య అభిరుచి ఉన్నవారు. లలిత కళలు, సాహిత్య అంటే అమితంగా ఇష్టపడతారు. నన్ను నృత్యం చేర్చుకోమన్నారు. సాక్షి: భరతనాట్యానికి సంబంధించిన కోర్సులేమైనా చేశారా? రాగసుధ: హైదరారాబాద్ నగరంలోని రాంకోఠిలో ఉన్న త్యాగరాజ మ్యూజిక్ కళాశాలలో డిప్లొమా కోర్సు చేశాను. ఆ తర్వాత ప్రముఖ నృత్య గురువు డాక్టర్ ఉమారామారావు దగ్గర శిక్షణ పొందాను. నృత్య మెలకువలు నేర్చుకున్నాను. సాక్షి: మీ గురువు గారితో కలిసి నృత్యం చేసిన సందర్భాలు ఉన్నాయా? రాగసుధ: తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో ‘నృత్య నీ రాజనం’ కార్యక్రమ ప్రారంభ నృత్యం డాక్టర్ శోభానాయుడు చేశారు. ఆ తర్వాత మూడోరోజు నృత్య గురువు డాక్టర్ ఉమా రామారావుతో కలిసి అత్యంత క్లిష్టమైన శ్రీనివాస గద్యం చేశాను. ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడి ఆశీస్సులతో బ్రిటిష్ పార్లమెంట్లో నృత్యం చేసే దాకా వెళ్లాను. సాక్షి: మీ నాట్య ప్రయాణం గురించి.. రాగసుధ: నేను హైదరాబాద్ చిక్కడపల్లి వాసిని. ఇక్కడే నృత్యం నేర్చుకొన్నా. ఇక్కడే వేదికలపై చాలాసార్లు నృత్య ప్రదర్శనలు చేశా. సంగీతంలో చాలా మంది కళాకారులు ఉన్నారని, నాన్న నృత్యం వైపు ప్రోత్సహించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మా గురువు డాక్టర్ ఉమా రామారావుతో కలిసి చాలాసార్లు నృత్యం చేశా. సాక్షి: మీ కుటుంబ వివరాలు చెబుతారా.. రాగసుధ: పదేళ్ల క్రితం లండన్ వెళ్లా. భర్త సునీల్ ప్రాజెక్ట్ మేనేజనర్. నేను యూనివర్సిటీ ఆఫ్ సండర్ ల్యాండ్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. అక్కడ కూడా చాలా మందికి డ్యాన్స్ నేర్పిస్తుంటా. ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండోరోజు ప్రధాన వేదికపై నృత్యం చేశాను. సాక్షి: ఏయే అంశాలు ఇష్టపడతారు? రాగసుధ: ఆధ్యాత్మిక అంశాలపై నృత్యం ఇష్టపడతాను. అమ్మవారు అంటే శ్రీశక్తి అని అర్థం. రామదాసు, అన్నమయ్య, వేంకటేశ్వరుడిపై నృత్య ప్రదర్శనలు చేస్తుంటాను. సాక్షి: భరతనాట్యంలో ప్రస్తుత వింత పోకడలపై మీ అభిప్రాయం.. రాగసుధ: భరతనాట్యంలో వింత పోకడలు నిజమే. వాటిని జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అమ్మవారి ఐటమ్ చేసేటప్పుడు ఉగ్రరూపం వచ్చినప్పుడు నాలుకను బయటకు వచ్చినట్లు దానికి ఎర్రటి రంగు ఉన్నట్లు చూపాలి. రక్తం వచ్చినట్లు అభినయం ప్రకటించాలి. ఎఫెక్ట్‌గా ఉండాలని నాలుక బయటకు తీసి దానికి రక్తపు ఛాయలో రంగు పూసుకొని చూపిస్తున్నారు. అభినయం కంటే ఎఫెక్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాక్షి: మీరు సాధించిన అవార్డులు.. రాగసుధ: గతేడాది ఉగాది నాడు స్విట్జర్లాండ్ తెలుగు సంఘాలు ‘నృత్య నగజా’ బిరుదును అందజేశాయి. యూకేలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహించే డాక్టర్ సుమల్ నవంబర్‌లో ‘నృత్య కళా శిరోమణి’ ప్రకటించాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ స్వరూపారాణి డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక పురస్కారం క్రింద సప్తపది నృత్య పురస్కారం అందజేశారు. సాక్షి: నాట్యంలో మీకు సంతృప్తి కలిగించిన సంఘటనలున్నాయా..? రాగసుధ: ప్రపంచంలోని ఏ దేశ మహిళలూ ఇంత వరకు బ్రిటన్ పార్లమెంట్లో 12 సార్లు నృత్య ప్రదర్శనలు చేయలేదు. ఒక్క తెలుగు మహిళగా, హైదరాబాద్ మహిళగా ఆ అవకాశం నాకే దక్కింది. ఇది నిజంగా ప్రపంచ రికార్డు. బ్రిటన్ పార్లమెంట్లో సామాజిక అంశాలపై నృత్య ప్రదర్శనలు చేశా. ఆయుర్వేదం, వాస్తు శాస్త్రం, బేటీ బచావో, టాగూర్ భావజాలం, మైథిలీ భాషలో శ్రీకృష్ణ లీలలపె నృత్యం చేశా. మహిళల సాధికారతపై సీతమ్మ నుంచి, నేవీ అధికారి రాధిక మీనన్ వరకు అందరి గురించి నృత్యం రూపంలో వివరించా. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు లండన్ పార్లమెంట్ వద్దకు వచ్చినపుడు శివలీలలుపై నృత్య ప్రదర్శన చేశాను. ఈ రికార్డు సాధించిన తొలి తెలుగు మహిళను కావడం సంతోషంగా ఉంది. దీంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నా. -
జయహో...జానీ
అతడి ప్రతిభ.. నిరంతర సాధన ఇప్పుడు ఎనలేని గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ముస్లిం కుటుంబంలో పుట్టినా.. ఎంతో ఆసక్తితో భరతనాట్యం నేర్చుకొని..ఇంతింతై అన్నట్లు ప్రపంచ స్థాయి సదస్సులో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌లో హాజరయ్యే వేడుకలో సంప్రదాయ సిద్ధంగా ఓలలాడించబోతున్నాడు. చారిత్రక గోల్కొండ కోట వద్ద భద్రాచల పుణ్యక్షేత్రం, రామదాసు విశిష్టతను చాటే కళారూప ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని చాటబోతున్నాడు. గోల్కొండలో జానిమియా నృత్యం.. తల్లాడ: తల్లాడకు చెందిన డ్యాన్స్ మాస్టర్ షేక్ జానిమియాకు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి మూడురోజులపాటు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. సదస్సుకు హాజరయ్యే అతిరథమహారథుల ఎదుట నాట్యం చేసే గౌరవం జానిమియాకు లభించింది. ఈ నెల 29న అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ ముందు గోల్కొండలో రామదాసు కీర్తనపై న్యతం ప్రదర్శించనున్నారు. తన శిష్య బృందంతో గురు పర్యవేక్షణలో డాక్టర్ పద్మశ్రీ ఆనందశంకర్ జయంతి నృత్య దర్శకత్వంతో ప్రదర్శించబోతున్నారు. భద్రాచల పుణ్య క్షేత్రం, రామదాసు విశిష్టతను కళారూపంలో ఆవిష్కరించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తల్లాడకు చెందిన షేక్ సైదా, షాహిదాబీబేగం దంపతుల కుమారుడు జానిమియా. విజయవాడ ఆంధ్రా లయోల కళాదర్శినిలో నృత్యంపై తర్ఫీదు పొందాడు. నర్తకి రామకృష్ణ వద్ద భరతనాట్యం నేర్చుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంపీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ చిరక్ ఇంటర్ నేషనల్ స్కూల్లో నృత్య గురువుగా పని చేస్తున్నాడు. ఐదేళ్ల ప్రాయంలోనే తల్లే తొలిగురువుగా జానిమియా నాట్యం ప్రారంభించాడు. ముస్లిం కటుంబానికి చెందిన జానిమియా తన సంప్రదాయాలకు భిన్నమైన హిందూ కళలు, నాట్యం పట్ల ఆసక్తి పెంచుకోగా.. తల్లి షాహిదా బేగం కూడా ప్రోత్సహించింది. బాల్యం నుంచే నాట్యంపై అమితమైన అభిరుచి ఉండటంతో ఉపాధ్యాయులు కూడా తగిన ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో జానిమియా నాట్యం.. ,విజయవాడ శారద కళాపీఠం యువపురస్కారం అందుకుంటున్న జానిమియా బిరుదులు, సత్కారాలు విజయవాడ ఆకాశవాణి యువవాణి విభాగం యువ సౌరభం బిరుదుతో సత్కరించింది. విజయవాడ శారద కళా పీఠం యువ పురస్కారం అందించింది. సిద్ధార్థ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు పొందాడు. ముఖ్యమైన ప్రదర్శనలు ♦ ప్రపంచ తెలుగు మహాసభలు ♦ రాంచి యూనివర్సిటీలో జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రథమ స్థానం ♦ హైదరాబాద్ గుడి సంబురాల కార్యక్రమం ♦ ఖుజరహు డాక్ర ఫెస్టివల్లో ♦ సిలికానాంధ్ర అంతర్జాతీయ సమ్మేళనంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ♦ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత దినోత్సవంలో.. -
'నాట్యమయూరికి అరుదైన నివాళి'
న్యూఢిల్లీ: లీపు సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ భరతనాట్యకారిణి రుక్మిణీ దేవీ అరుండల్కు ప్రతిష్టాత్మక సెర్చ్ ఇంజిన్ గూగూల్ ఘన నివాళి అర్పించింది. ఆమె ఫొటోని డూడుల్ చిత్రంగా పెట్టి మరోసారి భారతీయుల మనసు కొల్లగొట్టింది. రుక్మిణి తమిళనాడులోని మధురై నగరంలో 1904, ఫిబ్రవరి 29న జన్మించారు. సోమవారం ఆమె 112వ జయంతి సందర్భంగా గూగూల్ ఈ నివాళి అర్పించింది. సంప్రదాయ దుస్తుల్లో, నాట్యముద్రతో మెరిసిపోతున్న చిత్రాన్ని పెట్టింది. దీంతో పాటు పింక్ రంగు గల ట్రేడ్‌మార్క్ అక్షరాలను జతచేసింది. 1920ల్లో భరతనాట్యంపై సమాజంలో చిన్న చూపుండేది. వీటన్నింటిని అధిగమించి తనకంటూ రుక్మిణీ దేవీ నాట్య రంగంలో ప్రత్యేక స్థానం సంపాధించుకుంది. తన భర్తతో కలిసి చెన్నై సమీపంలో కళాక్షేత్ర దగ్గర డాన్స్ అకాడమీని స్థాపించారు. నాట్యరంగంలో ఈమె కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం 1956లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సంగీత్ నాటక్ అకాడమీ 1967లోఫెల్లోషిప్‌ను ప్రదానం చేశారు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. మోరార్జీదేశాయ్1977లో ఆమెను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేయగా రుక్మీణీదేవీ సున్నితంగా తిరస్కరించారు. రుక్మిణి 1986 ఫిబ్రవరి 24న మరణించారు. -
భరతనాట్యం.. దేశానికి వరం
సాక్షి, సిటీబ్యూరో: భరతనాట్యం దేశానికి వరమని హైకోర్టు జస్టిస్ నూతి రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రణామ్’ కార్యక్రమంలోని ఆయన పాల్గొని ప్రసంగించారు. పాశ్చాత్య పెనుగానులు వీస్తున్న తరుణంలో భారతీయ విలువలు ఎక్కడ కొట్టుకపోతాయేనని భయం భయంగా ఉండేదని.. తొమ్మిది మంది చిన్నారుల నృత్యం చూసిన తర్వాత కొంత ధైర్యం వచ్చిందన్నారు. మంజులా శ్రీనివాస్ శిష్యగణం చేసిన దశావతారాల ప్రదర్శన మహాద్భుతంగా సాగిందన్నారు. పిల్లలు చేసిన శ్రీకృష్ణాభినయం తనను ఎక్కడికో తీసుకెళ్లిందన్నారు. అనంతరం నృత్యగురువు మంజులా శ్రీనివాస్‌ను జస్టిస్ నూతి రామ్మోహనరావు సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ప్రమోద్ కుమార్ రెడ్డి, సుందరి, నర్సింగరావు, మాధవి, రాధారాణి, సాయిశ్రీ, భవాని, అరుణజ్యోతి , శృతి తదితరులు గురువు మంజులాశ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. అంతకుముందు తొమ్మిది మంది కళాకారులు ప్రమోద్ కుమార్ రెడ్డి సారధ్యంలో గురువందనమ్లో భాగంగా చేసిన చంద్రచోడ, థిల్లానా, మహాలక్ష్మి అష్టకంపై చేసిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. గాయని శ్వేతా ప్రసాద్, గాయకుడు శ్రీనివాస్‌లను జస్టిస్ నూతి రామ్మోహనరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో నృత్యకారిణి చిత్ర, నృత్యకారుడు ప్రమోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.