అతడి ప్రతిభ.. నిరంతర సాధన ఇప్పుడు ఎనలేని గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ముస్లిం కుటుంబంలో పుట్టినా.. ఎంతో ఆసక్తితో భరతనాట్యం నేర్చుకొని..ఇంతింతై అన్నట్లు ప్రపంచ స్థాయి సదస్సులో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాడు. ఏకంగా అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌లో హాజరయ్యే వేడుకలో సంప్రదాయ సిద్ధంగా ఓలలాడించబోతున్నాడు. చారిత్రక గోల్కొండ కోట వద్ద భద్రాచల పుణ్యక్షేత్రం, రామదాసు విశిష్టతను చాటే కళారూప ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని చాటబోతున్నాడు.
గోల్కొండలో జానిమియా నృత్యం..
తల్లాడ: తల్లాడకు చెందిన డ్యాన్స్ మాస్టర్ షేక్ జానిమియాకు అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్‌లో ఈ నెల 28 నుంచి మూడురోజులపాటు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. సదస్సుకు హాజరయ్యే అతిరథమహారథుల ఎదుట నాట్యం చేసే గౌరవం జానిమియాకు లభించింది. ఈ నెల 29న అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక ట్రంప్ ముందు గోల్కొండలో రామదాసు కీర్తనపై న్యతం ప్రదర్శించనున్నారు. తన శిష్య బృందంతో గురు పర్యవేక్షణలో డాక్టర్ పద్మశ్రీ ఆనందశంకర్ జయంతి నృత్య దర్శకత్వంతో ప్రదర్శించబోతున్నారు. భద్రాచల పుణ్య క్షేత్రం, రామదాసు విశిష్టతను కళారూపంలో ఆవిష్కరించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లాడకు చెందిన షేక్ సైదా, షాహిదాబీబేగం దంపతుల కుమారుడు జానిమియా. విజయవాడ ఆంధ్రా లయోల కళాదర్శినిలో నృత్యంపై తర్ఫీదు పొందాడు. నర్తకి రామకృష్ణ వద్ద భరతనాట్యం నేర్చుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఎంపీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ చిరక్ ఇంటర్ నేషనల్ స్కూల్‌లో నృత్య గురువుగా పని చేస్తున్నాడు. ఐదేళ్ల ప్రాయంలోనే తల్లే తొలిగురువుగా జానిమియా నాట్యం ప్రారంభించాడు. ముస్లిం కటుంబానికి చెందిన జానిమియా తన సంప్రదాయాలకు భిన్నమైన హిందూ కళలు, నాట్యం పట్ల ఆసక్తి పెంచుకోగా.. తల్లి షాహిదా బేగం కూడా ప్రోత్సహించింది. బాల్యం నుంచే నాట్యంపై అమితమైన అభిరుచి ఉండటంతో ఉపాధ్యాయులు కూడా తగిన ప్రోత్సాహం అందించారు.
హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో జానిమియా నాట్యం.. ,విజయవాడ శారద కళాపీఠం యువపురస్కారం అందుకుంటున్న జానిమియా
బిరుదులు, సత్కారాలు
విజయవాడ ఆకాశవాణి యువవాణి విభాగం యువ సౌరభం బిరుదుతో సత్కరించింది. విజయవాడ శారద కళా పీఠం యువ పురస్కారం అందించింది. సిద్ధార్థ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు పొందాడు.
ముఖ్యమైన ప్రదర్శనలు
♦ ప్రపంచ తెలుగు మహాసభలు
♦ రాంచి యూనివర్సిటీలో జాతీయస్థాయి నృత్య పోటీల్లో ప్రథమ స్థానం
♦ హైదరాబాద్ గుడి సంబురాల కార్యక్రమం
♦ ఖుజరహు డాక్ర ఫెస్టివల్‌లో
♦ సిలికానాంధ్ర అంతర్జాతీయ సమ్మేళనంలో కూచిపూడి నృత్య ప్రదర్శన
♦ సెంట్రల్ యూనివర్సిటీ సంస్కృత దినోత్సవంలో..
Comments
Please login to add a commentAdd a comment