Hybrid Bharatham: 20 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి.. | Hybrid Bharatham: Meet Usha Jey Interesting Facts | Sakshi
Sakshi News home page

Usha Jey: 20 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి.. ఇప్పుడు!

Published Wed, Jun 1 2022 3:14 PM | Last Updated on Wed, Jun 1 2022 3:26 PM

Hybrid Bharatham: Meet Usha Jey Interesting Facts - Sakshi

శ్రద్దాశక్తులతో శ్రమటోడిస్తేగానీ భరతనాట్యం రాదు. అంతటి కష్టమైన భంగిమలకు వెస్ట్రన్‌ హిప్‌హప్‌ను జోడించి ఆడియెన్స్‌ను అలరిస్తోంది ఉషా జే. సంప్రదాయ చీరకట్టులో భరతనాట్యానికి వెస్ట్రన్‌ డ్యాన్స్‌∙జోడించి చేస్తోన్న వీడియోలు నెటిజన్లచేత  ఔరా అనిపిస్తున్నాయి.

శ్రీలంకకు చెందిన 25 ఏళ్ల ఉషా జే  కొరియోగ్రాఫర్‌.  శ్రీలంకలో జరిగిన సివిల్‌ వార్‌ నేపథ్యంలో ఉషాజే కుటుంబం పారిస్‌కు వలస వెళ్లింది. దీంతో ఉషాజే అక్కడే పుట్టి పెరిగింది. పారీస్‌లో ఉన్నప్పటికీ తమిళ సంప్రదాయాలను గౌరవిస్తూ పెరిగిన అమ్మాయి. ఓరోజు స్కూల్లో జరుగుతోన్న వార్షికోత్సవంలో నాట్యం చేసింది.

అది చూసిన వారంతా  ‘ఇక ఆపు, ఇలా కాదు కొత్తగా ఏదైనా ప్రయత్నించు’ అని చెప్పారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకున్న ఉష ఎలాగైనా డ్యాన్స్‌ నేర్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది.

హిప్‌హప్‌తో..
అప్పటిదాక హిప్‌హప్‌ డ్యాన్స్‌ నేర్చుకోవాలని అనుకోని ఉష..తన స్నేహితులు హిప్‌హప్‌ నేర్చుకుంటున్నారని తను కూడా వాళ్లతోపాటు నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఒకపక్క వెస్ట్రన్‌ నేర్చుకుంటూనే తన సంప్రదాయ నృత్యం భరతనాట్యం కూడా నేర్చుకోవడం మొదలు పెట్టింది. అందరూ చాలా చిన్నవయసులో నేర్చుకునే భరతనాట్యాన్నీ, ఉషా ఇరవై ఏళ్ల వయసులో నేర్చుకోవడం మొదలు పెట్టింది. దీంతో నాట్య భంగిమలు తనకి బాగా కష్టంగా అనిపించేవి. అయినప్పటికీ భరతనాట్యాన్ని ఔపోసన పట్టింది. 

తొలి వీడియోకు .. లక్షల్లో వ్యూస్‌
‘‘సంప్రదాయ నృత్యాలన్నింట్లోకి భరతనాట్యం కాస్త కష్టమైనది. దీనిలోని భంగిమలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతో సాధన చేస్తేగానీ పర్‌ఫెక్ట్‌ స్టెప్పులు రావు. ఇలాంటి భరతనాట్యానికి వెస్ట్రన్‌ స్టెప్పులను జోడిస్తే బావుంటుంది’’ అన్న ఆలోచనతో సరికొత్తగా డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది ఉష. భరతనాట్యానికి హిప్‌హప్‌ స్టెప్పులను జోడించి చేసిన డ్యాన్స్‌ వీడియోలను ‘హైబ్రిడ్‌ భరతం’ పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

2019 డిసెంబర్‌ 27న తొలి వీడియోను పోస్టు చేయగా వీడియోకు ముఫ్పైలక్షల వ్యూస్‌ వచ్చాయి.  మంచి స్పందన లభించడంతో..ఈ డ్యాన్స్‌ వీడియోలను మరిన్ని రూపొందించేదుకు వర్క్‌షాపులు నిర్వహించి, తనలాంటి డ్యాన్సర్లను తన టీమ్‌లో చేర్చుకుంది. ఇలా తన టీమ్‌తో ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ పాటలకు ౖహె బ్రిడ్‌ డ్యాన్స్‌  వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పోస్టుచేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. 

ఆడియెన్స్‌ ఇస్తోన్న సలహాలు, సూచనలతో తన డ్యాన్స్‌ను మెరుగుపరుచుకుంటూ పోతోంది. ఇటీవల ఉషా విడుదల చేసిన వీడియోలో ఆమెతోపాటు మితుజా, జనుషా చీరకట్టులో స్టెప్పులేస్తున్నారు. వీరి హైబ్రిడ్‌ డ్యాన్స్‌ వీడియోకు ఇప్పటిదాకా నలభైలక్షల వ్యూస్‌ వచ్చాయి. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉష భరతనాట్యానికి సరికొత్త ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచేలా కనిపిస్తోంది. 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement