
తల్లిదండ్రులు, ప్రశంసపత్రాలతో నిఖిత
నల్లగొండ టూటౌన్ : సంప్రదాయ నృత్యమైన భరతనాట్యంలో రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది నల్లగొండ పట్టణానికి చెందిన గుత్తా రామకృష్ణ – నాగేశ్వరి దంపతుల కుమార్తె దేవీనిఖిత. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న నిఖిత నాలుగేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ పొందుతూ అనేక ప్రదర్శనలు ఇచ్చింది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక బహుమతులు, ప్రశంసపత్రాలు సాధించింది. నిఖితకు చిన్నప్పటినుంచి నృత్య ప్రదర్శనపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి ఎక్కడ పోటీలు జరిగినా తన నృత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటూ బహుమతులు సొతం చేసుకుంటోంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర స్థాయి బతుకమ్మ పోటీల్లో భరతనాట్యంలో కష్టతరమైన నాట్యరీతులను ప్రదర్శించి ఆకట్టుకుని నిర్వాహకుల చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసపత్రం అందకుంది.
జాతీయస్థాయిలో ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యం
నాకు చిన్నప్పటి నుంచే భరతనాట్యం అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచే పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో నృత్యం చేసే దానిని. ఇప్పటికి వందకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. అన్ని చోట్ల ప్రతిభ చూపి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నా. జాతీయ స్థాయిలో నృత్య ప్రదర్శన ఇచ్చి జిల్లాకు పేరు తేవాలలన్నదే నా ఆకాంక్ష.
– దేవీనిఖిత, నల్లగొండ