Indian Green Building Council
-
5 నగరాల్లో క్రెడాయ్ హరిత భవనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) లకి‡్ష్యంచింది. ఇందులో భాగంగా 5 నగరాల్లో హరిత భవనాలను నిర్మించనుంది. ఈ మేరకు క్రెడాయ్ యూత్వింగ్, క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ వ్యవస్థాపక వేడుకలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఎంవోయూ కుదుర్చుకుంది. తొలుత హైదరాబాద్, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, ముంబై నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్‌లను నిర్మిస్తామని.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని క్రెడాయ్ అధ్యక్షుడు సతీష్ మగర్ తెలిపారు. ‘‘రెండు దశాబ్దాలుగా మన దేశం గ్రీన్ బిల్డింగ్ మూమెంట్లో లీడర్‌గా ఉందని, క్యాంపస్, టౌన్‌షిప్స్, సిటీల వంటివి అన్నీ కలిపి 6.8 బిలియన్ చ.అ.లకు పైగా హరిత భవనాలున్నాయని’’ ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్ తెలిపారు. 2012 నుంచి ఐజీబీసీ, క్రెడాయ్ మధ్య ఎంవోయూ కుదుర్చుకోవటం ఇది మూడో సారి. -
గ్రీన్ ప్రొడక్ట్స్ రూ.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకో లేక శివారు ప్రాంతాలకో వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్‌సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. విపణిలోకి 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటివరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నిచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 1044 మిలియన్ చ.అ.ల్లో: ప్రస్తుతం దేశంలో 4,396 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ గుర్తింపు కోసం నమోదు కాగా.. ఇందులో 1,258 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 1,044.66 మిలియన్ చ.అ.ల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో 296 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా 106 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 30 మిలియన్ చ.అ.ల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 57 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా.. 25 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 4 మిలియన్ చ.అ.ల్లో ఉన్నాయి. నిర్మాణ వ్యయం ఎక్కువే, కానీ.. సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3–5 శాతం ధర ఎక్కువ అవుతుంది. కానీ, భవనంలోని విద్యుత్, నీటి వంటి నిర్వహణ వ్యయం ఆదాతో దీని 2–3 ఏళ్లలో తిరిగి పొందవచ్చని ఐజీబీసీ హై దరాబాద్ చాప్టర్ సీ శేఖర్ రెడ్డి చెప్పారు. గ్రీన్ బిల్డింగ్స్‌లో 30–40 శాతం విద్యుత్, 20–30 శాతం నీరు అదా అవుతుందన్నారు. -
13 కోట్ల చ.అ. 310 గ్రీన్ బిల్డింగ్స్
సాక్షి, హైదరాబాద్: సాధ్యమైనంత వరకూ సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిధ్యాన్ని కాపాడే నిర్మాణాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) హరిత భవనాలుగా గుర్తిస్తుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే గ్రీన్ బిల్డింగ్స్ ప్రధాన ఉద్దేశం. ఐజీబీసీ రేటింగ్స్ ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తో పాటూ బేసిక్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్ స్కేపింగ్ మీద ఆధారపడి రేటింగ్స్ ఉంటాయి. విద్యుత్, నీటి వినియోగంలో తేడా.. అందుబాటు గృహాలతో పోలిస్తే ప్లాటినం, గోల్డ్ రేటింగ్ గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణ వ్యయం 2 శాతం ఎక్కువవుతుంది కానీ, హరిత భవనాల్లో ఇంధన వనరుల వినియోగం మాత్రం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో విద్యుత్ వినియోగం 40 శాతం, నీటి వినియోగం 30 శాతం వరకు తక్కువగా ఉంటుంది. పర్యావరణం పరంగా చూస్తే.. 10 లక్షల చ.అ. గ్రీన్ బిల్డింగ్స్‌తో 15 వేల మెగావాట్ల (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్, 45 వేల కిలో లీటర్ల (కేఎల్) నీటి వినియోగం, 12 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 450 టన్నుల నిర్మాణ వ్యర్థాల విడుదల తగ్గుతుంది. 17 ఐజీబీసీ మెట్రో స్టేషన్లు.. ప్రస్తుతం మన దేశంలో 633 కోట్ల చ.అ.ల్లో 4,794 హరిత భవనాలున్నాయి. 2022 నాటికి వెయ్యి కోట్ల చ.అ.లకు చేర్చాలన్నది లక్ష్యం. విభాగాల వారీగా పరిశీలిస్తే.. 12.50 లక్షల నివాస భవనాలు, 250 ఫ్యాక్టరీలు, 1,600 కార్యాలయాలు, 45 టౌన్‌షిప్స్, 335 ట్రాన్సిట్స్, 13 గ్రామాలు, 8 నగరాలు గ్రీన్ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి. తెలంగాణలో 13 కోట్ల చ.అ.ల్లో 310, ఆంధ్రప్రదేశ్‌లో 73 ఐజీబీసీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అసెండస్ వీఐటీ పార్క్, హెచ్ఎంఆర్ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆర్బీఐ సీనియర్ ఆఫీసర్స్ క్వార్టర్స్ వంటివి వీటిల్లో కొన్ని. ఇటీవలే ట్రాన్సిట్ విభాగంలో 17 హైదరాబాద్ మెట్రో స్టేషన్లు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందాయి. ఇతర నగరాల్లో ఐజీబీసీ గణాంకాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 1,362, ఉత్తర్ ప్రదేశ్‌లో 468, కర్ణాటకలో 414, చెన్నైలో 412, వెస్ట్ బెంగాల్లో 308 ప్రాజెక్ట్‌లున్నాయి. 300 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. ఫ్లయాష్ బ్రిక్స్, వాల్ అండ్ రూఫ్ ఇన్సులేషన్, లో వీఓసీ పెయింట్స్, సీఆర్ఐ సర్టిఫైడ్ కార్పెట్స్, ఎఫ్ఎస్సీ సర్టిఫైడ్ వుడ్, గ్లాస్ వంటివి హరిత భవనాల నిర్మాణ సామగ్రి. వాటర్‌లెస్ యూరినల్స్, సీఓ2 సెన్సార్, విండ్ టవర్స్ వంటివి గృహ ఉత్పత్తుల కిందికి వస్తాయి. 90 శాతం హరిత భవనాల నిర్మాణ సామగ్రి మన దేశంలోనే లభ్యమవుతున్నాయి. 2025 నాటికి దేశంలో హరిత భవనాల నిర్మాణ సామగ్రి పరిశ్రమ 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. నవంబర్ 1 నుంచి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నవంబర్ 1– 3 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 16వ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2018 జరుగనుంది. ఈ కార్యక్రమంలో 2 వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచ దేశాల నుంచి 25 మంది స్పీకర్స్ ఉంటారు. ముఖ్య అతిథిగా పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ పాల్గొననున్నారు. తెలంగాణలో ప్రోత్సాహకాలెన్నడో? తెలంగాణలోనూ ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి సూచిస్తున్నారు. ♦ డెవలపర్లు హరిత నిర్మాణాల వైపు మొగ్గు చూపేలా పర్మిట్ ఫీజులో 20 శాతం, ఇంపాక్ట్ ఫీజులో 20 శాతం తగ్గించాలి. ♦ రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న భవనాల మీద రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునేలా అదనపు అంతస్తు నిర్మించుకుంటే ఆయా భవనాలను క్రమబద్ధీకరించాలి. ఒకవేళ కొత్త భవనాలపై రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకుంటే సెట్‌బ్యాక్‌లో మినహాయింపునివ్వాలి. ♦ ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లకు మూడేళ్ల పాటు వాటర్ అండ్ సీవరేజ్ టారిఫ్‌ను 10 శాతం తగ్గించాలి. ♦ ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పర్మిట్ ఫీజులో 20 శాతం, స్టాంప్ డ్యూటీ సర్చార్జీలో 20 శాతం తగ్గుదల ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ, భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో గమనిస్తే.. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ 5 శాతం అదనపు ఫ్లోర్ ఏరియా రేషియో (ఎఫ్ఏఆర్), మహారాష్ట్ర, జార్ఖండ్‌లో 3–7 శాతం, హరియాణాలో 9–15 శాతం, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో 10 శాతం ఎఫ్ఏఆర్ ఉంది. -
పర్యావరణ అనుకూల ఉత్పత్తులకూ రేటింగ్
* తొలుత భవన నిర్మాణ ఉత్పత్తులకు వర్తింపు * సాక్షితో సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఈడీ రఘుపతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు రేటింగ్ విధానాన్ని 2015 జనవరిలో పరిచయం చేసేందుకు సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సమాయత్తమవుతోంది. ముందుగా భవన నిర్మాణంలో ఉపయోగించే ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను వర్తింపచేస్తారు. ఆ తర్వాత తయారీ రంగ పరిశ్రమలు వినియోగించే పనిముట్లు, మోటార్లు, కంప్రెసర్లు వంటి వాటికి విస్తరిస్తారు. మూడేళ్లలో 1,000 ఉత్పత్తులు గ్రీన్ రేటింగ్ పరిధిలోకి తేవాలని ఐజీబీసీ కృతనిశ్చయంతో ఉంది. 2020 నాటికి అన్ని ఉత్పత్తులు అంటే దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవాటికి వర్తింపజేయాలన్నది ప్రణాళిక అని సీఐఐ సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్ సం దర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రేటింగ్ ఇలా ఇస్తారు.. ఉత్పత్తి పనితీరు, వాడిన ముడి పదార్థాలు, తయారీ కేంద్రం పర్యావరణ అనుకూలమా కాదా వంటి అంశాల ఆధారంగా ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను ఇస్తారు. సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో ఈ విధానం అమలులో ఉందని రఘుపతి తెలిపారు. ఎక్కువ ప్రమాణాలతో రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఉద్దేశమని చెప్పారు. గ్రీన్ రేటెడ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు. ప్రస్తుతం వాణిజ్య, నివాస భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, సిమెంటు, పేపర్, చక్కర, రసాయనాలు, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమ, సెజ్‌లకు ఐజీబీసీ రేటింగ్ ఇస్తోంది. విద్యుత్, నీటి ఆదా, నిర్మాణం తీరునుబట్టి ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తోపాటు సర్టిఫై వంటి రేటింగ్ ఇస్తారు. 100 ఎస్ఎంఈలకు.. 2017 నాటికి 100 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్రీన్ రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఆలోచన. ఇప్పటికే నడుస్తున్న ప్లాంట్లకే ఈ రేటింగ్ వర్తింపజేస్తారు. ప్లాంట్లలో కొన్ని మార్పులు, కొంత పెట్టుబడి అవసరం కావొచ్చని ఐజీబీసీ చెబుతోంది. రేటింగ్ పొందిన ప్లాంట్లలో విద్యుత్ 30 శాతం, నీటి వినియోగం 50 శాతం దాకా ఆదా అవుతుందని వెల్లడించింది. అలాగే ఇప్పటికే నిర్మితమైన భవనాలనూ రేటింగ్ పరిధిలోకి తేనున్నారు. మాదాపూర్ ప్రాంతంలో రెండేళ్లలో 25 భవనాలను ఐజీబీసీ లక్ష్యంగా చేసుకుంది.