పర్యావరణ అనుకూల ఉత్పత్తులకూ రేటింగ్
* తొలుత భవన నిర్మాణ ఉత్పత్తులకు వర్తింపు
* సాక్షితో సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఈడీ రఘుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు రేటింగ్ విధానాన్ని 2015 జనవరిలో పరిచయం చేసేందుకు సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సమాయత్తమవుతోంది. ముందుగా భవన నిర్మాణంలో ఉపయోగించే ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను వర్తింపచేస్తారు. ఆ తర్వాత తయారీ రంగ పరిశ్రమలు వినియోగించే పనిముట్లు, మోటార్లు, కంప్రెసర్లు వంటి వాటికి విస్తరిస్తారు. మూడేళ్లలో 1,000 ఉత్పత్తులు గ్రీన్ రేటింగ్ పరిధిలోకి తేవాలని ఐజీబీసీ కృతనిశ్చయంతో ఉంది. 2020 నాటికి అన్ని ఉత్పత్తులు అంటే దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవాటికి వర్తింపజేయాలన్నది ప్రణాళిక అని సీఐఐ సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్ సం దర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
రేటింగ్ ఇలా ఇస్తారు..
ఉత్పత్తి పనితీరు, వాడిన ముడి పదార్థాలు, తయారీ కేంద్రం పర్యావరణ అనుకూలమా కాదా వంటి అంశాల ఆధారంగా ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను ఇస్తారు. సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో ఈ విధానం అమలులో ఉందని రఘుపతి తెలిపారు. ఎక్కువ ప్రమాణాలతో రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఉద్దేశమని చెప్పారు. గ్రీన్ రేటెడ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు. ప్రస్తుతం వాణిజ్య, నివాస భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, సిమెంటు, పేపర్, చక్కర, రసాయనాలు, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమ, సెజ్‌లకు ఐజీబీసీ రేటింగ్ ఇస్తోంది. విద్యుత్, నీటి ఆదా, నిర్మాణం తీరునుబట్టి ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తోపాటు సర్టిఫై వంటి రేటింగ్ ఇస్తారు.
100 ఎస్‌ఎంఈలకు..
2017 నాటికి 100 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్రీన్ రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఆలోచన. ఇప్పటికే నడుస్తున్న ప్లాంట్లకే ఈ రేటింగ్ వర్తింపజేస్తారు. ప్లాంట్లలో కొన్ని మార్పులు, కొంత పెట్టుబడి అవసరం కావొచ్చని ఐజీబీసీ చెబుతోంది. రేటింగ్ పొందిన ప్లాంట్లలో విద్యుత్ 30 శాతం, నీటి వినియోగం 50 శాతం దాకా ఆదా అవుతుందని వెల్లడించింది. అలాగే ఇప్పటికే నిర్మితమైన భవనాలనూ రేటింగ్ పరిధిలోకి తేనున్నారు. మాదాపూర్ ప్రాంతంలో రెండేళ్లలో 25 భవనాలను ఐజీబీసీ లక్ష్యంగా చేసుకుంది.