Rating system
-
అదానీ గ్రూప్ కంపెనీకి ‘రేటింగ్’ అప్‌గ్రేడ్?
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కంపెనీల్లో ఒకదానికి త్వరలో భారతదేశ సావరిన్ (సార్వభౌమ) రేటింగ్ కంటే (బీబీబీ–) ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేషిందర్ సింగ్ (రాబీ) తాజా గ్రూప్ ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే అదానీ గ్రూప్‌లోని ఒక కంపెనీకి మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ లభించినట్లవుతుంది. భారత్ దేశానికి ఎస్అండ్పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఇస్తున్న ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీబీబీ–’ చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ. ప్రభుత్వరంగంసహా దేశంలోని పలు కంపెనీలకు ఈ రేటింగ్ సమానమైన లేదా ఇంతకంటే తక్కువ రేటింగ్‌ను కలిగిఉన్నాయి. గత ఏడాది రిలయన్స్ రేటింగ్స్ పెంపు గత ఏడాది జూన్ 24వ తేదీన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్స్‌ను ‘బీబీబీ–’ నుంచి ఒక అంచ– బీబీబీకి అప్‌గ్రేడ్ చేస్తూ ఫిచ్ రేటింగ్స్ నిర్ణయం తీసుకుంది. సంస్థ రుణ పరిస్థితులు మెరుగుపడ్డం దీనికి కారణం. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇందులో అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు భారత్ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. ఫిచ్ ‘బీబీబీ– (నెగటివ్ అవుట్‌లుక్) సంస్థకు ఉంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ మూడు సంస్థలు భారత్‌కు కూడా ఇదే విధమైన రేటింగ్‌ను అందిస్తున్నాయి. ఇది చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగంఅదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు కూడా భారతదేశ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో కంపెనీ చేసిన విజ్ఞప్తిపై ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్‌కు గురువారం తన రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. కాగా, తాజా వార్తలపై స్పందనకుగాను పంపిన ఈ మెయిల్ ప్రశ్నకు అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు. రేటింగ్ అంటే... ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
పర్యావరణ అనుకూల ఉత్పత్తులకూ రేటింగ్
* తొలుత భవన నిర్మాణ ఉత్పత్తులకు వర్తింపు * సాక్షితో సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఈడీ రఘుపతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు రేటింగ్ విధానాన్ని 2015 జనవరిలో పరిచయం చేసేందుకు సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సమాయత్తమవుతోంది. ముందుగా భవన నిర్మాణంలో ఉపయోగించే ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను వర్తింపచేస్తారు. ఆ తర్వాత తయారీ రంగ పరిశ్రమలు వినియోగించే పనిముట్లు, మోటార్లు, కంప్రెసర్లు వంటి వాటికి విస్తరిస్తారు. మూడేళ్లలో 1,000 ఉత్పత్తులు గ్రీన్ రేటింగ్ పరిధిలోకి తేవాలని ఐజీబీసీ కృతనిశ్చయంతో ఉంది. 2020 నాటికి అన్ని ఉత్పత్తులు అంటే దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవాటికి వర్తింపజేయాలన్నది ప్రణాళిక అని సీఐఐ సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్ సం దర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రేటింగ్ ఇలా ఇస్తారు.. ఉత్పత్తి పనితీరు, వాడిన ముడి పదార్థాలు, తయారీ కేంద్రం పర్యావరణ అనుకూలమా కాదా వంటి అంశాల ఆధారంగా ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను ఇస్తారు. సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో ఈ విధానం అమలులో ఉందని రఘుపతి తెలిపారు. ఎక్కువ ప్రమాణాలతో రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఉద్దేశమని చెప్పారు. గ్రీన్ రేటెడ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు. ప్రస్తుతం వాణిజ్య, నివాస భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, సిమెంటు, పేపర్, చక్కర, రసాయనాలు, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమ, సెజ్‌లకు ఐజీబీసీ రేటింగ్ ఇస్తోంది. విద్యుత్, నీటి ఆదా, నిర్మాణం తీరునుబట్టి ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తోపాటు సర్టిఫై వంటి రేటింగ్ ఇస్తారు. 100 ఎస్ఎంఈలకు.. 2017 నాటికి 100 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్రీన్ రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఆలోచన. ఇప్పటికే నడుస్తున్న ప్లాంట్లకే ఈ రేటింగ్ వర్తింపజేస్తారు. ప్లాంట్లలో కొన్ని మార్పులు, కొంత పెట్టుబడి అవసరం కావొచ్చని ఐజీబీసీ చెబుతోంది. రేటింగ్ పొందిన ప్లాంట్లలో విద్యుత్ 30 శాతం, నీటి వినియోగం 50 శాతం దాకా ఆదా అవుతుందని వెల్లడించింది. అలాగే ఇప్పటికే నిర్మితమైన భవనాలనూ రేటింగ్ పరిధిలోకి తేనున్నారు. మాదాపూర్ ప్రాంతంలో రెండేళ్లలో 25 భవనాలను ఐజీబీసీ లక్ష్యంగా చేసుకుంది.