న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కంపెనీల్లో ఒకదానికి త్వరలో భారతదేశ సావరిన్ (సార్వభౌమ) రేటింగ్ కంటే (బీబీబీ–) ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదానీ గ్రూప్ సీఎఫ్‌ఓ జుగేషిందర్ సింగ్ (రాబీ) తాజా గ్రూప్ ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ కంపెనీ పేరును మాత్రం ఆయన వెల్లడించలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదే జరిగితే అదానీ గ్రూప్‌లోని ఒక కంపెనీకి మొట్టమొదటిసారి భారత్ సావరిన్ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ లభించినట్లవుతుంది. భారత్ దేశానికి ఎస్‌అండ్‌పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఇస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్ ‘బీబీబీ–’ చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ. ప్రభుత్వరంగంసహా దేశంలోని పలు కంపెనీలకు ఈ రేటింగ్ సమానమైన లేదా ఇంతకంటే తక్కువ రేటింగ్‌ను కలిగిఉన్నాయి.
గత ఏడాది రిలయన్స్ రేటింగ్స్ పెంపు
గత ఏడాది జూన్ 24వ తేదీన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్స్‌ను ‘బీబీబీ–’ నుంచి ఒక అంచ– బీబీబీకి అప్‌గ్రేడ్ చేస్తూ ఫిచ్ రేటింగ్స్ నిర్ణయం తీసుకుంది. సంస్థ రుణ పరిస్థితులు మెరుగుపడ్డం దీనికి కారణం. అదానీ గ్రూప్‌లో ఆరు లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి. ఇందులో అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు భారత్ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. ఫిచ్ ‘బీబీబీ– (నెగటివ్ అవుట్‌లుక్) సంస్థకు ఉంది. ఎస్‌అండ్‌పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను ఇస్తోంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది.
ఈ మూడు సంస్థలు భారత్‌కు కూడా ఇదే విధమైన రేటింగ్‌ను అందిస్తున్నాయి. ఇది చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. గ్రూప్ పునరుత్పాదక ఇంధన విభాగంఅదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు కూడా భారతదేశ సావరిన్ రేటింగ్‌కు సమానమైన రేటింగ్ ఉంది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో కంపెనీ చేసిన విజ్ఞప్తిపై ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు గురువారం తన రేటింగ్‌ను ఉపసంహరించుకుంది. కాగా, తాజా వార్తలపై స్పందనకుగాను పంపిన ఈ మెయిల్ ప్రశ్నకు అదానీ గ్రూప్ నుంచి ఎటువంటి సమాచారం లేదు.
రేటింగ్ అంటే...
ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment