వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందన ఇది | Gautam Adani Reacts on Work Life Balance Debate After Narayana Murthy Call 70 Hour Workweek | Sakshi
Sakshi News home page

వారానికి 70 గంటల పనిపై అదానీ స్పందన ఇది

Published Tue, Dec 31 2024 5:09 PM | Last Updated on Tue, Dec 31 2024 5:56 PM

Gautam Adani Reacts on Work Life Balance Debate After Narayana Murthy Call 70 Hour Workweek

ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) వారానికి 70 గంటలు పనిచేస్తే భారత్ అభివృద్ధి చెందుతుందని వెల్లడించిన విషయం అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఈ విషయంపై దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

భారతదేశంలో వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ డిబేట్‌పై గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. పని & జీవితం మధ్య సమతుల్యతను సాధించడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే 'ఒక వ్యక్తి ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య అతన్ని విడిచి పారిపోతుంది' అని అన్నారు.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్
వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ అనేది వ్యక్తిని ఆనందింపజేయాలని, మీరు చేసే పని మీకు నచ్చితే.. లైఫ్ బ్యాలెన్స్ అవుతుందని అదానీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో గడపడానికి రోజుకు కనీసం నాలుగు కేటాయించాలని ఆయన సూచించారు. వ్యక్తిగత జీవితాన్ని విస్మరించడం వల్ల కలిగే పరిణామాల గురించి కూడా వివరించారు.

వారానికి 70 గంటల పని
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్‌లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు.

పని గంటలు పెంచకపోతే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడటం అసాధ్యం అని నారాయణ మూర్తి అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, జర్మన్ దేశంలో ప్రతి వ్యక్తి.. దేశాభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నారాయణ మూర్తి వ్యాఖ్యలపై విమర్శలు
వారానికి 70 గంటలు పనిచేయాలి అని పేర్కొన్న నారాయణ మూర్తి వ్యాఖ్యలను పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్‌ ఫౌండర్‌, చైర్‌పర్సన్‌, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) తప్పుపట్టారు. ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' కూడా 70 గంటల పనిని కండించారు. ఇప్పుడు తాజాగా గౌతమ్ అదానీ కూడా ఆ వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.

ఇదీ చదవండి: అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!

గౌతమ్ అదానీ
భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ దిగ్గజ పారిశ్రామిక వేత్తలలో ఒకరు. ఈయన నికర విలువ రూ. ఆరు లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఈయన సారథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement