Environmentally friendly products
-
ఆరోగ్యానికి ‘ప్లానెట్ ఫ్రెండ్లీ’ డైట్
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుకూల ఆహారం (ప్లానెట్ ఫ్రెండ్లీ డైట్) అనారోగ్య కారణాలతో సంభవించే మరణాల ముప్పును తగ్గిస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. పర్యావరణ అనుకూల ఆహారం తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, స్ట్రోక్, గుండె, శ్వాస వ్యాధుల నుంచి వచ్చే మరణాలు 25 శాతం తగ్గుతాయని తాజా అధ్యయనంలో తేల్చారు. మాంసం, చేపలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకునే వారితో పోలిస్తే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు అధికంగా పోషకాలు ఉండే మొక్కల ఆధారిత ఆహారాన్ని తినే వారిలో మరణాల అవకాశం తక్కువగా ఉందని స్పష్టం చేశారు. దాదాపు 30 ఏళ్ల పరిశోధనలో లక్ష మందికి పైగా ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశారు. ఈ క్రమంలోనే అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ వార్షిక సమావేశంలో న్యూట్రిషన్–2023లో పర్యావరణ అనుకూల ఆహార వినియోగంపై ప్లానెటరీ హెల్త్ డైట్ ఇండెక్స్ పేరుతో కొత్త డైట్ స్కోర్‌ను ప్రతిపాదించారు. దీనిని నీరు, భూ వినియోగంతో పాటు కర్బన ఉద్గారాలను పరిమితం చేసి పర్యావరణంపై తక్కువ నష్టం చూపించే ఆహారంగా పేర్కొన్నారు. 1986లో మొదలుపెట్టి.. ఆరోగ్యం, పర్యావరణం రెండింటిపై ఆహార ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ, శాస్త్రీయ ఆధారాలతో డైట్ స్కోర్‌ను ప్రతిపాదించారు. 1986 నుంచి 2018 వరకు లక్ష మంది అధ్యయనంలో పాల్గొన్నారు. ఇందులో 47 వేల మంది మరణించారు. ఎక్కువ పీహెచ్డీఐ స్కోరు ఉన్న వారికి మరణాల అవకాశాలు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులతో మరణించే అవకాశం 50 శాతం, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులతో మరణించే అవకాశం 20 శాతం, క్యాన్సర్/గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 15 శాతం వరకు తక్కువ ఉన్నట్టు నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆహారపు అలవాట్లు సంస్కృతుల నేపథ్యంలో ఆయా దేశాలు పీహెచ్డీఐలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. మాంసం ద్వారానే కర్బన ఉద్గారాలు ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో ఆహార ఉత్పత్తి రంగం వాటా 35 శాతం ఉంది. వీటిలో 57 శాతం మాంసం, పాల ఉత్పత్తుల నుంచే వస్తోంది. ఒక కిలో ఆహారంలో కర్బన ఉద్గారాలు గొడ్డు మాంసం వల్ల అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. ఆ తర్వాత గొర్రె, షెల్ఫిష్, డెయిరీ ఉత్పత్తులు ప్రాసెసింగ్, రవాణాతో మరిన్ని ఉద్గారాలు వెలువడుతున్నాయి. వీటికి పూర్తి భిన్నంగా గింజలు, పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు కిలో గ్రాము ఆహారానికి అతి తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారా లను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మొక్కల ఆధారిత ఆహారం పర్యావరణంపై చేసే నష్టం తక్కువగా ఉంటుంది. మాంసాహారం కోసం విచ్చలవిడిగా పశువుల ను పెంచడం పెను సమస్యలను తెచ్చిపెడుతోంది. పశువులకు కావాల్సిన ఆహారం కోసం/పశుగ్రాసం పెంచడానికి అడవుల నరికివేతతో వాతావరణంలోకి టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. పశువులు, గొర్రెలు, మేకలు ఆహారాన్ని జీర్ణం చేసే టప్పుడు గాలిలో మీథేన్ విడుదల పెరిగిపోతోంది. -
చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు
న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో అవి ధరల్ని పెంచటం మొదలెట్టాయి. కానీ, రూపాయి రివకరీతో వినియోగదారులకు లాభించిందేమీ లేదు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు రెండో విడత ధరల పెంపును నిలిపివేసినప్పటకీ, గృహోపకరణాల తయారీ సంస్థలు మాత్రం ధరల్ని పెంచుతూనే ఉన్నాయి. దీనికి కారణం అధిక కస్టమ్స్ డ్యూటీయేనని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. రూపాయి డాలర్‌తో 67–68 స్థాయి పైనే ఉందని, తమ తయారీ వ్యయాలన్నీ గతంలో ఈ స్థాయి ఆధారంగానే అంచనా వేసినవని వారు చెబుతున్నారు. దీంతో తమ మార్జిన్లపై ఒత్తిడి ఉందంటున్నారు. ‘‘దిగుమతి చేసుకునే ఖరీదైన ఉత్పత్తుల ఎంఆర్పీలను 7– 10 శాతం మధ్యలో పెంచడం జరిగింది. మధ్య స్థాయి ఉత్పత్తులపై ఈ పెంపు 4–5 శాతం మధ్యనే ఉంది’’ అని హేయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రజంగ తెలిపారు. మరోవైపు శామ్సంగ్, ఎల్జీ కంపెనీలు రానున్న వారాల్లో ధరల పెంపును అమలు చేయనున్నట్లు తెలిసింది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు తదితర ఉత్పత్తులపై 3–5 శాతం మేర పెంపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏసీలపై త్వరలోనే బాదుడు ఇక ఏసీ తయారీ కంపెనీలు 2019 సీజన్‌కు ముందు తయారయ్యే నూతన స్టాక్‌పై వచ్చే నెలలో రేట్లు పెంచొచ్చని అంచనా. దిగుమతి చేసుకునే వాటి ధరలు పెరగడమే దీనికి కారణం. దేశీయ ఏసీ పరిశ్రమలో 30% దిగుమతి ఆధారితంగా తయారయ్యేవేనని ఎడెల్వీజ్ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పోలిస్తే ఏసీల్లో ఎక్కువ విడి భాగాలు దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. చైనా, థాయిలాండ్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి ఇవి దిగుమతవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లపై (10 కిలోల కంటే తక్కువ లోడ్) బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10% కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో పెంచింది. దీంతో ఈ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ 20 శాతానికి చేరింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వాడే కంప్రెషర్లపై కస్టమ్స్ సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయం తర్వాత చాలా వరకు కంపెనీలు ఉత్పత్తులపై రేట్లను పెంచాయి. అయితే, ఆ వెంటనే పండుగలు ఉండడంతో ధరల పెంపును మాత్రం వెంటనే అమలు చేయలేదు. ఆ పెంపును ఇప్పుడు అమల్లో పెడుతున్నట్టు గోద్రేజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్‌నంది తెలిపారు. పండుగల సందర్భంగా వ్యాపారులకిచ్చిన తగ్గింపులు, సబ్సిడీలను కూడా ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. రూపాయి మారకం విలువలో ఆటుపోట్ల కారణంగా గత ఏడాది కాలంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను మూడు సార్లు పెంచాయి. గతేడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో మూడు సార్లు కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. -
పర్యావరణ అనుకూల ఉత్పత్తులకూ రేటింగ్
* తొలుత భవన నిర్మాణ ఉత్పత్తులకు వర్తింపు * సాక్షితో సీఐఐ గోద్రెజ్ జీబీసీ ఈడీ రఘుపతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు రేటింగ్ విధానాన్ని 2015 జనవరిలో పరిచయం చేసేందుకు సీఐఐకి చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సమాయత్తమవుతోంది. ముందుగా భవన నిర్మాణంలో ఉపయోగించే ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను వర్తింపచేస్తారు. ఆ తర్వాత తయారీ రంగ పరిశ్రమలు వినియోగించే పనిముట్లు, మోటార్లు, కంప్రెసర్లు వంటి వాటికి విస్తరిస్తారు. మూడేళ్లలో 1,000 ఉత్పత్తులు గ్రీన్ రేటింగ్ పరిధిలోకి తేవాలని ఐజీబీసీ కృతనిశ్చయంతో ఉంది. 2020 నాటికి అన్ని ఉత్పత్తులు అంటే దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నవాటికి వర్తింపజేయాలన్నది ప్రణాళిక అని సీఐఐ సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.రఘుపతి శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్ సం దర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రేటింగ్ ఇలా ఇస్తారు.. ఉత్పత్తి పనితీరు, వాడిన ముడి పదార్థాలు, తయారీ కేంద్రం పర్యావరణ అనుకూలమా కాదా వంటి అంశాల ఆధారంగా ఉత్పత్తులకు గ్రీన్ రేటింగ్‌ను ఇస్తారు. సింగపూర్, జర్మనీ తదితర దేశాల్లో ఈ విధానం అమలులో ఉందని రఘుపతి తెలిపారు. ఎక్కువ ప్రమాణాలతో రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఉద్దేశమని చెప్పారు. గ్రీన్ రేటెడ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది కంపెనీలకు కలిసి వచ్చే అంశమని అన్నారు. ప్రస్తుతం వాణిజ్య, నివాస భవనాలు, పాఠశాలలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, సిమెంటు, పేపర్, చక్కర, రసాయనాలు, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమ, సెజ్‌లకు ఐజీబీసీ రేటింగ్ ఇస్తోంది. విద్యుత్, నీటి ఆదా, నిర్మాణం తీరునుబట్టి ప్లాటినం, గోల్డ్, సిల్వర్‌తోపాటు సర్టిఫై వంటి రేటింగ్ ఇస్తారు. 100 ఎస్ఎంఈలకు.. 2017 నాటికి 100 చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్రీన్ రేటింగ్ ఇవ్వాలన్నది ఐజీబీసీ ఆలోచన. ఇప్పటికే నడుస్తున్న ప్లాంట్లకే ఈ రేటింగ్ వర్తింపజేస్తారు. ప్లాంట్లలో కొన్ని మార్పులు, కొంత పెట్టుబడి అవసరం కావొచ్చని ఐజీబీసీ చెబుతోంది. రేటింగ్ పొందిన ప్లాంట్లలో విద్యుత్ 30 శాతం, నీటి వినియోగం 50 శాతం దాకా ఆదా అవుతుందని వెల్లడించింది. అలాగే ఇప్పటికే నిర్మితమైన భవనాలనూ రేటింగ్ పరిధిలోకి తేనున్నారు. మాదాపూర్ ప్రాంతంలో రెండేళ్లలో 25 భవనాలను ఐజీబీసీ లక్ష్యంగా చేసుకుంది.