వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణీకరణకు పెను ప్రమాదం
ద్రవ్యోల్బణం సమస్యలు తీవ్రమయ్యే పరిస్థితి
మూడీస్ రేటింగ్స్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్‌లో నీటి కొరత ఎకానమీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న నీటి కొరత వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అంతరాయం కలిగిస్తుందని అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు, ఆదాయంలో క్షీణతకు, సామాజిక అశాంతికి దారితీయవచ్చనివిశ్లేషించింది. ఆయా ప్రభావాలు సావరిన్ క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం చూపుతుందని సూచించింది. బొగ్గు విద్యుత్ జనరేటర్లు, ఉక్కు తయారీ వంటి నీటిని అధికంగా వినియోగించే రంగాల ప్రయోజనాలకు సైతం నీటి కొరత విఘాతం కలిగిస్తుందని హెచ్చరించింది.
భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో నీటి లభ్యత తగ్గుతుండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అలాగే వాతావరణ మార్పుల కారణంగా నీటి ఒత్తిడి తీవ్రమవుతోందని కూడా పేర్కొంది. వాతావరణ మార్పులు కరువు, తీవ్ర వేడి, వరదలు వంటి తీవ్రమైన సంఘటనలకు కారణమవుతాయని వివరించింది. భారత్ ఎదుర్కొంటున్న వాతావరణ సమస్యలపై మూడీస్ రేటింగ్స్ వెలువరించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
👉ఢిల్లీ, ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు జూన్ 2024లో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారతదేశంలోని అత్యంత సాధారణ ప్రకృతి వైపరీత్యాలలో వరదలు కూడా కారణం. ఇది నీటి మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగిస్తాయి. ఆకస్మిక భారీ వర్షాల నుండి నీటిని నిలుపుకోవడం సాధ్యమయ్యే పనికాదు.
👉 2023లో ఉత్తర భారతదేశంలోని వరదలు, గుజరాత్‌లోని బిపార్జోయ్ తుఫాను కారణంగా 1.2–1.8 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన విషయం ఇక్కడ గమనార్హం.
👉 రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా తగ్గుతోంది. 1950–2020 సమయంలో హిందూ మహాసముద్రం దశాబ్దానికి 1.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కింది. ఇది 2020–2100 మధ్యకాలంలో 1.7–3.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలపడం గమనార్హం.
👉 వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులు తరచూ సంభవించే అవకాశాలు ఉత్పన్నమవుతున్నాయి. భారతదేశంలో రుతుపవన వర్షపాతం 2023లో 1971–2020 సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది. అకాల వర్షాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. భారతదేశంలో 70 శాతానికి పైగా వర్షపాతం ప్రతి సంవత్సరం జూన్–సెపె్టంబరులో కేంద్రీకృతమై ఉంటోంది. 2023 ఆగస్టులో దేశంలో భారీగా వర్షపాతం నమోదుకావడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.
👉 గతంలో సంభవించి న వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకాలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుదల వల్ల ఆహార సబ్సిడీల భారం నెలకొంది. ఇది దేశంలో ద్రవ్యలోటు పరిస్థితులకూ దారితీసింది. ఆహార సబ్సిడీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేంద్ర ప్రభుత్వ వ్యయంలో 4.3 శాతంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌లోని భారీ కేటాయింపుల్లో ఈ విభాగం ఒకటి.
👉భారత ప్రభుత్వం నీటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి కృషి చేస్తోంది. అదే సమయంలో నీటి భారీ పారిశ్రామిక వినియోగదారులు తమ నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అటు దేశానికి సంబంధించి సావరిన్ రేటింగ్ మెరుగుపరచుకోడానికి, కంపెనీలకు సంబంధించి దీర్ఘకా లికంగా నీటి నిర్వహణ ప్రతికూలత రేటింగ్‌లను తగ్గించుకోవడానికి దోహదపడతాయి.
👉భారతదేశంలో ఫైనాన్స్ మార్కెట్ చిన్నది. కానీ వే గంగా అభివృద్ధి చెందుతోంది. కంపెనీలకు, ప్రాంతీయ ప్రభుత్వాలకు నిధుల సేకరణ విషయంలో ఇది కీలకమైన అంశం. తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న కొన్ని రాష్ట్రాలు నీటి నిర్వహణలో పెట్టుబడి కోసం నిధులను సమీకరించడానికి దేశ ఫైనాన్స్ మార్కెట్‌ను ఉపయోగించాయి.
👉పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. 2022 లెక్కల ప్రకారం, భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 26 శాతం. ఇప్పటికి జీ–20 వర్థమాన దేశాల (ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 32 శాతం) కన్నా ఇది తక్కువ. మున్ముందు పరిశ్రమల రంగం మరింత విస్తరించే వీలుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు దేశ మొత్తం జనాభాలో ప్రస్తుతం 36 శాతం. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం, జీ–20 వర్థమాన దేశాల్లో ఇది 76 శాతం వరకూ ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు –నివాసితుల మధ్య మున్ముందు నీటి కోసం తీవ్ర పోటీ నెలకొనే వీలుంది.
👉ఫిబ్రవరి 2023 నాటి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని తీసుకురావడానికి భార త ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బహుళజాతి బ్యాంకింగ్ (ప్రపంచబ్యాంక్) మద్దతు ఇచ్చింది. 1.2 బిలియన్ డాలర్ల మొత్తం ఫైనా న్సింగ్‌తో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 2 కోట్ల మంది ప్రయోజనం పొందారు.
జలవనరుల శాఖ డేటా
జలవనరుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారత్ సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 2021 నాటికి 1,486 క్యూబిక్ మీటర్ల నుండి 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు పడిపోవచ్చు. 1,700 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువ స్థాయి నీటి ఒత్తిడిని సూచిస్తుంది. 1,000 క్యూబిక్ మీటర్లకు పడిపోతే అది నీటి కొరతకు కొలమానం.
నివేదిక నేపథ్యం ఇదీ..
ఇటీవల బెంగళూరు, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నివాసితులు తీవ్ర నీటి నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు నిరసనలు, రాజకీయ సంఘర్షణకు దారితీస్తోంది. ఈ అంశంపై జూన్ 21న నిరాహార దీక్ష ప్రారంభించిన ఢిల్లీ జల వనరుల మంత్రి అతిషి ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మూడీస్ తాజా నివేదిక వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment