ముంబై: తాజ్ బ్రాండ్ కింద లగ్జరీ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) సౌదీ అరేబియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ముస్లింలు పవిత్రంగా భావించే, మహమ్మద్ ప్రవక్త జన్మ స్థలమైన మక్కా నగరంలో తొలి హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దీని కోసం ఉమ్ అల్ ఖురా డెవలప్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఐహెచ్‌సీఎల్ తెలిపింది.
కాగా మక్కాలోని ఒకానొక అతిపెద్ద, కీలక అర్బన్ రెజువనేషన్ ప్రాజెక్ట్ అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటైన జాయింట్ స్టాక్ కంపెనీయే ఉమ్ అల్ ఖురా డెవలప్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్. ఇక మక్కాలోని తాజ్ హోటల్‌ను 2023 జనవరిలో ప్రారంభిస్తామని ఐహెచ్‌సీఎల్ పేర్కొంది. ‘సౌదీలో తొలి తాజ్ హోటల్‌ను ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉంది. మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికాలో విస్తరణకు కట్టుబడ్డాం.
ఈ ప్రాంతంలో తాజా హోటల్ మాకు నాలుగో వెంచర్’ అని ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చత్వాల్ తెలిపారు. వచ్చే 12–18 నెలల్లో దుబాయ్‌లో రెండు హోటళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఐహెచ్‌సీఎల్ అంతర్జాతీయంగా 11 దేశాల్లో, 72 ప్రాంతాల్లో 145 హోటళ్లను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment