
నూతన ఆవిష్కరణలకు అనుభవంతో పనిలేదు
‘తల నెరిస్తేనే’ సిండ్రోమ్ నుంచి భారతీయులు బైటపడాలి
లేకపోతే అవకాశాలను అందిపుచ్చు
కోలేరుటాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా
ముంబై: అనుభవంతో తల నెరిస్తేనే నవకల్పనలను సాధించగలమన్న అపోహ నుంచి భారతీయులు బైటికి రావాలని పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చెప్పారు. ఇలాంటి భ్రమల వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేమని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎక్స్‌ప్రైజ్ భారత విభాగం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టాటా ఈ విషయాలు చెప్పారు. నవకల్పనలను ఆవిష్కరించేందుకు భారతీయుల్లో అపారమైన శక్తి సామర్ధ్యాలు ఉన్నాయన్నారు. ‘జుట్టు నెరిస్తేనే (అనుభవంతో) ఏదైనా సాధ్యపడుతుందన్న భ్రమల్లో నుంచి దేశం బైటికి రావాలి.
ఇలాంటి ఆలోచనా విధానం వల్ల అవకాశాలను అందుకోలేం’ అని టాటా పేర్కొన్నారు. భారతీయ ఇంజినీర్లు, ఆవిష్కర్తలు అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కనుగొనగలరని.. కానీ భారత్‌లో ఉంటూ ఇలా చేయడానికి అవకాశాలు లభించలేదన్నారు. అద్భుతమైన ఐడియాలున్న యువతకు ఊత మిస్తున్న ఎక్స్‌ప్రైజ్ రాకతో ఈ పరిస్థితి మారగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా అద్భుత ఫలితాలు సాధించిన వాటిల్లో భారతీయులూ తమ సత్తా నిరూపించుకునేలా అవకాశాలు కల్పించగలగాలని తాను కోరుకుంటున్నట్లు టాటా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవకల్పనలకు సంబంధించి ఎక్స్‌ప్రైజ్ ఇండియా అనేది.. నోబెల్ బహుమతి స్థాయిలో పేరు తెచ్చుకోగలదని ఆయన చెప్పారు.