ఇంటర్నెట్ శిఖరం పై ఇండియన్ | Indian on top of the Internet | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ శిఖరం పై ఇండియన్

Published Wed, Aug 12 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

ఇంటర్నెట్ శిఖరం పై ఇండియన్

ఇంటర్నెట్ శిఖరం పై ఇండియన్

గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్
మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజానికి భారతీయుడి సారథ్యం
కంపెనీ ప్రధాన ఆదాయ వనరుల విభాగాలు ఆయన కిందే
గూగుల్‌కు కొత్తగా మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏర్పాటు
 
న్యూయార్క్:
వేల కోట్ల డాలర్ల ఆదాయాలు ఆర్జించే మరో అమెరికన్ దిగ్గజ కంపెనీకి మరో భారతీయుడు సారథ్యం వహించనున్నారు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి తాజాగా భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన గూగుల్ ఇంటర్నెట్ వ్యాపారాలకు సంబంధించిన ప్రోడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి ఇంచార్జిగా ఉన్నారు. సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి తదితరుల్లాగానే మరో అంతర్జాతీయ సంస్థ పగ్గాలు చేపడుతున్న సుందర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

వచ్చే నెల సిలికాన్ వేలీ సందర్శనలో భాగంగా మోదీ.. పలువురు టెక్ దిగ్గజాలతో భేటీ కానున్న నేపథ్యంలో సుందర్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో కూడా సుందర్ నిలవడం, అంతిమంగా ఆ కంపెనీ పగ్గాలు తెలుగువాడైన సత్య నాదెళ్ల దక్కించుకోవడం తెలిసిందే. 66 బిలియన్ డాలర్ల ఆదాయం, 16 బిలియన్ డాలర్ల లాభాలతో టాప్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా గూగుల్ వెలుగొందుతోంది.
 
కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ..
సంస్థాగతంగా గూగుల్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న పలు నిర్ణయాల్లో సుందర్ నియామకం ఒకటి. సుందర్ నిబద్ధతతో అంచెలంచెలుగా పురోగమించారని గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ప్రశంసించారు. సంస్థను నడిపించేందుకు ఆయన అత్యంత సమర్ధులని, కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సుందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇక తాను, మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ఇతర లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సమయం చిక్కగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కీలక వ్యాపార విభాగాలు సుందర్ చేతిలోనే
ప్రధాన ఆదాయ వనరులైన సెర్చి, అడ్వర్టైజింగ్, మ్యాప్స్, యూట్యూబ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ మొదలైనవన్నీ సుందర్ సారథ్యంలోని గూగుల్ కిందే ఉంటాయి. కొత్తగా ఏర్పాటైన మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో గూగుల్ సహా నెస్ట్, ఫైబర్, కాలికో వంటివి స్వతంత్ర సంస్థలుగా కొనసాగుతాయి.
 
మాతృ సంస్థగా ఆల్ఫాబెట్..
కంపెనీ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణ కింద కొత్తగా ఆల్ఫాబెట్ పేరిట మాతృసంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ తెలిపారు. గూగుల్ సహా కంపెనీకి చెందిన ఇతరత్రా వ్యాపారాలన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు. స్టాక్‌మార్కెట్లలో కూడా గూగుల్ స్థానంలో ఆల్ఫాబెట్ చేరుతుంది. గూగుల్ షేర్లన్నీ కూడా ఆల్ఫాబెట్‌కి బదిలీ అవుతాయి. దీనికి ల్యారీ పేజ్ సీఈవోగా, మరో సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు.

ఆల్ఫాబెట్ పదాన్ని ఎంచుకోవడానికి వెనుక గల కారణాలను పేజ్ వివరించారు. ‘మానవ చరిత్రలో అత్యంత కీలకమైన ఆవిష్కరణల్లో భాష కూడా ఒకటి. గూగుల్ సెర్చికి కూడా ఇదే ఆధారం. ఒక భాషను ప్రతిబింబించే అక్షరాలన్నింటినీ కలిపి ఆల్ఫాబెట్ అంటారు. అందుకే దీన్ని ఎంచుకున్నాం’ అని పేజ్ పేర్కొన్నారు. అంతే కాదు పెట్టుబడుల పరిభాషలో బెంచ్‌మార్క్‌ను మించి రాబడులు అందించడాన్ని ఆల్ఫా సూచిస్తుందని, తమ లక్ష్యం కూడా అదే అయినందున దీన్ని ఎంచుకున్నామని పేజ్ తెలిపారు.
 
టెక్నాలజీ అనేది ఉపయోగించుకునే వారికి అనువుగా, సేవకుడిగా ఉండాలనేది నా అభిప్రాయం. ఉదాహరణకు  ఫోన్‌నే తీసుకుంటే.. అది నేను ఏదైనా ముఖ్యమైనది మర్చిపోయిన పక్షంలో వెంటనే అప్రమత్తం చేయగలగాలి. అలాగే, నేను ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు .. ఏదైనా అనవసరమైన సమాచారం వస్తే నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇలా, యూజర్లకు సరైన విధంగా సేవలందించేలా టెక్నాలజీ ఉండాలి.
- ఒక ఇంటర్వ్యూలో సుందర్
 
సుందరరాజన్ నుంచి సుందర్ పిచాయ్ దాకా
సుందర్ అసలు పేరు పి సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి సుందర్‌గా, ఇంటిపేరును పి అనే పొడి అక్షరం నుంచి పిచాయ్ కింద పూర్తిగా పొడిగించుకున్నారు. ఆయన చెన్నైలో పుట్టి, పెరిగారు. వనవాణి మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియెట్ చదివారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేశారు. ఉపాధ్యాయులు అక్కడే పీహెచ్‌డీ చేయాలని సలహా  ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లిన సుందర్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ (ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో), వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ కూడా చేశారు.

2004లో గూగుల్‌లో ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన టీమ్‌కు సారథ్యం వహించారు. సెర్చి ఇంజిన్లలో దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. గతేడాది కంపెనీలో నంబర్ టూ స్థానానికి ఎదిగారు. ఇక, గూగుల్‌లో చేరడానికి ముందు సుందర్ మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో కూడా పనిచేశారు. గూగుల్‌లో పనిచేస్తుండగానే మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్‌లో అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్లలేదు. తాజాగా ఆయన గూగుల్ సీఈవోగా నియమితులు కావడం పట్ల అదే ట్విటర్‌లో ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం.
 
- చెన్నైకి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1972లో సుందర్ జన్మించారు. ఆయనకో తమ్ముడు ఉన్నారు. చిన్నతనంలో ఆయన కుటుంబం రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో ఉండేది.  మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో చాలా కాలం పాటు ఇంట్లో టీవీ గానీ కారు గానీ ఉండేది కాదు. ఎటైనా వెళ్లాలంటే నీలం రంగు లాంబ్రెటా స్కూటరో లేకుంటే బస్సులు మొదలైన వాటిల్లోనే వెళ్లేవారు.
- సుందర్ స్కూల్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. తన సారథ్యంలో ఆయన టీమ్ పలు ప్రాంతీయ టోర్నమెంట్లు గెల్చుకుంది.
- సుందర్ తల్లి స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. తండ్రి రఘునాథ పిచాయ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. బ్రిటన్ సంస్థ జీఈసీకి చెందిన ఎలక్ట్రికల్ పరికరాల  ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చూసేవారు.  సుందర్‌కు టెక్నాలజీని పరిచయం చేసింది ఆయనే.
- సుందర్‌కు పన్నెండేళ్ల వయస్సప్పుడు వారింట్లోకి మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వచ్చింది. టెక్నాలజీ చేసే అద్భుతాలను అది పరిచయం చేసింది. తాను డయల్ చేసిన ప్రతి నంబరును ఆయన గుర్తుంచుకునేవారు. ఈ నైపుణ్యమే ఆయనకు భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడింది.

- సుందర్ అమెరికా ప్రయాణానికి విమాన టికెట్లు కొనేందుకు, ఇతర ఖర్చుల కోసం తండ్రి రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, రుణం రాకపోవడంతో.. అప్పటిదాకా పోగుచేసిన పొదుపు మొత్తంలో నుంచి డబ్బు తీయాల్సి వచ్చింది. విమాన చార్జీ ఆయన ఏడాది సంపాదన కంటే  కూడా చాలా ఎక్కువ.  అయితే, స్టాన్‌ఫోర్డ్ చదువును మధ్యలోనే ఆపి.. అప్లయిడ్ మెటీరియల్స్ అనే సెమీ కండక్టర్స్ తయారీ సంస్థలో ఇంజనీర్‌గా చేరారు. 2002లో వార్టన్ నుంచి ఎంబీఏ చేశారు. మెకిన్సేలో కన్సల్టెంట్‌గానూ పనిచేశారు.
- గూగుల్ సొంత బ్రౌజర్ రూపొందించుకోవాలని తొలిసారి ప్రతిపాదించినది ఆయనే. అప్పటి సీఈవో ఎరిక్ ష్మిట్ తప్ప మిగతా సహ వ్యవస్థాపకులంతా సుందర్ ప్రతిపాదనకు మద్దతు పలికారు. మొబైల్స్, డెస్క్‌టాప్ పీసీలకు సంబంధించిన బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ క్రోమ్‌కు దాదాపు 32% వాటా ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది, అత్యంత ప్రాచుర్యంలోకి తెచ్చినది సుందరే.
- సుందర్ భార్య పేరు అంజలి. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పాఠశాల రోజుల నుంచి సుందర్, అంజలికి పరిచయం ఉండేది. అది కొన్నాళ్లకు ప్రేమ, వివాహానికి దారితీసింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా అంజలికి సుందర్ ప్రపోజ్ చేశారు.
 
కంగ్రాచ్యులేషన్స్ సుందర్!
గూగుల్ సీఈవోగా నియమితులైన సుందర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల దాకా పలువురు ప్రముఖులు అభినందించారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు వచ్చేలా కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సుందర్ కీలకపాత్ర పోషించగలరని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. అపార అనుభవం గల సుందర్.. గూగుల్‌కు అసెట్‌గా నిల్వగలరని పేర్కొంది. ఈ అభినందనలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్వీటర్ వేదికగా నిల్చింది.
 
కంగ్రాచ్యులేషన్స్ సుందర్. గూగుల్‌లో కొత్త బాధ్యతలు చేపడుతున్న మీకు అభినందనలు.
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
 
భారతదేశానికి చెందిన సుందర్ గూగుల్ సీఈవోగా నియమితులవడం గర్వకారణం.
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి
 
కంగ్రాట్స్. ఈ హోదాకు మీరు అన్ని విధాలా అర్హులు.
- సత్య నాదెళ్ల, సీఈవో, మైక్రోసాఫ్ట్
 
ఆయన దార్శనికత అబ్బురపరుస్తుంది. సుందర్ గొప్ప సీఈవోగా నిలవగలరు.
- ఎరిక్ ష్మిట్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, గూగుల్
 
సుందర్ చురుకైన, అద్భుతమైన వ్యక్తి. ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది.పనులను సమర్థంగా చక్కబెట్టగల నేర్పరి.   - నికేశ్ ఆరోరా, ప్రెసిడెంట్, సాఫ్ట్‌బ్యాంక్
 
సీఈవోగా ప్రమోషన్ దక్కించుకున్న మీకు అభినందనలు.
- టిమ్ కుక్, సీఈవో, యాపిల్

 
వార్షిక జీతం రూ. 310 కోట్లు..
ప్రస్తుతం గూగుల్‌లో సుందర్ ఏడాదికి రూ. 310 కోట్ల జీత భత్యాలు పొందుతున్నారు. గతంలో ఆయనకు ట్వీటర్ కంపెనీ నుంచి ఉన్నతస్థానానికి ఆహ్వానం వచ్చినపుడు ఆయనను నిలువరించడానికి గూగుల్ 50 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఇచ్చింది.
 
ఆత్మీయుడు.. సిగ్గరి..

గూగుల్‌లో సహ ఉద్యోగులు ఆయన్ను అందరికీ ఆత్మీయుడిగా అభివర్ణిస్తారు. స్వతహాగా సుందర్ సిగ్గరి. సోషల్ మీడియా మాధ్యమంగా తనకు అభినందనలు తెలిపిన వారిలో కూడా కొంతమందికే ధన్యవాదాల మెసేజీలు పెట్టారు. వీరిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్ మొదలైన వారు ఉన్నారు. సుందర్ చురుకైన విద్యార్థి అయినప్పటికీ.. అనవసర పాండిత్య ప్రదర్శనకు దిగే వాడు కాడని ఐఐటీ ప్రొఫెసర్ సనత్ కుమార్ రాయ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement