తగ్గిన ఐఓబీ నష్టాలు
న్యూఢిల్లీ: మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) నికర నష్టం 2017 జూన్ త్రైమాసికంలో రూ. 499 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 1,450 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం కూడా రూ. 5,868 కోట్ల నుంచి రూ. 5,174 కోట్లకు తగ్గిందని, ఇందుకు వడ్డీ రేట్ల తగ్గుదల కారణమని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఐఓబీ తెలిపింది.
మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గినా...స్థూల ఎన్‌పీఏలు 20.48 శాతం నుంచి 23.60 శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రుణ వితరణ తగ్గడంతో ఎన్‌పీఏల శాతం పెరగడానికి ప్రధాన కారణమని బ్యాంకు తెలిపింది. నికర ఎన్‌పీఏలు 13.97 శాతం నుంచి 14.97 శాతానికి పెరిగాయి. బ్యాంకు నికర వడ్డీ మార్జిన్ 1.87 శాతం నుంచి 1.65 శాతానికి తగ్గింది. ఫలితాల నేపథ్యంలో ఐఓబీ షేరు 3.35 శాతం క్షీణతతో రూ. 23.10 వద్ద ముగిసింది.