
చిన్న పొదుపులపై వడ్డీరేటు కోత
పోస్టాఫీస్ స్వల్పకాలిక పథకాలపై పావు శాతం వడ్డీ తగ్గింపు
♦ 1,2,3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కేవీపీ, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లకు వర్తింపు
♦ ఏప్రిల్ నుంచి అమలు
♦ దీర్ఘకాలిక పథకాల రేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీరేటును మార్కెట్ రేట్లకు అనుసంధానం చేస్తూ... కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీస్ స్వల్ప కాల పథకాలపై పావుశాతం వడ్డీ రేటు తగ్గించింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ఇదే కాలపరిమితితో ఉన్న ప్రభుత్వ బాండ్ల రేటుకన్నా అదనంగా పావుశాతం(0.25%) వడ్డీ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచీ తొలగిస్తున్నట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా తగ్గింపు వల్ల బ్యాంకింగ్‌లో ఈ కాలాలకు సంబంధించి డిపాజిట్ రేట్లకు సైతం ఇవి దాదాపు సమానమవుతాయని పేర్కొంది. దేశంలో తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థకు సైతం కేంద్రం తాజా చర్య శ్రీకారం చుట్టినట్లయ్యింది.
♦ ఇవి యథాతథం...: మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్, బాలికలకు సంబంధించిన పథకాల విషయంలో వడ్డీరేట్లను మార్చలేదు. ప్రభుత్వ ప్రకటనలో ఇతర ముఖ్యాంశాలు..
♦ ఇకమీదట ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రేట్లను సమీక్షించడం జరుగుతుంది. ఒక త్రైమాసికంలో వడ్డీరేటును అంతకుముందు నెల 15వ తేదీన నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వడ్డీరేటును మార్చి 15న నిర్ణయిస్తారు. ప్రభుత్వ బాండ్ ప్రాతిపదికన ఈ రేటు నిర్ణయం ఉంటుంది. పై ఉదాహరణను తీసుకుంటే... డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీ రేటు ఇక్కడ ప్రాతిపదికగా ఉంటుంది.
♦ సుకన్య సమృద్ధి యోజన, సీనియన్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లకు సంబంధించిన వడ్డీరేట్లు- ప్రభుత్వ బాండ్లతో పోల్చితే వరుసగా 0.75 శాతం, 1 శాతం, 0.25 శాతం వడ్డీరేట్లుఅధికంగా ఉన్నాయి. కానీ ఈ రేట్ల విషయంలో ఎటువంటి మార్పు లేదు. సామాజిక భద్రతా పరమైన లక్ష్యాలతో ఈ పథకాలు ముడివడి ఉండడమే దీనికి కారణం.
♦ దీర్ఘకాలిక పథకాలతో పాటు ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లు, అదే కాలాలకు సంబంధించిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, పీపీఎఫ్‌లకు ఇచ్చే వడ్డీరేట్లలో సైతం మార్పు లేదు.
♦ {పస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు 8.7 శాతం. సుకన్యా సమృద్ధి యోజన రేటు 9.2 శాతంగా ఉంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ రేటు 8.4 శాతం.
♦ 1, 2, 3 సంవత్సరాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం 8.4 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. కిసాన్ వికాస పత్ర విషయంలో డిపాజిట్ 100 నెలలకు(ఎనిమిదేళ్ల 4 నెలలు) అసలు రెట్టింపు అవుతోంది.
♦ కొన్ని వాస్తవ, అత్యవసర అవసరాలు తలెత్తితే పీపీఎఫ్ అకౌంట్ల ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌కూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తీవ్ర అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సందర్భాల్లో మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో 1% తగ్గింపు జరిమానాగా ఉంటుంది. ఖాతా ప్రారంభం నుంచీ ఐదేళ్లు పూర్తయి ఉండాలి.
♦ చిన్న పొదుపు మొత్తాలపై రేటు అధికంగా ఉండడం వల్ల ఆర్‌బీఐ నుంచి అందిన రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తన కస్టమర్‌కు బదలాయించలేని పరిస్థితి నెలకొందని ఆర్థికశాఖ వ్యాఖ్యానించింది.