ఎంత రిస్క్ అయినా ఓకే! | Investment in mutual funds usually for the purposes of diversification | Sakshi
Sakshi News home page

ఎంత రిస్క్ అయినా ఓకే!

Published Mon, May 26 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Investment in mutual funds usually for the purposes of diversification

 ఇటీవలనే ఎస్‌బీఐ ఎఫ్‌ఎంసీజీ ఫండ్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇది సరైన ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయమేనా?   - ప్రకాశ్, వరంగల్
 ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అదీ ఎస్‌బీఐ ఎఫ్‌ఎంసీజీ వంటి ఒకే రంగానికి చెందిన ఫండ్‌లో ఇలా ఇన్వెస్ట్ చేయడం అస్సలు సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేది సాధారణంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం.

 ఇక మీ విషయానికొస్తే ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ, గత కొన్నేళ్లుగా ఎఫ్‌ఎంసీజీ రంగం మంచి పనితీరునే కనబరుస్తోంది. అయితే మార్కెట్లలో నెలకొన్న ప్రస్తుత ఆశావహ పరిస్థితులను బట్టి చూస్తే, ప్రస్తుత బుల్ రన్‌లో ఇతర రంగాలు దూసుకుపోయినట్లుగా ఎఫ్‌ఎంసీజీ రంగం దూసుకుపోకపోవచ్చు. అందుకని మీ ఇన్వెస్ట్‌మెంట్లను డైవర్సిఫై చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి.

 నేను 2010లో సుందరం ట్యాక్స్ సేవర్‌లో రూ.80,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు  ఆ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.87,000. నా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలా? ఉపసంహరించుకోమంటారా?       - కృష్ణ, విజయవాడ
 గత ఐదేళ్లు చాలా ఈక్విటీ ఫండ్స్‌కు  కలసిరాలేదు. సుందరం ట్యాక్స్ సేవర్ దీనికి మినహాయింపు కాదు.  కానీ ఇప్పుడు పరిస్థితులు టర్న్ అరౌండ్ అయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత బుల్న్‌ల్రో ఈ ఫండ్ మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. దీంతో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడి మరింతగా మెరుగుపడవచ్చు. మార్కెట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్ మంచి రాబడులనే ఇవ్వవచ్చు. అందుకని తొందరపడి మీ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోకుండా, కొనసాగించండి.

 నేను గత 5-6  ఏళ్లుగా ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్స్‌ల్లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా  నా ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోమంటారా ?    - ఆదిత్య రెడ్డి, కడప

 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ప్రయోజనాలను మీరు పొందుతున్నారని చెప్పవచ్చు. గత ఐదేళ్లుగా మార్కెట్లు బాగా లేవు. అయినా, మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మంచి రాబడులనే సాధించాయని చె ప్పొచ్చు. దీనికి కారణం మీరు ఒక పద్ధతి ప్రకారం మంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, నిస్సందేహంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించండి. ఇప్పడే పెట్టబడులను ఉపసంహరించుకోకండి.

 నేను నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఎంతటి రిస్క్‌నైనా భరిస్తాను. నా ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితి మూడేళ్లు. కొన్ని మంచి ఫండ్స్ సూచించండి?   - మాళవిక, హైదరాబాద్
 దూకుడుగా ఉండే ఇన్వెస్టర్లు మంచి రాబడుల కోసం ఎంతటి రిస్క్‌నైనా భరిస్తారు. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో ఒక చక్కటి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటారు. మూడేళ్ల కాలవ్యవధి దృష్ట్యా  ఇది అత్యంత రిస్క్‌తో కూడుకున్న వ్యూహమని చెప్పవచ్చు. కొంచెం అటూ, ఇటూ అయితే మీ ఇన్వెస్ట్‌మెంట్స్ సగానికి సగం తగ్గిపోవచ్చు. ఈ విషయాన్ని తట్టుకోగలిగితే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పరిశీలించదగ్గ ఫండ్స్- యాక్సిస్ మిడ్‌క్యాప్,  బీఎన్‌పీ పారిబస్ మిడ్‌క్యాప్, మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్. మీ ఇన్వెస్ట్‌మెంట్ కాల వ్యవధికి ఇవి ఉత్తమమైన ఫండ్స్ అని చెప్పవచ్చు. అయితే మార్కెట్లు బాగా లేకపోతే భారీ నష్టాలు రావచ్చని మరువకండి.

 నేను ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ బాగా పడిపోయింది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆపేసి, ఇంతవరకూ ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకోమంటారా? అలా చేసినట్లయితే ఇలా ఉపసంహరించుకున్న సొమ్ములను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు?   - మహ్మద్ ఇంతియాజ్, తిరుపతి

 ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ అనేది మంచి లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఒకటి. గత 20-25 ఏళ్లుగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ తగ్గినప్పటికీ, ఫండ్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకని ఈ ఫండ్ పట్ల నిరాశ పడాల్సిన పనిలేదని చెప్పవచ్చు. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ దృష్ట్యా, మీరు ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపసంహరించి ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ లేదా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్ ట్రాక్ రికార్డ్‌లు బావున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement