![INX Media Case: Delhi HC Grants Bail To Karti Chidambaram - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/23/karti-chidambaram.jpg.webp?itok=JOBI3hQ-)
కార్తి చిదంబరం (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టును తమకు సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అంతేకాక బెయిల్ మంజూరు కోసం రూ.10 లక్షలను పూచీకత్తును సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 16న కార్తి, సీబీఐ వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు, తదుపరి నిర్ణయాన్ని రిజర్వులో పెట్టింది. ప్రస్తుతం కార్తికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది.
ఈ కేసులో సాక్ష్యాధారాలను కార్తి తారుమారు చేశారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ సీబీఐ వాదించింది. అయితే సాక్ష్యాధారాల టాపరింగ్ చేసిన ఆరోపణలను కార్తి లాయర్లు ఖండించారు. తుదపరి కస్టోడియన్ ఇంటరాగేషన్‌ను సీబీఐ కోరనప్పుడు, ఇంకెందుకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిందని ప్రశ్నించారు. కార్తీపై ఇప్పటివరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయలేదని వాదించారు. అంతేకాక ఈ కేసులో ఇప్పటివరకు ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు.
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో యూకే నుంచి వస్తున్న కార్తిని చెన్నై ఎయిర్‌పోర్టులో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన రూ.307 కోట్ల నిధులకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాకాల బోర్డ్ ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే కార్తీకి రూ.10 లక్షల ముడుపులు ముట్టినట్లు మొదట్లో సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత ఆ మొత్తం రూ.6.5 కోట్లగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment