
ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం నీరసంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 395 పాయింట్లు పతనమై 34,776కు చేరింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు కోల్పోయి 10,261 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ నష్టాలలోనూ విభిన్న వార్తల కారణంగా డైవర్సిఫైడ్ బ్లూచిప్ ఐటీసీ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..
ఐటీసీ లిమిటెడ్
గతేడాది(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 199వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 203 వరకూ బలపడింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 9 శాతం పెరిగి రూ. 3927 కోట్లకు చేరింది. ఇందుకు పన్ను ఆదా దోహదపడగా.. మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 12,561 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 10.15 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
ఐడీబీఐ బ్యాంక్
అనుబంధ సంస్థ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఐడీబీఐ బ్యాంక్ తాజాగా పేర్కొంది. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్‌లో బ్యాంక్‌కు 48 శాతం వాటా ఉంది. ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్, డచ్ కంపెనీ ఏజియస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ విడిగా 26 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 42కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభపడి రూ. 41 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment