
జబాంగ్ ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ ఫ్యాషన్ రీటైలర్ జబాంగ్ ఓ అంతర్జాతీయ ఫ్యాషన్ రీటైలర్ మెక్స్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ నూతన భాగస్వామ్యం ప్రకారం మంగళవారం నుంచి మెక్స్ ఉత్పత్తులు ఇండియాలో కూడా జబాంగ్.కామ్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే టాప్ షాప్, టాప్ మాన్, డోరతీ పెర్కిన్స్ లాంటి హై ఎండ్ బ్రాండ్స్ లను జోడించిన జబాంగ్ ఇపుడు 'స్ప్రింగ్ సమ్మర్ -16' పేరుతో మెక్స్ కలెక్షన్స్ అందిస్తోంది. దీంతో అద్భుతమైన డిజైన్లతో కూడిన 'మెక్స్ ' భారత ఆన్ లైన్ మార్కెట్ లో హల్ చల్ చేయనుంది.
భారతదేశంలో మెక్స్ భాగస్వామ్యం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని జబాంగ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మహంతి తెలిపారు. తమ ఇరువురి బ్రాండ్ల భావజాలాల పోలి వుండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మెక్స్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ జతతో తమ వ్యాపారం మరింత విస్తృతమవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ వ్యాపారంలో ఎంతో అనుభవం వున్న జబాంగ్ తో భాగస్వామ్యం సంతోషంగా ఉందన్నారు మెక్స్ సీఈవో ఉమిత్ ఎరోగ్లు. అసాధారణమైన ధర, నాణ్యతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ బ్రాండ్లు భారత వినియోగదారులను ఆకట్టుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కాగా నెదర్లాండ్స్ కు చెందిన మెక్స్ కంపెనీ మహిళలు, పురుషులు,పిల్లలకోసం డిజైనర్ దుస్తులను, యాక్సెసరీస్ ను అందిస్తున్న అంతర్జాతీయ సంస్థ.