
న్యూయార్క్ : ప్రపంచపు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మరోసారి మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను దాటేశారు. బిల్‌గేట్స్‌ను దాటేసి జెఫ్ బెజోస్ ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు. అమెజాన్ అంచనాలకు మించి మూడో క్వార్టర్‌లో ఫలితాలను ప్రకటించడంతో, ఈ కంపెనీ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 11.9 శాతం పైకి ఎగిశాయి. దీంతో ఆయన నికర సంపదకు మరో 900 మిలియన్ డాలర్లు అదనంగా చేకూరి, మొత్తంగా 90.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బిల్‌గేట్స్ సంపద 90.1 బిలియన్ డాలర్లు.
ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం బిల్‌గేట్స్‌ను బెజోస్ అధిగమించడం ఇదేమీ తొలిసారి కాదు. జూలైలో కూడా అమెజాన్ షేర్ ధర భారీగా ఎగియడంతో, బిల్‌గేట్స్ సంపదను ఆయన దాటేసి ప్రపంచపు కుబేరుడిగా నిలిచారు. ఆరు నెలల క్రితం వారెన్ బఫెట్‌ను దాటేసి బెజోస్ ప్రపంచపు రెండో అతిపెద్ద ధనికవంతుడిగా చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది బెజోస్ తన సంపదను 10.2 బిలియన్ డాలర్లను పెంచుకున్నారు. 1998లో ఫోర్బ్స్ 400లో తొలిసారి బెజోస్ చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాదిలో అమెజాన్ ఫౌండర్ నికర సంపద 1.6 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఈ క్వార్టర్‌లో ప్రైమ్ డే ప్రమోషన్, హోల్ ఫుడ్ మార్కెట్ స్టోర్స్ కొనుగోళ్లతో అమెజాన్ తన లాభాలను భారీగా పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment