
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో రూ.1,932 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ1లో వచ్చిన నికర లాభం(రూ.1,574 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. నికర లాభంలో 30 శాతం వాటా అనుబంధ కంపెనీల వల్లనే వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.9,904 కోట్ల నుంచి రూ.12,130 కోట్లకు చేరిందని పేర్కొంది. స్టాండెలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.1,052 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ. 1,360 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక ఆదాయం రూ.6,644 కోట్ల నుంచి రూ.7,945 కోట్లకు పెరిగిందని పేర్కొంది.
తగ్గిన కేటాయింపులు..
రుణ నాణ్యత తగిన స్థాయిలోనే ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. గత క్యూ1లో 2.17 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 2.19 శాతానికి పెరగ్గా, నికర మొండి బకాయిలు 0.86 శాతం నుంచి 0.73 శాతానికి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు రూ.499 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గాయని తెలిపింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్
షేర్ 3 శాతం నష్టంతో రూ.1,454 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment