ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఈజీబై స్టోర్ | Landmark Group to open 50 more Easybuy stores in 3 years | Sakshi
Sakshi News home page

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఈజీబై స్టోర్

Published Thu, Nov 5 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఈజీబై స్టోర్

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఈజీబై స్టోర్

కంపెనీ బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: రెడీమేడ్ దుస్తుల విక్రయ రంగంలో ఉన్న ఈజీబై దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ల్యాండ్‌మార్క్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీకి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కలిపి 9 కేంద్రాలున్నాయి. రెండేళ్లలో వీటి సంఖ్యను 50కి చేరుస్తామని ఈజీబై బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్ బుధవారం తెలిపారు. హైదరాబాద్‌లో విక్రమ్‌పురి, దిల్‌సుఖ్‌నగర్‌లో ఈజీబై స్టోర్లను ప్రారంభించిన సందర్భంగా ఫ్రాంచైజీ అయిన వి-రిటైల్ డెరైక్టర్ మధుసూధన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

భారత్‌లో ప్రతి జిల్లా కేంద్రానికి 2021 నాటికి విస్తరిస్తామన్నారు. 2015-16లో రూ.100 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్టు చెప్పారు. అన్ని ఔట్‌లెట్లు ఫ్రాంచైజీ విధానంలోనే ఏర్పాటవుతాయని తెలిపారు.
 
తెలుగు రాష్ట్రాలే ప్రాధాన్యత..
ఫ్యాషన్ విషయంలో భారత్‌లో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయని రాజీవ్ రంజన్ తెలిపారు. ‘2014లో తొలి స్టోర్‌ను కరీంనగర్‌లో ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొమ్మిదికిగాను ఏడు స్టోర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఏడాదిలో అడుగు పెడతాం. రూ.69 నుంచి దుస్తులు లభించడం ఈజీబై ప్రత్యేకత. 45 రోజులకు ఒకసారి కొత్త వెరైటీలను తీసుకొస్తాం. 1,000కిపైగా రకాలు కొలువుదీరాయి’ అన్నారు.
 
త్వరలో ఆన్‌లైన్‌లోకి ల్యాండ్‌మార్క్ గ్రూప్..
రిటైల్ రంగ దిగ్గజం ల్యాండ్‌మార్క్ గ్రూప్ భారత్‌లో ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. జనవరికల్లా ఇది కార్యరూపంలోకి వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ కంపెనీలన్నింటినీ ఒకే వెబ్‌సైట్ కిందకు తేనుంది. తద్వారా కస్టమర్లకు సులభంగా చేరేందుకు వీలవుతుందన్నది కంపెనీ ఆలోచన. రూ.32,500 కోట్ల టర్నోవర్ కలిగిన దుబాయికి చెందిన ల్యాండ్‌మార్క్ భారత్‌సహా 19 దేశాల్లో రిటైల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌ల్లో నిమగ్నమైంది. ఈజీబై, లైఫ్‌స్టైల్, మ్యాక్స్, బేబీషాప్, హోం సెంటర్, గ్లోరియా జీన్స్, పాలీనేషన్ తదితర బ్రాండ్లు  గ్రూప్ సొంతం.
 
డిస్కౌంట్ల వార్‌కు దూరం: ఆన్‌లైన్ అనగానే ముం దుగా గుర్తొచ్చేది భారీ డిస్కౌంట్లు. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇస్తున్నాయి కాబట్టే ఈ-కామర్స్ కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. తాము మాత్రం డిస్కౌంట్ల వార్‌కు దూరంగా ఉంటామని ఈజీబై బిజినెస్ హెడ్ రాజీవ్ రంజన్ వెల్లడించారు.

కంపెనీ వృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టే ఆన్‌లైన్‌లోకి అడుగు పెడుతున్నట్టు చెప్పారు. ‘పుస్తకాలు, ఎలక్ట్రానిక్స్‌కు టచ్ అండ్ ఫీల్ అక్కరలేదు. దుస్తులను ప్రత్యక్షంగా చూసి కొనేందుకే అత్యధికులు మొగ్గు చూపుతారు. ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ వేగంగా మారుతోంది. అందుకు తగ్గట్టుగా కొత్త వెరైటీలను తీసుకు రావడం ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ పోటీ పడతాం’ అని వెల్లడించారు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement