గతవారం బిజినెస్‌ | Last week business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, May 22 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

గృహ రుణాలపై వడ్డీ రేట్లు కట్‌
అందుబాటు ధరల్లోని గృహాలను ప్రోత్సహించే దిశగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు.. రూ. 30 లక్షల దాకా హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రేటును 0.3 శాతం దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. మహిళలకు వడ్డీ రేటు 8.35 శాతంగా (ఇప్పటిదాకా ఇది 8.50%) ఉంటుందని, ఇతరులకు 8.40 శాతంగా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఇక ఉద్యోగినులకు వడ్డీ రేటు 8.35 శాతంగాను, ఇతరులకు 8.40 శాతంగాను ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది. ఎస్‌బీఐ ఇటీవలే అందుబాటు ధరల్లోని గృహ రుణాలపై వడ్డీ రేటను 25 బేసిస్‌ పాయింట్ల దాకా తగ్గించింది. కొత్తగా రుణం తీసుకునే మహిళలకు 8.35 శాతం వడ్డీ రేటే వర్తింపచేస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా గృహ రుణ రేటును 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.

ఎగుమతుల జోరు.. లోటు బేజారు
భారత్‌ ఎగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో శుభారంభం చేశాయి. 2016 ఏప్రిల్‌తో పోలిస్తే, 2017 ఏప్రిల్‌లో 20 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఎగుమతుల విలువ 24.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు విలువ కూడా భారీగా 50 శాతం పెరిగి విలువ రూపంలో 37.88 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో వాణిజ్యలోటు 13.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

  పేటీఎంకు రూ.9,079 కోట్ల నిధులు
ప్రముఖ డిజిటల్‌ చెల్లింపులు, ఈ–కామర్స్‌ సంస్థ ‘పేటీఎం’.. పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాల ఆరంభంతో దేశీయ మార్కెట్లో తన దూకుడును మరింత పెంచనుంది. ఈ సంస్థ జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు నుంచి తాజాగా 1.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,079 కోట్లు) సమీకరించింది.

  ఫేస్‌బుక్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ జట్టు
ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ తాజాగా ఫేస్‌బుక్, మొబిక్విక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌.. ఫేస్‌బుక్‌ ఎక్స్‌ప్రెస్‌ వైఫై ప్రోగ్రామ్‌కు కనెక్టివిటీ సాయం అందించనుంది. మొబిక్విక్‌ ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ వాలెట్‌ ఏర్పాటుకు సంబంధించి డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ మొబిక్విక్‌తో కలిసి పనిచేయనుంది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌.. డిస్నీ ల్యాండ్‌ ఇండియాతో మూడో ఒప్పందాన్ని కుదర్చుకుంది.  

‘గ్లోబల్‌ గేమ్‌ చేంజర్‌’.. అంబానీ
ఫోర్బ్స్‌ తాజా ‘గ్లోబల్‌ గేమ్‌ చేంజర్స్‌’ జాబితాలో ఆర్‌ఐఎల్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌.. 25 మంది వ్యాపార దిగ్గజాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో స్థానం పొందిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు కారణంగా నిలిచారని ఫోర్బ్స్‌ పేర్కొంది. భారతీయులకు ఇంటర్నెట్‌ను తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అంబానీ తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోని ఆయనకు జాబితాలో స్థానం కల్పించామని వివరించింది. కాగా ఫోర్బ్స్‌ 100 మంది అత్యుత్తమ వెంచర్‌ క్యాపిటలిస్టుల్లో భారతీయ అమెరికన్లు 11 మంది చోటు సంపాదించుకున్నారు.

డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లోకి నాల్కో  
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ డెరివేటివ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఐదు కంపెనీలకు సంబంధించి ఫ్యూచర్, ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్టు Ððల్లడించాయి. వీటిలో ఆర్‌బీఎల్‌ బ్యాంకు, నాల్కో, హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, కజారియా సిరామిక్స్, రామ్కో సిమెంట్స్‌ ఉన్నాయి. ఈ నెల 26 నుంచి ఈ కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులు అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు కంపెనీల్లో ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించిన మరుసటి రోజే బీఎస్‌ఈ కూడా అదే నిర్ణయం తీసుకుంది.

దేశీ మొబైల్‌ కంపెనీలకు విదేశీ షాక్‌
చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు దేశీ బ్రాండ్స్‌కు గట్టి పోటీనివ్వడమే కాదు.. ఏకంగా వాటిని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయి. చైనా బ్రాండ్స్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (2017, జనవరి–మార్చి) ఇండియన్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే వీటి ఆదాయంలో 180 శాతం వృద్ధి నమోదయ్యింది.  విక్రయాల పరంగా శాంసంగ్, ఐటెల్, షావోమి కంపెనీల మార్కెట్‌ వాటా వరుసగా 27 శాతం, 9 శాతం, 6 శాతంగా ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో చైనా కంపెనీలు ఇప్పటికే దేశీ బ్రాండ్స్‌కు టాప్‌–5లో చోటులేకుండా చేశాయి.  

రూ.20 లక్షల కోట్లకు ఫండ్స్‌ ఆస్తులు
మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) ఆస్తులు రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుతున్నాయి. జూన్‌ నాటికి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.20 లక్షల కోట్లను దాటనుంది.

త్వరలో మేకిన్‌ ఇండియా ఐఫోన్లు ..
భారత్‌లోనే తయారయ్యే ఐఫోన్లు మనకు త్వరలోనే అందుబాటులోకి రానున్నవి. అమెరికా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ’యాపిల్‌’ తాజాగా బెంగళూరులో ’ఐఫోన్‌ ఎస్‌ఈ’ హ్యాండ్‌సెట్ల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నెలలోనే ఈ ఫోన్లను దేశీ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది.
 
సిల్క్‌ రోడ్డుపై చైనా భారీ పెట్టుబడులు
చైనాను ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలతో అనుసంధానం చేసే సిల్క్‌రోడ్డు ప్రాజెక్టుపై 124 బిలియన్‌ డాలర్ల (రూ. 8 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ తెలిపారు. సిల్క్‌ రోడ్డు, బెల్ట్‌ను శతాబ్దపు ప్రాజెక్టుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చేదిగా ఆయన అభివర్ణించారు. సహకారం కోసం ఓ ఉమ్మడి వేదికను నిర్మిస్తామని, స్వేచ్ఛాయుత అభివృద్ది చెందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఆర్థిక సహకారాన్ని విస్తృతం చేసేందుకు గాను 40 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సిల్క్‌ రోడ్డు ఫండ్‌కు చైనా అదనంగా 100 బిలియన్‌ యువాన్లను సమకూరుస్తుందని జిన్‌పింగ్‌ చెప్పారు.

ఎయిర్‌టెల్‌–టికోనాలపై జియో విమర్శ
టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రతిపాదిత టికోనా కొనుగోలు డీల్‌తో ప్రభుత్వ ఖజానాకు రూ. 217 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతుందని రిలయన్స్‌ జియో పేర్కొంది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన టికోనాకి చెందిన స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్‌ వాయిస్‌ కాల్స్‌కి ఉపయోగించుకుంటే ఖజానాకు నష్టం తప్పదని, దీన్ని నివారించాలని టెలికం విభాగం (డాట్‌)కు రాసిన మూడు పేజీల లేఖలో ఆరోపించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement