గతవారం బిజినెస్‌ | last week business deals | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Apr 3 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

మార్చిలో మెరుగుపడిన తయారీ కార్యకలాపాలు
మూడు నెలల క్షీణత తర్వాత మార్చిలో తయారీ రంగ కార్యకలాపాలు మళ్లీ కాస్త మెరుగుపడ్డాయి. దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాల తీరుతెన్నులను తెలియజేసే ఎస్‌బీఐ వార్షిక కాంపోజిట్‌ సూచీ తాజాగా కీలకమైన 50 పాయింట్ల మార్కును దాటి 50.3కి చేరడం దీనికి నిదర్శనం. ఇక నెలవారీ సూచీ కూడా మెరుగుపడింది. ఫిబ్రవరిలో 49.2గా ఉండగా.. మార్చిలో 53.3కి చేరిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఒక నివేదికలో పేర్కొంది. సూచీ విలువ 5052 మధ్యలో ఉంటే స్వల్ప వృద్ధిని, 5255 మధ్య ఉంటే ఒక మోస్తరు వృద్ధిని సూచిస్తుంది.  

ఏడాదిలో లక్ష ’విటారా బ్రెజా’ విక్రయాలు
దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ తాజాగా తన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’విటారా బ్రెజా’ విక్రయాలు లక్ష యూనిట్ల మార్క్‌ను అధిగమించినట్లు ప్రకటించింది. విటారా బ్రెజాను ఆవిష్కరించిన ఏడాది కాలంలోపే విక్రయాలు 1.1 లక్షల యూనిట్లను దాటేశాయని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ.. విటారా బ్రెజాను గతేడాది మార్చిలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

ఎస్‌బీఐ కార్డ్‌లో వాటాలు పెంచుకోనున్న ఎస్‌బీఐ
క్రెడిట్‌ కార్డ్స్‌ సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌లో జూన్‌ నాటికల్లా వాటాలను 74 శాతానికి పెంచుకోనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని నియంత్రణపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ’ఎస్‌బీఐ కార్డ్‌ ఉన్నతి’ని ఆవిష్కరించిన సందర్భంగా ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీతో రెండు క్రెడిట్‌ కార్డు జాయింట్‌ వెంచర్స్‌లో వాటాలను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలకు ఎస్‌బీఐ బోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది.

బిట్‌ కాయిన్లు చట్ట వ్యతిరేకం: కేంద్రం
బిట్‌ కాయిన్లు తరహా వర్చువల్‌ కరెన్సీ (డిజిటల్‌ రూపంలో ఉండేవి) వినియోగం చట్ట విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని ఆర్‌బీఐ గుర్తించలేదని, వీటి కొనుగోళ్లు, లావాదేవీలు మనీలాండరింగ్‌ వ్యతిరేక చట్టం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. వర్చువల్‌ కరెన్సీ వాడకం వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన, భద్రతా ముప్పు గురించి ట్రేడర్లను, వాటిని వినియోగించేవారిని ఆర్‌బీఐ ఇప్పటికే హెచ్చరించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేగ్వాల్‌ తెలిపారు. చెల్లింపుల కోసం బిట్‌ కాయిన్‌ తరహా వర్చువల్‌ కరెన్సీల సృష్టికి ఏ సెంట్రల్‌ బ్యాంకు కూడా అనుమతించలేదన్నారు.

మూడేళ్లుగా నష్టాల్లోనే 43 కేంద్ర సంస్థలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 43 సంస్థలు (సీపీఎస్‌ఈ) మూడేళ్లుగా (2013–16) నష్టాలతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎయిర్‌ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉన్నాయి. వనరుల కొరత, సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, తీవ్రమైన పోటీ, బలహీనమైన మార్కెటింగ్‌ విధానాలు, నిర్వహణ లోపం నష్టాలకు కారణాలు. ఈ జాబితాలో బ్రిటిష్‌ ఇండియా కార్పొరేషన్, హిందుస్థాన్‌ యాంటీబయోటిక్స్, హెచ్‌ఎంటీ వాచెస్‌ లిమిటెడ్, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సైతం ఉన్నాయి.

456 బిలియన్‌ డాలర్లకు తగ్గిన విదేశీ రుణభారం
గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ ఆఖరు నాటికి భారత విదేశీ రుణభారం మొత్తం 456 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. దీర్ఘకాలికమైన, వాణిజ్యపరమైన విదేశీ రుణాలు తగ్గడం ఇందుకు కారణం.  గతేడాది మార్చి ఆఖరు నాటి పరిమాణంతో పోలిస్తే ఈ తగ్గుదల 29 బిలియన్‌ డాలర్లు.

ఎనిమిది రంగాల గ్రూప్‌ పేలవ పనితీరు!
ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ ఫిబ్రవరిలో పేలవ పనితీరు ప్రదర్శించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం ఒక శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. క్రూడ్‌ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్‌ ఉత్పత్తి 2016 ఫిబ్రవరితో పోల్చితే 2017 ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణించడం దీనికి ప్రధాన కారణం. కాగా బొగ్గు, స్టీల్, విద్యుత్‌ ఉత్పత్తి బాగుండడం మొత్తం సూచీ వృద్ధిలో ముగియడానికి కారణమైంది. ఈ ఎనిమిది రంగాలు 2015లో 0.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, 2017 జనవరిలో 3.4 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం.

లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు
ప్రభుత్వ ఆదాయం వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని ఫిబ్రవరి ముగిసే నాటికే దాటిపోయింది.ద్రవ్యలోటు ఫిబ్రవరిలో 6.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2016–17 బడ్జెట్‌ లక్ష్యం (మార్చి 31తో ముగిసిన కాలం) రూ.5.34 లక్షల కోట్లు. అంటే ఇది లక్ష్యంలో ఫిబ్రవరి నాటికే  113.4 శాతానికి చేరిందన్నమాట. పన్నుయేతర ఆదాయాలు తగ్గడం దీనికి కారణం.

విదేశీ మారక నిల్వలు.. 368 బిలియన్‌ డాలర్లు
భారత్‌ విదేశీ మారక నిల్వలు మార్చి 24తో ముగిసిన వారంలో, అంతక్రితం ఇదే వారంతో పోలిస్తే 1.15 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. 367.93 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. మొత్తం నిల్వల్లో కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్‌ నిల్వలు 344.23  బిలియన్‌ డాలర్లకు చేరాయి.
చిన్న మొత్తాల్లో పొదుపు చేసే ఖాతాదారులకు నిరాశను మిగుల్చుతు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్మాల్‌ సేవింగ్స్‌పై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించింది. పీపీఎఫ్‌ (పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌), కిసాన్‌ వికాస్‌ పత్రాలు, సుకన్య సమృద్ధి స్కీమ్‌లపై 0.1 శాతం వడ్డీ తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్‌ 1న ప్రారంభ మయ్యింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సహా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ తదితర ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. మరోవైపు అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) స్కీమ్‌ ఇక రెక్కలు విప్పుకోనుంది. ఈ స్కీమ్‌ పరిధిలో విమాన సర్వీసులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్‌లైన్స్‌ సంస్థలను, 128 రూట్లను కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 70 ఎయిర్‌పోర్టు లను దీనిద్వారా అనుసంధానం చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 31 ఎయిర్‌పోర్టులు నిర్వహణలో లేనివే. మరో 12 అరకొర సర్వీసులున్న ఎయిర్‌పోర్టులను కూడా జాబితాలో చేర్చారు.

బీఎస్‌–3 ప్రమాణాలతో ఉన్న వాహన విక్రయాలు ఇక జరగవు. ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–3 వాహనాలను విక్రయించడం, రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని వాహన కంపెనీలు బీఎస్‌–4 వాహనాలను మాత్రమే వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది.

డీల్స్‌..
వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్‌ సుమి సిస్టమ్స్‌ (ఎంఎస్‌ఎస్‌ఎల్‌) ఫిన్లాండ్‌కు చెందిన పీకేసీ గ్రూప్‌ పీఎల్‌సీ కొనుగోలును పూర్తి చేసింది. ఈ డీల్‌ విలువ రూ.4,150 కోట్లు.

టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తన మొబైల్‌ టవర్ల విభాగం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌(సీపీపీఐబీ) కన్సార్షియమ్‌కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్‌ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్‌టెల్‌ కంపెనీ భావిస్తోంది. వాటా విక్రయానంతరం భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి.

ఐటీ కంపెనీ జెన్‌సర్‌ టెక్నాలజీస్‌ బెంగళూరుకు చెందిన కీస్టోన్‌ లాజిక్‌ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement