Vitara brezza
-
మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని మారుతి ప్రకటించింది. కాగా ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. -
SUV: గేర్ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా
ముంబై: దేశీయంగా స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (ఎస్యూవీ) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్లో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్ కూడా ఈ సెగ్మెంట్లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్ మోడల్స్ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్యూవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిల్చింది. వ్యూహరచనలో మారుతీ .. ఎస్యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్–క్రాస్ మినహా స్పోర్ట్ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్–ఎస్యూవీ సెగ్మెంట్లో కంపెనీకి మరే ఇతర మోడల్స్ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్ పాయింట్ల మేర మార్కెట్ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు. హ్యుందాయ్ ఆధిపత్యం.. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్ రూఫ్, కనెక్టెడ్ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్ 5 ఆటోమొబైల్ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్ మోడల్స్ ఇందుకు తోడ్పడ్డాయి. కియా ఎస్యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..! -
మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా కారులో అదిరిపోయే ఫీచర్స్!
ప్రముఖ ఆటో మేకర్ మారుతి సుజుకి యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తుంది. ఇప్పటి వరకు ఇలా తీసుకొని వచ్చిన కార్లలో భారీగా ప్రజాదరణ పొందిన మోడల్ "విటారా బ్రెజ్జా". 2016లో మొట్ట మొదటి సరిగా ఈ విటారా బ్రెజ్జా మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. నేటికి దేశంలో అత్యధికంగా అమ్ముడు అవుతున్న కార్లలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఒకటి. మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కొత్త తరం మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. అయితే, ఈ కారు టెస్టింగ్ కోసం రోడ్డు మీద చక్కర్లు కొడుతుంది. 2022 ప్రారంభంలో రాబోతున్న కారుకు సంబంధించిన ఫీచర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికర ఫీచర్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 1. సన్ రూఫ్ 2022 ప్రారంభంలో రాబోతున్న మారుతి సుజుకి బ్రెజ్జా సన్ రూఫ్‌తో రానుంది. ఎక్కువ శాతం మంది వినియోగదారులు సన్ రూఫ్ ఉన్న కార్లను ఇష్ట పడుతుండటంతో, మారుతి సుజుకి ఈ కారును సన్ రూఫ్‌తో తీసుకవస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి, మారుతి సుజుకి బ్రెజ్జా నుంచి రాబోతున్న సన్ రూఫ్‌తో మొదటి మోడల్ ఇది కావచ్చు. 2. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ లీక్ అయిన ఫోటోలు కొత్త బ్రెజ్జా కారు పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా జెడ్ ఎక్స్ఐ, జెడ్ ఎక్స్ఐ ప్లస్ వేరియెంట్లలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్ సర్వీసులు సపోర్ట్ చేస్తాయి. 3. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ రాబోయే మారుతి సుజుకి బ్రెజ్జా కొత్త ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేయనుంది. దీంతో యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌ని సిస్టమ్'తో కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. బ్రెజా ప్రీమియం వేరియంట్ కారులో ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు. 4. కొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు అన్ని వాహనాలలో డిజిటల్'గా మారడంతో డ్రైవర్ డిస్ ప్లే భారీ మార్పును మనం గమనించవచ్చు. 5. వైర్ లెస్ ఛార్జింగ్ ప్రత్యర్ధి కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం కంపెనీ ఈ కొత్త బ్రెజ్జా కారులో వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్ సిస్టమ్ తీసుకొస్తుందని తెలుస్తుంది. 6. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మారుతి సుజుకి కొత్త కారులో అధునాతన కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్ ని స్వయం చాలకంగా స్టార్ట్ లేదా స్టాప్ చేయడం, హెడ్ ల్యాంప్స్ ను వాతావరణానికి తగ్గట్టు నియంత్రిస్తుంది. 7. 360 డిగ్రీల కెమెరా సరికొత్త బ్రెజ్జా కారులో 360 డిగ్రీల కెమెరాతో రావచ్చు. ఈ ఫీచర్ డ్రైవరుకు ఎంతగానో సహాయ పడుతుంది. 8. ప్యాడిల్ షిఫ్టర్లు కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా కారు ఆటోమేటిక్ వేరియెంట్ ప్యాడిల్ షిఫ్టర్లతో రావచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం సబ్ కాంపాక్ట్ ఎస్యువి కియా సోనెట్‌లో మాత్రమే లభిస్తుంది. 9. హైబ్రిడ్ టెక్నాలజీ కొత్త బ్రెజ్జాలో ప్రస్తుత 12వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని 48వీ హైబ్రిడ్ వ్యవస్థతో ఆటోమేకర్ భర్తీ చేయనున్నట్లు కొన్ని నివేదికలు సూచించాయి. ఇది అవుట్ గోయింగ్ మోడల్ కంటే మెరుగైన మైలేజీని ఇస్తుంది. ఈ కొత్త మోడల్ 4, సిలిండర్ల 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో రావచ్చు. ఇది 103బిహెచ్ పీ పవర్, 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్, ఫోర్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్ తో రావచ్చు. -
మారుతి సుజుకి కస్టమర్లకు హెచ్చరిక!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 1,80,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. భారతీయ ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ రీకాల్ చేయలేదు. ఫ్యూయెల్ పంప్లో లోపాలు ఉండటంతో పలు మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. మే 4, 2018 నుంచి అక్టోబర్ 27, 2020 మధ్య తయారు చేసిన సీయాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎక్స్ ఎల్6ల పెట్రోల్ వేరియెంట్లను రీకాల్ చేస్తుంది. ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. "వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, మారుతి సుజుకి మోటార్ జనరేటర్ యూనిట్ తనిఖీ/భర్తీ కోసం వాహనాలను ఉచితంగా స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని నిర్ణయించింది. లోపం ఉన్న వాహన యజమానులకు మారుతి సుజుకి అధికరులు కాల్ చేస్తారని" కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. అప్పటి వరకు వినియోగదారులు నీటితో నిండిన ప్రాంతాల గుండా వెళ్లకూడదు అని, వాహనాల ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల పైన వాటర్ స్ప్రే చేయకూడదని కోరింది.(చదవండి: 3 మిలియన్ల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్!) అలాగే, 2018 నుంచి 2020 మధ్య కాలంలో కొనుగోలు చేసిన వాహనదారులు తమ ఈ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని కోరింది. కస్టమర్లు తమ వాహనం ఈ జాబితాలో ఉందో చెక్ చేసుకోవడానికి www.marutisuzuki.com(ఎర్టిగా, విటారా బ్రెజ్జా కోసం), www.nexaexperience.com(సీయాజ్, ఎక్స్ ఎల్6, ఎస్-క్రాస్ కోసం) పోర్టల్ లోని IMP. CUSTOMER INFO లింకు మీద క్లిక్ చేసి వేహికల్ ఛాసిస్ నెంబరు (ఎమ్ఎ3 తర్వాత గల 14 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ నెంబరు) నమోదు చేయాల్సి ఉంటుంది. -
విటారా బ్రెజా కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ తన పాపులర్ ఎస్యూవీ మోడల్, విటారా బ్రెజాలో పెట్రోల్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.11.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో నిర్ణయించామని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్–సిక్స్ పెట్రోల్ విటారా బ్రెజాను 1.5 లీటర్ కె–సిరీస్ ఇంజిన్‌తో రూపొందించామని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్లో 5 గేర్లు(మాన్యువల్) వెర్షన్‌తో పాటు ఏఎమ్‌టీ(ఆటోమేటిక్ ట్రాన్సిషన్)ను కూడా అందిస్తున్నామని తెలిపారు. డీజిల్ కార్లకు టాటా... ఈ కొత్త విటారా బ్రెజాకు వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభించగలదన్న ధీమాను కెనిచి అయుకవ వ్యక్తం చేశారు. బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి నుంచి వైదొలుగుతున్నామని తెలిపారు. విటారా బ్రెజాలో డీజిల్ వేరియంట్‌ను దశలవారీగా ఉపసంహరిస్తామని వివరించారు. 2016లో విటారా బ్రెజా (డీజిల్) మోడల్‌ను మారుతీ సుజుకీ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. అనతికాలంలోనే యుటిలిటి వెహికల్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఐదు లక్షల విటారా బ్రెజాలు అమ్ముడయ్యాయి. -
‘విటారా బ్రెజా’ విక్రయాల జోరు
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకీ ఇండియా’ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ ‘విటారా బ్రెజా’ మొత్తం విక్రయాలు 4 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ కారు విడుదలైన మూడేళ్లలోనే ఇంతటి అమ్మకాలను నమోదుచేసినట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీగా 7 శాతం వృద్ధిరేటుతో 14,675 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. ‘ఈ ఎస్యూవీ డిజైన్, ఫీచర్స్ కస్టమర్ల అభిరుచులకు సరిగ్గా సరిపడే విధంగా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుండడం వల్లనే ఈస్థాయి విక్రయాలు నమోదయ్యాయి’ అని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు. -
దూసుకుపోయిన విటారా బ్రెజ్జా
సాక్షి, ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతికి ఎస్యూవీ విక్రయాల్లో దూసుకుపోయింది. ఎస్యూవీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం విటారా బ్రెజ్జా 3 లక్షల విక్రయాలను సాధించింది. 28 నెలల కాలంలో ఈ హాట్ సేల్‌ను సాధించామని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ప్రతి నెల ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాప్ 10లో ప్లేస్ సాధించే మారుతి ఘనతను మరింత పెంచడమే కాకుండా అతిపెద్ద కార్ల తయారీదారు మహీంద్రాను అధిగమించిదని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరంలో మారుతి యూవీ సేల్స్ 53759 యూనిట్లతో 27.53 శాతం వృద్ధిని సాధించింది. 25.69 శాతం నుంచి 27.53 శాతానికి విక్రయాలు పుంజుకున్నాయి. మరోవైపు మహీంద్రా యూవీ విక్రయాలు (2,33,915 యూనిట్లతో) 29.20 శాతం నుంచి 25.38 శాతం క్షీణించాయి. బ్రెజ్జా టాప్వేరియింట్ విక్రయాలు 56శాతం పుంజుకున్నాయని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్ ఎస్ కల్సీ వెల్లడించారు. ఈ సెగ్మెంట్లో పలుకొత్త కార్లు వచ్చినప్పటికి మార్చి 2016 లో లాంచ్ అయిన విటారా బ్రెజ్జా ఉత్తమంగా నిలిచిందన్నారు. -
మారుతి విటారా బ్రెజ్జా: కొత్త టెక్నాలజీతో
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) బుధవారం కాంపాక్ట్ ఎఎస్‌యూవీ విటారా బ్రెజ్జాను సరికొత్తగా పరిచయం చేసింది. పాదచారుల భద్రతతో సహా, ఆధునిక భద్రతా నిబంధనలతో కొత్త అల్లాయ్ వీల్స్, నిగనిగలాడే నలుపు రంగు ఫినీషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా విడుదల చేసింది. ఈ మేకోవర్ స్పోర్టీ బ్రెజ్జా వీడీఐ, జెడ్‌డీఐ, జెడ్‌డీఐ+ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. రూ. 8.54 లక్షల నుంచి రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య వీటి ధరలను నిర్ణయించింది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను మెరుగు పర్చడంతోపాటు అడ్వాన్స్డ్ సేఫ్టీ మెజర్స్‌ను పొందుపరిచింది. రిఫ్రెష్ విటారా బ్రెజ్జాలో ISOFIX చైల్డ్ లాకింగ్ సిస్టం , హై స్పీడ్ వార్నింగ్ ఎలర్ట్, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీసీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, ఫోర్స్ లిమిటర్స్‌తో కూడిన కొత్త భద్రతా ఫీచర్స్‌ను జోడించినట్టు కంపెనీ తెలిపింది.భారత ఎస్యూవీ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా ఉన్న బ్రెజ్జాను ఆటోగేర్ షిఫ్ట్, టూ పెడల్ టెక్నాలజీ మేళవింపుతో యువ కస్టమర్లకోసం మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్టు ఆర్ఎస్ కల్సీ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఏజీస్ వేరియంట్ విక్రయాలు మూడింతలు పెరిగినట్టు పేర్కొన్నారు. కాగా 2016లో ప్రారంభించిన విటారా బ్రెజ్జా మొత్తం 2.75 లక్షల యూనిట్లు విక్రయించింది. 2017-18లో 1,48,462 యూనిట్లను విక్రయించింది. దీని సగటు నెలవారీ అమ్మకాలు 12,300 యూనిట్లుగా ఉన్నాయి. టాప్ వేరియంట్ సేల్స్ మొత్తం అమ్మకాలలో 56 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. -
గతవారం బిజినెస్
మార్చిలో మెరుగుపడిన తయారీ కార్యకలాపాలు మూడు నెలల క్షీణత తర్వాత మార్చిలో తయారీ రంగ కార్యకలాపాలు మళ్లీ కాస్త మెరుగుపడ్డాయి. దేశీయంగా తయారీ రంగ కార్యకలాపాల తీరుతెన్నులను తెలియజేసే ఎస్బీఐ వార్షిక కాంపోజిట్ సూచీ తాజాగా కీలకమైన 50 పాయింట్ల మార్కును దాటి 50.3కి చేరడం దీనికి నిదర్శనం. ఇక నెలవారీ సూచీ కూడా మెరుగుపడింది. ఫిబ్రవరిలో 49.2గా ఉండగా.. మార్చిలో 53.3కి చేరిందని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సూచీ విలువ 5052 మధ్యలో ఉంటే స్వల్ప వృద్ధిని, 5255 మధ్య ఉంటే ఒక మోస్తరు వృద్ధిని సూచిస్తుంది. ఏడాదిలో లక్ష ’విటారా బ్రెజా’ విక్రయాలు దిగ్గజ వాహన తయారీ కంపెనీ ’మారుతీ సుజుకీ’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ’విటారా బ్రెజా’ విక్రయాలు లక్ష యూనిట్ల మార్క్‌ను అధిగమించినట్లు ప్రకటించింది. విటారా బ్రెజాను ఆవిష్కరించిన ఏడాది కాలంలోపే విక్రయాలు 1.1 లక్షల యూనిట్లను దాటేశాయని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ.. విటారా బ్రెజాను గతేడాది మార్చిలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎస్బీఐ కార్డ్‌లో వాటాలు పెంచుకోనున్న ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ సంస్థ ఎస్బీఐ కార్డ్‌లో జూన్ నాటికల్లా వాటాలను 74 శాతానికి పెంచుకోనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం కొన్ని నియంత్రణపరమైన అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు ’ఎస్బీఐ కార్డ్ ఉన్నతి’ని ఆవిష్కరించిన సందర్భంగా ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో రెండు క్రెడిట్ కార్డు జాయింట్ వెంచర్స్‌లో వాటాలను 74 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలకు ఎస్బీఐ బోర్డు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. బిట్ కాయిన్లు చట్ట వ్యతిరేకం: కేంద్రం బిట్ కాయిన్లు తరహా వర్చువల్ కరెన్సీ (డిజిటల్ రూపంలో ఉండేవి) వినియోగం చట్ట విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని ఆర్బీఐ గుర్తించలేదని, వీటి కొనుగోళ్లు, లావాదేవీలు మనీలాండరింగ్ వ్యతిరేక చట్టం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. వర్చువల్ కరెన్సీ వాడకం వల్ల తలెత్తే ఆర్థిక, చట్టపరమైన, భద్రతా ముప్పు గురించి ట్రేడర్లను, వాటిని వినియోగించేవారిని ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. చెల్లింపుల కోసం బిట్ కాయిన్ తరహా వర్చువల్ కరెన్సీల సృష్టికి ఏ సెంట్రల్ బ్యాంకు కూడా అనుమతించలేదన్నారు. మూడేళ్లుగా నష్టాల్లోనే 43 కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 43 సంస్థలు (సీపీఎస్ఈ) మూడేళ్లుగా (2013–16) నష్టాలతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉన్నాయి. వనరుల కొరత, సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకోవడం, తీవ్రమైన పోటీ, బలహీనమైన మార్కెటింగ్ విధానాలు, నిర్వహణ లోపం నష్టాలకు కారణాలు. ఈ జాబితాలో బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్, హెచ్ఎంటీ వాచెస్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సైతం ఉన్నాయి. 456 బిలియన్ డాలర్లకు తగ్గిన విదేశీ రుణభారం గతేడాది మార్చి నుంచి డిసెంబర్ ఆఖరు నాటికి భారత విదేశీ రుణభారం మొత్తం 456 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీర్ఘకాలికమైన, వాణిజ్యపరమైన విదేశీ రుణాలు తగ్గడం ఇందుకు కారణం. గతేడాది మార్చి ఆఖరు నాటి పరిమాణంతో పోలిస్తే ఈ తగ్గుదల 29 బిలియన్ డాలర్లు. ఎనిమిది రంగాల గ్రూప్ పేలవ పనితీరు! ఎనిమిది పరిశ్రమల గ్రూప్ ఫిబ్రవరిలో పేలవ పనితీరు ప్రదర్శించింది. ఈ రంగాల వృద్ధి రేటు కేవలం ఒక శాతంగా నమోదయ్యింది. గడచిన ఏడాది కాలంలో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదుకాలేదు. క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి 2016 ఫిబ్రవరితో పోల్చితే 2017 ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణించడం దీనికి ప్రధాన కారణం. కాగా బొగ్గు, స్టీల్, విద్యుత్ ఉత్పత్తి బాగుండడం మొత్తం సూచీ వృద్ధిలో ముగియడానికి కారణమైంది. ఈ ఎనిమిది రంగాలు 2015లో 0.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, 2017 జనవరిలో 3.4 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 38 శాతం. లక్ష్యాన్ని దాటిన ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయం వ్యయానికి మధ్య వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని ఫిబ్రవరి ముగిసే నాటికే దాటిపోయింది.ద్రవ్యలోటు ఫిబ్రవరిలో 6.05 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2016–17 బడ్జెట్ లక్ష్యం (మార్చి 31తో ముగిసిన కాలం) రూ.5.34 లక్షల కోట్లు. అంటే ఇది లక్ష్యంలో ఫిబ్రవరి నాటికే 113.4 శాతానికి చేరిందన్నమాట. పన్నుయేతర ఆదాయాలు తగ్గడం దీనికి కారణం. విదేశీ మారక నిల్వలు.. 368 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి 24తో ముగిసిన వారంలో, అంతక్రితం ఇదే వారంతో పోలిస్తే 1.15 బిలియన్ డాలర్లు పెరిగాయి. 367.93 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మొత్తం నిల్వల్లో కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ నిల్వలు 344.23 బిలియన్ డాలర్లకు చేరాయి. చిన్న మొత్తాల్లో పొదుపు చేసే ఖాతాదారులకు నిరాశను మిగుల్చుతు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్మాల్ సేవింగ్స్‌పై ఇచ్చే వడ్డీ రేటును తగ్గించింది. పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి స్కీమ్‌లపై 0.1 శాతం వడ్డీ తగ్గించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభ మయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. మరోవైపు అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) స్కీమ్ ఇక రెక్కలు విప్పుకోనుంది. ఈ స్కీమ్ పరిధిలో విమాన సర్వీసులను అందించేందుకు దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్‌లైన్స్ సంస్థలను, 128 రూట్లను కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 70 ఎయిర్‌పోర్టు లను దీనిద్వారా అనుసంధానం చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 31 ఎయిర్‌పోర్టులు నిర్వహణలో లేనివే. మరో 12 అరకొర సర్వీసులున్న ఎయిర్‌పోర్టులను కూడా జాబితాలో చేర్చారు. బీఎస్–3 ప్రమాణాలతో ఉన్న వాహన విక్రయాలు ఇక జరగవు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 వాహనాలను విక్రయించడం, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని వాహన కంపెనీలు బీఎస్–4 వాహనాలను మాత్రమే వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. డీల్స్.. ⇒ వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమి సిస్టమ్స్ (ఎంఎస్ఎస్ఎల్) ఫిన్లాండ్కు చెందిన పీకేసీ గ్రూప్ పీఎల్సీ కొనుగోలును పూర్తి చేసింది. ఈ డీల్ విలువ రూ.4,150 కోట్లు. ⇒ టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన మొబైల్ టవర్ల విభాగం భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) కన్సార్షియమ్కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్‌ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్టెల్ కంపెనీ భావిస్తోంది. వాటా విక్రయానంతరం భారతీ ఇన్ఫ్రాటెల్లో భారతీ ఎయిర్‌టెల్‌కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి. ⇒ ఐటీ కంపెనీ జెన్సర్ టెక్నాలజీస్ బెంగళూరుకు చెందిన కీస్టోన్ లాజిక్ కంపెనీని కొనుగోలు చేసింది. డీల్ వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏడాదిలో లక్ష ‘విటారా బ్రెజా’ విక్రయాలు
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘విటారా బ్రెజా’ విక్రయాలు లక్ష యూనిట్ల మార్క్‌ను అధిగమించినట్లు ప్రకటించింది. విటారా బ్రెజాను ఆవిష్కరించిన ఏడాది కాలంలోపే విక్రయాలు 1.1 లక్షల యూనిట్లను దాటేశాయని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ.. విటారా బ్రెజాను గతేడాది మార్చిలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించి 50,000కుపైగా బుకింగ్స్ 20 వారాల వెయిటింగ్ పీరియడ్‌తో పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. విటారా బ్రెజా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరిలో తమ యుటిలిటీ వాహన విక్రయాలు 80,522 యూనిట్ల నుంచి 1,77,430 యూనిట్లకు ఎగశాయని, అంటే 120%కిపైగా వృద్ధి నమోదయ్యిందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా చెప్పారు. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి. -
టాప్-10 ప్యాసింజర్ కార్లు ఇవే!
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కొత్త కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్) విటారా బ్రీజా రయ్యిమని దూసుకుపోతోంది. ఈ మోడల్స్ అమ్మకాల్లో అదుర్స్ మనిపిస్తూ టాప్-10 ప్యాసెంజర్ వెహికిల్ జాబితాలో చోటు సాధించింది. టాప్-10 అమ్మకాల జాబితాలో ఆరు మోడల్స్ మారుతీ సుజుకీవే ఉన్నాయి. మే నెలలో 7,193 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ విటారా బ్రీజ్ 10వ స్థానంలో నిలవగా.. ఎంట్రీ లెవల్ మోడల్ ఆల్టో 19,874 యూనిట్లతో అగ్రస్థానంలో ఉందని భారత ఆటోమొబైల్ తయారీ సంఘ సొసైటీ(సియామ్) గణాంకాల్లో తెలిపింది. 14,413 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ రెండో స్థానంలో ఉంది. మారుతీ సుజుకీ బ్రాండ్లు వాగన్ ఆర్ మూడో స్థానం, స్విప్ట్ నాలుగోస్థానం, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనో ఏడో స్థానం, సెలిరియో ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 12,005 యూనిట్లతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఐదో స్థానానికి ఎగబాకగా, 10,472 యూనిట్ల అమ్మకాలతో ప్రీమియం కాంపాక్ట్ ఎలైట్ ఐ20 ఆరో స్థానానికి ఎగిసిందని సియామ్ తెలిపింది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బహుళ ప్రయోజన వాహనం ఇన్నోవా క్రిస్టా కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. 7,259 యూనిట్లతో టయోటా ఇన్నోవా తొమ్మిదో స్థానంలో నిలిచింది.