విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి.
అయితే జూన్లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి.