ఏడాదిలో లక్ష ‘విటారా బ్రెజా’ విక్రయాలు
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘విటారా బ్రెజా’ విక్రయాలు లక్ష యూనిట్ల మార్క్‌ను అధిగమించినట్లు ప్రకటించింది. విటారా బ్రెజాను ఆవిష్కరించిన ఏడాది కాలంలోపే విక్రయాలు 1.1 లక్షల యూనిట్లను దాటేశాయని కంపెనీ పేర్కొంది. మారుతీ సుజుకీ.. విటారా బ్రెజాను గతేడాది మార్చిలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
దీనికి సంబంధించి 50,000కుపైగా బుకింగ్స్ 20 వారాల వెయిటింగ్ పీరియడ్‌తో పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. విటారా బ్రెజా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరిలో తమ యుటిలిటీ వాహన విక్రయాలు 80,522 యూనిట్ల నుంచి 1,77,430 యూనిట్లకు ఎగశాయని, అంటే 120%కిపైగా వృద్ధి నమోదయ్యిందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవా చెప్పారు.