భారత్ రుణ భారం 485.8 బిలియన్ డాలర్లు..
భారత్ విదేశీ రుణ భారం ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 485.8 బిలియన్ డాలర్లు. అంతక్రితం త్రైమాసికం ము గింపుతో పోల్చితే 3% మేర ఈ భారం పెరిగిందని ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది. విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ డెట్ విభాగంలోకి భారీగా రావడం త్రైమాసికంలో విదేశీ రుణం 3 శాతం పెరగడానికి కారణమని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.
పోటీతత్వంలో భారత్‌కు 40వ స్థానం
అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 40వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. మొత్తం 137 దేశాలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని స్విట్జర్లాండ్ సాధించింది.
ఎస్‌బీఐ ఖాతాదారులకు ‘బ్యాలెన్స్’ ఊరట
ఎస్‌బీఐ కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనలను సడలించింది. సేవిం గ్స్ ఖాతాలపై ఇప్పటిదాకా రూ. 5,000గా ఉన్న ఎంఏబీని రూ. 3,000కు తగ్గించింది. బ్యాలెన్స్ నిబంధనలు పాటించకపోతే విధించే జరిమానాల పరిమాణాన్నీ సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకొస్తాయి. దీని ప్రకారం.. పెన్షనర్లు, మైనర్లతో పాటు ప్రభుత్వ సామాజిక సంక్షేమపథకాల లబ్ధిదారులకు మిని మం బ్యాలెన్స్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది.
గోల్డ్ స్పాట్ ఎక్సేంజ్ ఏర్పాటుకు బ్లూప్రింట్
బంగారం స్పాట్ ఎక్సేంజ్ ఏర్పాటుకు కేంద్రం ఆసక్తిగా ఉండ టంతో ఇందుకు సంబంధించి బ్లూప్రింట్ రూపొం దించేందుకు ప్రపంచ స్వర్ణ మండలి ఓ కమిటీని ఏర్పా టు చేస్తోంది. ఇందులో పరిశ్రమకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉంటారు.
అంబానీ సంపద... యెమెన్ జీడీపీకి రెట్టింపు!
హురుణ్ ఇండియా సంపన్నుల జాబితా–2017లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా ఆరోసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్లు ర్యాలీ జరపడం వల్ల ఈయన సంపద 58 శాతం వృద్ధితో రూ.2,57,900 కోట్లకు చేరింది. అంబానీ సంపద తను జన్మించిన యెమెన్ దేశపు జీడీపీ కన్నా 50 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం!!. ఇక పతంజలి సీఈవో బాలకృష్ణ సంపద 173 శాతం వృద్ధితో రూ.70,000 కోట్లకు చేరింది. దీంతో ఈయన 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డిమార్ట్) ఫౌండర్ చైర్మన్ దమాని సంపదలో గరిష్టంగా 320 శాతం వృద్ధి నమోదయ్యింది.
2020 కల్లా 5జీ టెక్నాలజీ
మరింత వేగవంతమైన వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2020 నాటికల్లా 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి 5జీ ఫోరంను ఏర్పాటు చేయడంతో పాటు పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటానికి రూ.500 కోట్లతో నిధిని కూడా ఏర్పాటు చేయనుంది.
భారత్ వృద్ధి రేటుకు ఏడీబీ కోత
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7 శాతానికి తగ్గించింది. జూలైలో ఈ రేటును 7.4 శాతంగా అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, తయారీ రంగం, వాణిజ్య పెట్టుబడుల పేలవ పనితీరు వంటివి అంచనాల కోతకు కారణమని పేర్కొంది. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.
‘నారీ’ శక్తి వీరిదే!!
ఫార్చ్యూన్ తాజాగా అమెరికాకు వెలుపల అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. ఇం దులో భారత్‌కు చెందిన చందా కొచర్, శిఖా శర్మలకు స్థానం దక్కింది. ఇద్దరూ బ్యాంకింగ్ రంగానికి చెందిన వారే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ ఐదో స్థానాన్ని దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో శిఖా శర్మ 21వ స్థానంలో నిలిచారు. బాన్కో శాంటాన్డర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అన బొటిన్ అగ్రస్థానంలో ఉన్నారు.
ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్
మార్ట్‌గేజ్ రుణ గ్రహీతలకు ఐసీఐసీఐ బ్యాంకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారు తీసుకున్న ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఒక శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ప్రతి నెలా వాయిదా చెల్లించిన వెంటనే ఒక శాతాన్ని బ్యాంకు వెనక్కిస్తుంది. 30 ఏళ్ల రుణ కాల వ్యవధిలో ఈ విధంగా రుణ గ్రహీత అసలులో 11 శాతం వరకు క్యాష్ బ్యాక్‌గా పొందొచ్చు. ఈ అవకాశం కొత్తగా రుణం తీసుకునేవారికే!!.
2025కి రియల్టీలో 80 లక్షల ఉద్యోగాలు!
రియల్టీ రంగంలో 2025 నాటికి కొత్తగా 80 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త రియల్ ఎస్టేట్ చట్టం (రెరా), జీఎస్‌టీ వంటి అంశాలు దీనికి ప్రధాన కారణంగా నిలువనున్నాయి. రియల్టీ సమాఖ్య క్రెడాయ్, కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్‌ఈ సంయుక్త నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 2025 నాటికి రెట్టింపయి 13 శాతానికి చేరొచ్చు. 2016లో ఈ వాటా 6.3 శాతంగా ఉంది. రియల్టీలో గతేడాది 92 లక్షలుగా ఉన్న ఉద్యోగాలు 2025 నాటికి 1.72 కోట్లకు చేరొచ్చు.
ఐసీసీయూలో టెలికం రంగం!
తీవ్రమైన పోటీ, రుణభారంతో కుంగుతున్న టెలికం రంగం ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) దాటి ఐసీసీయూ లోకి చేరిందని ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు రుణదాతలకు కూడా భారీ రిస్కు తప్పదని హెచ్చరించారు. గుత్తాధిపత్య ధోరణుల దిశగా మార్కెట్ సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటోమొబైల్స్
ఐఫోన్ యూజర్లకు శుభవార్త. యాపిల్ ఐఫోన్–8, 8 ప్లస్ ఫోన్ల నిరీక్షణకు తెరపడింది. శుక్రవారం నుంచి వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. కాగా ఐఫోన్–10 హ్యాండ్‌సెట్లు మాత్రం నవంబర్ 3 నుంచి అందుబాటులోకి వస్తాయి.
వాహన తయారీ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ ఇండియా’ తన డాట్సన్ బ్రాండ్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కారు ’డాట్సన్ రెడిగో గోల్డ్’ అనే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. 1 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో వస్తోన్న ఈ కారు ధర రూ.3.69 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది.
హెచ్‌ఎండీ గ్లోబల్ తాజాగా ’నోకియా8’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.36,999గా ఉంది. ఈ ఫోన్లు అక్టోబర్ 14 నుంచి అందుబాటులోకి వస్తాయి.
’ఆసుస్’ తాజాగా కొత్త నోట్‌బుక్ ’వివోబుక్ ఎస్15’ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.59,990గా ఉంది. అలాగే ’జెన్‌బుక్ యూఎక్స్430’ ల్యాప్‌టాప్‌ను కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ.74,990గా ఉంది.
దోమలను తరిమేసే స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. మొబైల్ హ్యాండ్‌సెట్స్ కంపెనీ ఎల్‌జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో ’కే7ఐ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,990గా ఉంది.
’మహీంద్రా’ తాజాగా ’బొలెరొ మ్యాక్సీట్రక్ ప్లస్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5.24 లక్షలు.
‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ తన ‘ఎతియోస్ క్రాస్’లో లిమిటెడ్ ఎడిషన్ ’ఎతియోస్ క్రాస్ ఎక్స్’ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.64 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది.