
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం మరో 35 పైసలు బలహీనపడింది. దేశీయంగా సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంట్రాబ్యాంక్ ఫారెన్ ఎక్సే్చంజ్‌లో రూపాయి విలువ 65.45 వద్ద ముగిసింది. మార్చి 23 తరువాత రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. సోమవారం రూపాయి 31పైసలు బలహీనపడి 65.10 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, దేశీయంగా కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ వంటి అంశాలు రూపాయి బలహీనతకు దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రాత్రి 9 గంటల సమయానికి రూపాయి బలహీనంగానే 65.45 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇదే సమయానికి డాలర్ ఇండెక్స్ 93 వద్ద ట్రేడవుతోంది.
భారత్ వృద్ధి రేటుకు ఏడీబీ కోత
7.4 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి రేటు అంచనాలను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 7 శాతానికి తగ్గించింది. జూలైలో ఈ రేటును 7.4 శాతంగా ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, తయారీ రంగం, వాణిజ్య పెట్టుబడుల పేలవ పనితీరు తన తాజా అంచనా కోతకు కారణంగా తన ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ 2017లో పేర్కొంది.
సేవల రంగమూ ప్రతికూలంగానే ఉన్నట్లు పేర్కొంది. 2016–17 వృద్ధి రేటు (7.1 శాతం) కన్నా తాజా అంచనా తక్కువ కావడం గమనార్హం. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.6 శాతం నుంచి 7.4 శాతానికి ఏడీబీ తగ్గించింది.