
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇటీవలి పతనం కారణంగా ధరలు పడిపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగడమే దీనికి కారణం. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా కలసి వచ్చింది. చివరి గంటలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 279 పాయింట్లు పెరిగి 37,393 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు ఎగసి 11,257 పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ, ఆర్థిక, లోహ రంగ షేర్లు రాణించాయి. ఫార్మా షేర్లు పడిపోయాయి. ఈ నెలలో స్టాక్ మార్కెట్ లాభపడటం ఇది రెండో రోజు మాత్రమే.
23 వరకూ ఒడిదుడుకులు...
చైనా టెలికం దిగ్గజం హువాయ్‌పై అమెరికా ఆంక్షలు విధించడం... చైనా– అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, లాభాల్లో ముగిశాయి. ఇటీవలి తొమ్మిది రోజుల పతనం కారణంగా బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, మధ్యాహ్నం 2 గంటల వరకూ స్తబ్దుగా కొనసాగింది. చివరి గంటన్నరలో షార్ట్ కవరింగ్‌కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 63 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 404 పాయింట్ల వరకూ పెరిగింది. మొత్తం మీద రోజంతా 467 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఎన్నికల ఫలితాలు వెలువడే ఈ నెల 23 వరకూ స్టాక్‌మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
► టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బేవరేజేస్‌ల బ్రాండెడ్ ఫుడ్ వ్యాపారాన్ని విలీనం చేస్తుండటంతో ఈ రెండు షేర్లు 8–10 శాతం రేంజ్‌లో పెరిగాయి.
► యస్‌బ్యాంక్ నష్టాలు కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం పతనమై రూ.138 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► స్టాక్ మార్కెట్ లాభపడినా, 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, యస్‌బ్యాంక్, అరవింద్, అపోలో టైర్స్, భారత్ ఫోర్జ్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు వీటిలో ఉన్నాయి.
► మూడు రోజుల నష్టాల నుంచి జెట్ ఎయిర్‌వేస్ కోలుకుంది. 2.5 శాతం లాభంతో రూ.127 వద్ద ముగిసింది.
ఎగిసిన రూపాయి
చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గురువారం దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆఖర్లో కోలుకోవడంతో రూపాయి పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే 31 పైసలు పెరిగి 70.03 వద్ద క్లోజయ్యింది. రూపాయి బలపడటం ఇది వరుసగా మూడో రోజు. ఈ మూడు రోజుల్లో దేశీ కరెన్సీ 48 పైసల మేర పెరిగింది. పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి లాభాలకు కొంత మేర అడ్డుకట్ట పడిందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment