
తక్కువ వడ్డీరేట్లతోనే వృద్ధికి ఊతం
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా
న్యూఢిల్లీ: తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థతోనే ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గడచిన ఏడాదిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.25 శాతం తగ్గిస్తే...(6.75 శాతానికి) బ్యాంకులు కేవలం సగం కన్నా తక్కువగా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం విచారకరమని పేర్కొన్నారు. తక్షణం బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని అభ్యర్థించారు.
ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి ఇది కీలకమని తెలియజేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన స్థాయికి వడ్డీరేట్లు తగ్గుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీలకు ప్రస్తుతం నిధుల సమీకరణ వ్యయం భారంగా మారినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 7.4 శాతం శ్రేణిలో నమోదవుతుందన్నది తన అభిప్రాయమని అన్నారు. అయితే వచ్చే ఏడాది 8 శాతానికి, అటు తర్వాత రెండేళ్లలో 9 శాతానికి చేరుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
సమగ్ర జీఎస్‌టీ అవసరం
ఎటువంటి లొసుగులూ లేని సమగ్ర వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వ్యవస్థ అవసరమని నోతియా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి జీఎస్‌టీపై రాజకీయాలకు అతీతమైన విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈ దిశలో త్వరలో ముందడుగు పడుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 30% నుంచి 25%కి కార్పొరేట్ పన్ను తగ్గింపు దిశలో... ప్రస్తుత రాయితీలు తొలగించడానికి సంబంధించి జాగరూకతతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలని కోరారు. ఈ దిశలో పరిశ్రమ ప్రయోజనానికి పెద్ద పీట వేయాలని విజ్ఞప్తి చేశారు.