యమహా చౌక బైక్ వస్తోంది..! | lowest price bikes in yamaha | Sakshi
Sakshi News home page

యమహా చౌక బైక్ వస్తోంది..!

Published Tue, Jul 1 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

యమహా చౌక బైక్ వస్తోంది..!

యమహా చౌక బైక్ వస్తోంది..!

  •  ధర రూ.30 వేల లోపు ఉండొచ్చు
  • ఎఫ్‌జెడ్ సిరీస్‌లో రెండు కొత్త
  • వేరియంట్‌లు విడుదల
  • ధరలు రూ.76,250-రూ.78,250
  • న్యూఢిల్లీ: యమహా కంపెనీ త్వరలో చౌక బైక్(500 డాలర్లు-రూ.30,000)ను మార్కెట్లోకి తేనున్నది.  ఎఫ్‌జెడ్ బైక్‌ల్లో (150 సీసీ కేటగిరీ) రెండు కొత్త వేరియంట్‌లను అందిస్తోంది. ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్‌ల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. ఎఫ్‌జెడ్ సిరీస్‌ను 2008లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టామని యమహా ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. నేటి(మంగళవారం)నుంచి ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0(ధర రూ.76,250),  ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0(రూ.78,250- ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ను విక్రయిస్తామని వివరించారు.

    ప్రస్తుతం ఫేజర్‌తో సహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లను నెలకు 18వేల వరకూ విక్రయిస్తున్నామన్నారు. తాజాగా అందిస్తున్న ఈ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌లతో కలుపుకొని అమ్మకాలు నెలకు 24 వేలకు పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తోన్న చెన్నై ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 లక్షలని పేర్కొన్నారు.
     
    500 డాలర్ల యమహా బైక్: త్వరలో చౌక బైక్ (500 డాలర్లు-రూ.30,000)ను అందించనున్నామని యమహా మోటార్ ఆర్ అండ్ డీ ఇండియా ఎండీ తొషికజు కొబయాషి చెప్పారు. ఈ చౌక బైక్‌పై కసరత్తు జరుగుతోందని, ధర విషయం ఇప్పుడే నిర్ణయాత్మకంగా చెప్పలేమని పేర్కొన్నారు. 500 డాలర్ల ధరకే అందించాలని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఈ బైక్‌ను ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది  వెల్లడించలేదు. ఈ చౌక బైక్ కారణంగా తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

    స్కూటర్లు, 150 సీసీ కేటగిరీ బైక్‌ల్లో పటిష్టమైన స్థానానికి చేరిన తర్వాత ఇతర సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తామని రాయ్ కురియన్ వివరించారు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి తమ అమ్మకాలు 32% పెరిగాయని, ఇదే జోరు కొనసాగనున్నదని కురియన్ పేర్కొన్నారు. గతేడాది 4.47 లక్షల టూవీలర్లను విక్రయించామని, ఈ ఏడాది 6 లక్షల టూవీలర్లను విక్రయించనున్నామని చెప్పారు. ప్రస్తుతం 1,300గా ఉన్న డీలర్ల సంఖ్యను ఈ ఏడాది చివరికల్లా 1,600కు పెంచనున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement