స్మాల్ క్యాప్ స్టాక్స్ 2017లో తెగ ర్యాలీ చేశాయి. అయితే, ఈ ఏడాది జవనరి–మార్చి మధ్య కాలంలో అవి కరెక్షన్ బాట పట్టాయి. మార్కెట్లలో అస్థిరత నెలకొన్న సమయాల్లో స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడిన పనే. అయితే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే రిస్కీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎల్‌అండ్‌టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ ఒకానొక అనువైన పథకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఎల్‌అండ్‌టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ 2014లో క్లోజ్ ఎండెడ్ పథకంగా ప్రారంభమైంది. అయితే, ఆతర్వాత 2016లో దీన్ని ఓపెన్ ఎండెడ్ ఫండ్‌గా మార్చారు. దీంతో ఎప్పుడైనా పెట్టుబడులకు వీలుంటుంది. నాటి నుంచి ఇది ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షిస్తూ తన నిర్వహణలోని ఆస్తుల విలువను గణనీయంగా పెంచుకుంది.
ఏప్రిల్ 30 నాటికి ఈ పథకం నిర్వహణ ఆస్తుల విలువ రూ.5,000 కోట్లకు చేరడం గమనార్హం. పథకం ప్రారంభించి చాలా తక్కువ కాలమే కావడంతో దీర్ఘకాలిక పనితీరును పరిశీలించేందుకు అవకాశం లేదు. అయితే, గడిచిన మూడేళ్లుగా బెంచ్‌మార్క్ కంటే అధిక రాబడులను ఇస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
పనితీరు, పెట్టుబడులు
గత ఏడాది కాలంలో 24 శాతం రాబడులను ఇచ్చిన ఈ పథకం .. మూడేళ్ల కాలంలో 27 శాతం రాబడులను అందించింది. కానీ, ఇదే కాలంలో ప్రామాణిక స్మాల్ క్యాప్ విభాగం రాబడులతో పోలిస్తే 5–6 శాతం అధిక ప్రతిఫలాన్నే అందించిన పథకం ఇది. బెంచ్ మార్క్ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీని మించి రాబడులను తెచ్చిపెట్టింది.
నిర్మాణ రంగ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ క్యాపిటల్ గూడ్స్, టెలికం, ఆటో యాన్సిలరీ, టెక్స్‌టైల్ రంగాల్లో ఈ ఫండ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఫైనాన్షియల్స్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ స్టేపుల్స్, విద్యుత్ రంగ స్టాక్స్‌లో పెట్టుబడులను తక్కువకు పరిమితం చేసింది.
రామ్‌కో సిమెంట్స్, కార్బోరండం యూనివర్సల్, రాణే హోల్డింగ్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ లైఫ్‌స్టయిల్ ఫ్యాషన్స్‌లో పెట్టుబడులు మల్టీబ్యాగర్ రాబడులకు దోహద పడ్డాయి. స్వరాజ్ ఇంజన్స్, టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ, ఇండియన్ హ్యూమ్ పైప్, త్రివేణి టర్బైన్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, టీవీఎస్ శ్రీచక్ర, కేపీఆర్‌మిల్ ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో కీలక స్టాక్స్‌గా ఉన్నాయి.
మార్పులు
సెబీ ఆదేశాల నేపథ్యంలో ఇటీవల ఫండ్స్ పథకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎల్‌అండ్‌టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ స్మాల్‌క్యాప్ పథకంగానే ఇకపైనా కొనసాగుతుంది. పేరులో మార్పు లేదు. కాకపోతే పెట్టుబడుల్లో మార్పు లు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
ఇప్పటి వరకు ఫండ్ మొత్తం నిధుల్లో 50 శాతం స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తుండగా, ఇకపై ఇది 65 శాతానికి మారింది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ అని స్పష్టంగా నిర్వహించాలన్నది సెబీ ఆదేశం. కనుక రామ్‌కో సిమెంట్స్, ఫ్యూచర్ రిటైల్ మిడ్‌క్యాప్ విభాగం కిందకు వస్తాయి. దీంతో పథకం పోర్ట్‌ఫోలియోలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment