
ఇతర మెట్రో నగరాల్లో పరిస్థితేంటి?
900–1,200 చ.అ. ఫ్లాట్లకు 40 శాతం డిమాండ్
వచ్చే ఐదేళ్లూ అందుబాటు గృహాలదే ఆధిపత్యం: మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రానున్న ఐదేళ్ల కాలం దేశీయ స్థిరాస్తి రంగంలో అందుబాటు గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుందని మ్యాజిక్‌బ్రిక్స్ ఎడిటోరియల్ అండ్ అడ్వైజరీ హెడ్ ఈ జయశ్రీ తెలిపారు.
♦ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 900–1,200 చ.అ. మధ్య ఉండే మిడిల్ ఇన్‌కం గ్రూప్ (ఎంఐజీ) గృహాలకు 40 శాతం డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా పుణె, నోయిడా, థానే, నవీ ముంబై నగరాల్లో అయితే మరీనూ. రూ.6 లక్షల వరకు వార్షిక వేతనముండే వాళ్లూ సీఎల్‌ఎస్‌ఎస్‌కి అర్హులవుతుండటంతో 300–600 చ.అ. ఫ్లాట్లకూ గిరాకీ ఉంది.
♦ 600 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఫ్లాట్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రధాన నగరాల్లో ఈ తరహా గృహాలకు 11 శాతం డిమాండ్ ఉంది. నోయిడా, పుణె, హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరు, అహ్మదాబాద్‌ల్లో 300 చ.అ.లోపుండే ఫ్లాట్లకు గిరాకే లేదు. ఆయా నగరాల్లో 450 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంది.
♦ గుర్గావ్‌లో మాత్రం 2,200 చ.అ. కంటే పైనుండే ఫ్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. 1,000 చ.అ. ఫ్లాట్లు ఆ తర్వాత నేరుగా 1,300 చ.అ. ఫ్లాట్లకే గిరాకీ ఎక్కువగా ఉందిక్కడ.
♦ నగరాలను బట్టి అందుబాటు గృహాల ఎంపికలోనూ కొనుగోలుదారుల దృష్టి మారడానికి కారణముంది. ఫరీదాబాద్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో చ.అ.కు నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. దీంతో ఆయా నగరాల్లో 1,000–1,200 చ.అ. ఫ్లాట్లకు డిమాండ్ ఉంటుంది. అదే ఢిల్లీ, నవీ ముంబై వంటి ప్రీమియం నగరాల్లో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుండటంతో ఇక్కడ చిన్న ఫ్లాట్లకు మొగ్గు చూపుతుంటారు.