
టెకీలకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెడుతున్న నేపథ్యంలో భారీ టెక్నాలజీ కంపెనీలు భారీగా నియామకాలకు దిగుతుండటం టెకీలకు ఊరట ఇస్తోంది. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, ఒరాకిల్, ఐబీఎం, గోల్డ్‌మన్‌శాక్స్ వంటి ఎంఎన్‌సీలు వేలాది ఉద్యోగుల నియామకానికి సన్నాహాలు చేస్తుండటం ఐటీ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. యాక్సెంచర్ భారత్‌లో 5396 మందిని రిక్రూట్ చేసుకోనుండగా, ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని 2649 మంది ఉద్యోగులను చేర్చుకోనుంది. ఇక ఒరాకిల్ భారత్‌లో 1124 మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐబీఎం, గోల్డ్‌మాన్‌శాక్స్, డెల్, మైక్రోసాఫ్ట్, సిస్కో తదితర కంపెనీల్లోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. భారత్‌లో గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లు కలిగిన ఎంఎన్‌సీలు ఈ ఏడాది భారీగా నియామకాలను చేపడతారని కన్సల్టెన్సీ సంస్థ జిన్నోవ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఈ సంస్థలు భారత్‌లో దాదాపు 30,000 మందిని పైగా నియమించుకుంటాయని భావిస్తున్నారు.ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్ర తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న క్రమంలో తాజా నియామకాలు ఐటీ పరిశ్రమలో నూతనోత్తేజం నింపుతాయని పరిశ్రమ సంస్థ నాస్కామ్ పేర్కొంది.