
భారత్‌లో టెలికం యూజర్లు @ 97 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గతేడాది డిసెంబర్ చివరికల్లా వీరి సంఖ్య 97 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం, గతేడాది నవంబర్ చివరి నాటికి 96.4 కోట్లుగా ఉన్న టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య డిసెంబర్ చివరికల్లా 97.1 కోట్లకు చేరింది. ప్రతి 100 మందికి 78 మంది టెలీ కనెక్షన్లను కలిగి ఉన్నారు. అలాగే డిసెంబర్ చివరికల్లా దేశంలో 94.39 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. భారతీ ఎయిర్‌టెల్ 22 కోట్ల మొబైల్ వినియోగదారులతో మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
దీని తర్వాత స్థానాల్లో 18 కోట్ల వినియోగదారులతో వొడాఫోన్, 15 కోట్ల వినియోగదారులతో ఐడియా, 11 కోట్ల వినియోగదారులతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, 8 కోట్ల వినియోగదారులతో బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నాయి.