
ముంబై: మనీలాండరింగ్‌ని అరికట్టే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా రెండో దశలో 55,000 పైచిలుకు డొల్ల కంపెనీలను మూయించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి. చౌదరి తెలిపారు. మరికొన్ని కంపెనీల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్నింటికి నోటీసులు కూడా పంపినట్లు ఇండో–అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.
రెండేళ్ల పైగా వార్షిక ఆర్థిక నివేదికలు దాఖలు చేయని 2.26 లక్షల పైగా సంస్థలను తొలి దశలో కేంద్రం రద్దు చేసింది. ఇక రెండో దశలో 55,000 పైచిలుకు ఇటువంటి కంపెనీలను రద్దు చేశామని, మరిన్ని సంస్థలు ఈ జాబితాలో చేరనున్నాయని ఆయన వివరించారు.