షాపింగ్.. ఇప్పుడు వినోదం
• స్పార్ ఎండీ రాజీవ్ కృష్ణన్ కుటుంబసమేతంగా వస్తున్నారు...
• స్టోర్లలో అందుకు తగ్గ ఏర్పాట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : షాపింగ్ అంటే అవసరమున్న వస్తువులు.. అదీ సమయం దొరికినప్పుడు సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి కొనుక్కోవడం. ఇదంతా గతం. ఇప్పుడు వినియోగదార్ల ధోరణి మారింది. శని, ఆదివారాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడ్డం. కుటుంబ సభ్యులతో కలిసి సూపర్/హైపర్ మార్కెట్‌కు వెళ్లడం. మొత్తంగా షాపింగ్ అంటే కుటుంబ వినోదంగా మారిందని అంటున్నారు స్పార్ హైపర్‌మార్కెట్స్ ఇండియా ఎండీ రాజీవ్ కృష్ణన్. స్పార్ కస్టమర్లకు షాపింగ్ అనుభూతి కల్పించేందుకు కొత్త విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే ఔట్‌లెట్లు కళకళలాడుతున్నాయని అన్నారు. హైదరాబాద్ నాచారంలో స్పార్ 4వ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే..
ఆనందంగా గడపాలి..
టాప్ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించి కస్టమర్లను భాగస్వాములను చేస్తున్నాం. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లుంటాయి. భార్యలు షాపింగ్ చేస్తుంటే భర్తలకు వినోదం కల్పించేందుకు జనరల్ నాలెడ్జ్ పోటీలు నిర్వహించడం, ఇతర కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలని అనుకుంటున్నాం. ఔట్‌లెట్ నుంచి కస్టమర్లు ఆనందంగా వెళ్లాలన్నది మా అభిమతం. స్టోర్‌లో షాపింగ్ కోసం ఒక్కో కుటుంబం కనీసం గంటన్నర సమయం వెచ్చిస్తున్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు వస్తూనే ఉన్నాయి. నగరాలు, ప్రాంతాలనుబట్టి కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుంది. అందుకే వేటిని ఎక్కువగా వినియోగదార్లు ఆదరిస్తున్నారో బిగ్ డేటా ఆధారంగా పరిశీలిస్తాం. అటువంటి వాటినే అందుబాటులో ఉంచుతాం. స్టోర్‌లో డిస్‌ప్లే ఆకట్టుకునేలా ఉండేందుకు ప్రత్యేక సిబ్బంది నిరంతరం నిమగ్నమవుతారు.
భాగస్వాములూ ముఖ్యమే..
వేలాది మంది రైతులు, ఉత్పత్తుల తయారీదారులతో చేతులు కలిపాం. పండుగలకు ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇస్తున్నాం. నాణ్యత పెరిగేందుకు వారి నుంచే సలహాలు స్వీకరిస్తున్నాం. మా విధానం మార్పుకోవడానికి ఇది దోహదం చేస్తోంది. భాగస్వాములతో బంధం గట్టిపడితేనే కంపెనీతోపాటూ వారూ వృద్ధి చెందుతారు. రిటైల్ రంగంలో కొన్ని మాకంటే పెద్ద కంపెనీలే కావొచ్చు. కానీ భాగస్వాములు, కస్టమర్లను అర్థం చేసుకోవడం ద్వారా వృద్ధి బాటలో పయనిస్తున్నాం.
చిన్న వ్యాపారులకూ వేదిక..
పెద్ద కంపెనీలే కాదు సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలూ వాటి సొంత బ్రాండ్లతో పోటీపడుతున్నాయి. ఇందుకు సూపర్/హైపర్ మార్కెట్లు వేదిక అవుతున్నాయి. నాణ్యమైన ఉత్పాదన తయారు చేస్తే చాలు మేం విక్రయిస్తాం. అందుకు తగ్గట్టుగా అమ్మకాల పరంగా ప్రోత్సహిస్తున్నాం. మా సిబ్బంది ఉత్పాదన విశిష్టతలను కస్టమర్లకు వివరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో దొరికే ప్రముఖ ఉత్పత్తులను అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంచుతున్నాం. ఇక ప్రైవేటు లేబుల్ విభాగంలోనూ తయారీ సంస్థలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాం. మా అమ్మకాల్లో ప్రైవేట్ లేబుల్ వాటా 10-15% ఉంటుంది.
క్యూ లైన్లకు చెల్లు..
కస్టమర్ల సౌకర్యార్థం బెంగళూరులో ఇటీవలే ఆన్‌లైన్ సౌకర్యాన్ని ప్రారంభించాం. డిసెంబరుకల్లా మిగిలిన 8 నగరాల్లోని స్టోర్లకూ ఆన్‌లైన్‌ను విస్తరిస్తాం. ఆలస్యం కాకుండా క్యూ లైన్లలో ఉన్న కస్టమర్ల వద్దకే సిబ్బంది వెళ్లి బిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. బెంగళూరులోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. మార్చికల్లా ఇతర ఔట్‌లెట్లలో పరిచయం చేస్తాం. కియోస్క్‌లను ఏర్పాటు చేసి వర్చువల్ రియాలిటీ విధానంలో కస్టమర్లకు చేరువ కానున్నాం. టెక్నాలజీ కోసం టాప్ కంపెనీలతో చేతులు కలిపాం. భారత రిటైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 18 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నాం. ఈ సంఖ్యను పెంచేందుకు పరుగెత్తం. ప్రణాళిక ప్రకారం దశలవారీగా ఇతర నగరాల్లో విస్తరిస్తాం.
సామాన్లు మోసి..
సూపర్ మార్కెట్లో చిన్న ఉద్యోగిగా అమెరికాలో రాజీవ్ కృష్ణన్ కెరీర్ ప్రారంభించారు. విధుల్లో భాగంగా దుకాణంలో సరుకులనూ మోశారు. వాల్‌మార్ట్, టార్గెట్, మెకిన్సీ, భారతీ రిటైల్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేశారు. 21 ఏళ్లు యూఎస్‌లో, 9 ఏళ్లు భారత్‌లో పనిచేసిన అనుభవం ఉంది. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. 2016 ఆగస్టులో ప్రస్తుత బాధ్యతలు స్వీకరించారు.