ఐటీ హార్డ్ వేర్ తో 4 లక్షల ఉద్యోగాలు..!
ప్రభుత్వం పన్ను సుంకాలను తగ్గించాలి: ఎంఏఐటీ
న్యూఢిల్లీ: దేశీ ఐటీ హార్డ్‌వేర్ రంగం ఉపాధి కొలువుగా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో నోట్‌బుక్, డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు సహా తదితర వస్తువుల తయారీకి చేయూతనందించేలా పన్ను సుంకాలను తగ్గిస్తే.. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య ‘మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎంఏఐటీ) తన నివేదికలో పేర్కొంది. ఎంఏఐటీలో చిప్ తయారీ సంస్థ ఇంటెల్, పీసీ తయారీ కంపెనీ లెనొవొ, ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ వంటి తదితర కంపెనీలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల ఉద్యోగాల్లో.. లక్ష ఉద్యోగాలు ప్రత్యక్ష ఉపాధికి సంబంధించినవి అయితే మిగిలిన 3 లక్షల ఉద్యోగాలు విడిభాగాల తయారీకి చెందినవని ఎంఏఐటీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అన్వర్ శిర్పూర్‌వాలా తెలిపారు. పాలసీ సంస్కరణలు సహా మార్కెట్ సంబంధిత అడ్డంకులను తొలగిస్తే ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి ఏడాది కాలంలో రెట్టింపు వృద్ధితో 2.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పారు.