ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలగిన ముకేశ్
దిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు వైదొలిగారు. వాణిజ్య, వ్యాపార ప్రకటనల వ్యాపారాధిపతి ముకేశ్ బన్సల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నా ముకేశ్ సలహాదారుగా కొనసాగుతారని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. సీఈవోగా బిన్నీ బన్సాల్ నియమితులైన తర్వాత ముకేశ్ వైదొలగడం గమనార్హం. 2014లో మింత్రాను కోనుగోలు చేయడంతో ముకేశ్... ఫ్లిప్‌కార్ట్ లో చేరారు.
తన కుటుంబంతో గడపడం కోసమే ముకేశ్ ఈ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని వెల్లడించింది. ముకేశ్ ఇప్పటిదాకా నిర్వహించిన బాధ్యతలను ఇకనుంచి ఫ్లిప్‌కార్ట్ సీఈవో బిన్నీ బన్సాల్ చూసుకుంటారు. క్రీడల విభాగంలో వ్యాపార సంస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఫ్లిప్‌కార్ట్ నుంచి అంకిత్ వెలుపలికి వచ్చారు. ఆయన పెట్టబోయే కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకులైన సచిన్, బిన్నీ బన్సాల్ పెట్టుబడులు పెట్టనుండడం విశేషం.