మింత్రా.. ప్లిప్‌కార్ట్ పరం
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ రంగంలో సంచలనానికి తెరతీస్తూ... అతిపెద్ద కొనుగోలు డీల్ సాకారమైంది. ఈ రంగంలో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్... ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ మింత్రాను చేజిక్కించుకుంది. మింత్రాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ గురువారం ప్రకటించింది. ఇరు కంపెనీలు డీల్ విలువ వివరాలను వెల్లడించనప్పటికీ... దాదాపు 33 కోట్ల డాలర్లు(సుమారు రూ.2,000 కోట్లు)గా ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, తాజా డీల్‌లో దేశంలోని మొత్తం ఈ-కామర్స్ మార్కెట్‌లో విక్రయాల పరంగా సుమారు సగం వాటా ఫ్లిప్‌కార్ట్ పరం కానుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. ‘మింత్రాను కొనుగోలు చేయడం ద్వారా ఈ-కామర్స్‌లోని అన్నివిభాగాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకోవడానికి దోహదం చేయనుంది. సమీపకాలంలోనే ఫ్యాషన్ రిటైలింగ్ వ్యాపారంలో 10 కోట్ల డాలర్ల(సుమారు రూ.600 కోట్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నాం. ఇరు కంపెనీలు కలిగి దేశీ ఈ-కామర్స్ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నాయి’ అని ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు, సీఈఓ సచిన్ బన్సల్ వ్యాఖ్యానించారు.
మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయని చెప్పారు. మరోపక్క, మింత్రా సహవ్యవస్థాపకుడు, సీఈఓ ముకేశ్ బన్సల్.. ఫ్లిప్‌కార్ట్ డెరైక్టర్ల బోర్డులో చేరనున్నారు. ఇరు సంస్థల ఫ్యాషన్ బిజినెస్‌ను ఆయన నడిపించనున్నారు. తాజా పరిణామంతో ఫ్లిప్‌కార్ట్ తన అపారెల్(దుస్తుల విభాగం) పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకోవడంతోపాటు అమెజాన్, ఈబే, స్నాప్‌డీల్ వంటి ఇతర దిగ్గజాలతో పోటీలో దూసుకెళ్లేందుకు దోహదం చేయనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గడచిన కొన్నేళ్లుగా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం, యువత ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గుచూపుతుండటంతో దేశంలో ఈ-కామర్స్ రంగం భారీ వృద్ధినే సాధించింది. చాలావరకూ ఈ-కామర్స్ కొనుగోళ్లలో అపారెల్, ఎలక్ట్రానిక్స్‌దే అత్యధిక వాటా ఉంటోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,000 కోట్లు)గా అంచనా. ఇది 2018 నాటికి ఏడింతలకు పైగా ఎగబాకి 22 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.
ఇక ఫ్లిప్‌కార్ట్ వార్షిక ఆదాయం గతేడాది బిలియన్ డాలర్ల(సుమారు రూ.6,000 కోట్లు)ను అధిగమించింది. 2015 కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ నిర్దేశించుకోగా అంతకంటే ముందే సాకారం కావడం గమనార్హం. 2007లో ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా కార్యకలాపాలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, గృహోపకరణాలు ఇలా దాదాపు అన్ని విభాగాల్లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇక మింత్రా ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్న ఫ్యాషన్ ఉత్పత్తుల్లో 650కి పైగా బ్రాండ్‌లు ఉన్నాయి.