
మెక్‌డొనాల్డ్స్‌కి ఎన్‌సీఎల్‌టీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: ఆదేశాల ధిక్కరణ వ్యవహారానికి సంబంధించి ఫాస్ట్‌ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌తో పాటు దాని భారత విభాగానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటికి సెప్టెంబర్ 20లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్‌లో మెక్‌డొనాల్డ్స్ మాజీ భాగస్వామి విక్రమ్ బక్షి ఈ పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు, జాయింట్ వెంచర్ సంస్థ కనాట్ ప్లాజా రెస్టారెంట్ (సీపీఆర్‌ఎల్) నిర్వహిస్తున్న 169 అవుట్‌లెట్లకు ఫ్రాంచైజీ లైసెన్సును మెక్‌డొనాల్డ్స్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ బక్షీ వేసిన పిటీషన్‌ను ట్రిబ్యునల్ కొట్టివేసింది.
సీపీఆర్‌ఎల్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదని, అలాగే సీపీఆర్‌ఎల్ ఎండీగా బక్షీని పునర్నియమించాలని ఎన్‌సీఎల్‌టీ జులై 13న ఇచ్చిన ఆదేశాలను మెక్‌డొనాల్డ్స్ ధిక్కరించిందని, లైసెన్సులు రద్దు చేసిందని తాజాగా బక్షీ ఆరోపించారు. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలపై తాము నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించరాదంటూ మెక్‌డొనాల్డ్స్, భారత్‌లో దాని అనుబంధ సంస్థ వాదించాయి.
కానీ, ఈ వాదనలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. సెప్టెంబర్ 20లోగా షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక, ఫ్రాంచైజీ లైసెన్సుల రద్దు అంశంపై దాఖలైన అప్పీలు ఇంకా ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద పెండింగ్‌లో ఉన్నందున.. దీనిపై బక్షీ దాఖలు చేసిన పిటీషన్‌ను ప్రస్తుత దశలో విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని పేర్కొంది. తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ చెయిన్‌ను సీపీఆర్‌ఎల్ నిర్వహిస్తోంది. అయితే, నిర్వహణపరమైన విభేదాల కారణంగా ఆగస్టు 2013లో బక్షీని ఎండీ హోదా నుంచి తప్పించినప్పటి నుంచీ ఇరు సంస్థల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవలే ఫ్రాంచైజీ లైసెన్సులను కూడా మెక్‌డొనాల్డ్స్ ఇండియా రద్దు చేసింది.