గంప లాభం చిల్లి తీసిందని సామెత. దాదాపు మూడేళ్లపాటు అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇప్పుడిప్పుడే ఒక దారికి వస్తున్నాయి. అయితే అలాంటి కంపెనీల లాభాలను వడ్డీ చెల్లింపులు హరించేస్తున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... స్టాక్ మార్కెట్లో లిస్టైన టాప్ కంపెనీల (ఆర్థిక, ఆయిల్, గ్యాస్ కంపెనీలు మినహా) వడ్డీ చెల్లింపులు 15 శాతం మేర పెరిగాయి. స్టాక్‌మార్కెట్లో లిస్టయిన 1,202 కంపెనీల ఆరు నెలల ఆర్థిక ఫలితాలను విశ్లేషిస్తే వెల్లడయిన వాస్తవమిది. అయితే ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, గ్యాస్, చమురు కంపెనీలు మాత్రం లేవనుకోండి. ఇంకా ఈ విశ్లేషణలో ఏం తేలిందంటే..
వడ్డీ భారం భరించలేనంత...
నికర అమ్మకాలు, నిర్వహణ లాభాల కంటే వడ్డీ చెల్లింపులే జోరుగా పెరిగాయి. గత మూడున్నరేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీ వ్యయాలు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు క్వార్టర్లలో కంపెనీల నిర్వహణ లాభం (ఎబిటా) 6 శాతం తగ్గింది. గత మూడున్నరేళ్ల కాలంలో ఇదే అత్యంత అధ్వాన్న పరిస్థితి. ఇదే కాలంలో నికర అమ్మకాలు మాత్రం 11 శాతం పెరిగాయి. ఇక సీక్వెన్షియల్‌గా చూసినా నికర అమ్మకాలు పుంజుకున్నాయి.
లాభాలు ఆవిరి...
నిర్వహణ లాభంలో పెద్దగా మెరుగుదల లేకపోవడం, వడ్డీ వ్యయాలు పెరగడంతో కంపెనీల నికర లాభాలు తగ్గాయి. కంపెనీల నికర లాభం (అసాధారణ లాభాలు, నష్టాలను మినహాయించుకొని) గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో 3.5 శాతం తగ్గిపోయింది. మూడున్నరేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత ఘోరమైన పనితీరు. అసాధారణ లాభాలను మినహాయిస్తే. నికర లాభం 24 శాతం తగ్గింది. గత ఏడాది కాలంలో నిధుల కొరత సమస్య తీవ్రంగా ఉంది. అంతే కాకుండా వడ్డీరేట్లు పెరిగాయి. మరోవైపు కంపెనీల రుణాలు కూడా పెరిగాయి. ఈ కారణాల వల్ల నికర లాభం కుదేలైంది.
పాత వాటికితోడు కొత్త రుణాలు...
డిమాండ్ తగ్గడంతో వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల వద్ద నిల్వలు పెరిగిపోయాయి. దీంతో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగిపోయాయి. ఫలితంగా కంపెనీలు రుణాలు తీసుకోవడం కూడా పెరిగింది. పాత రుణాలు, కొత్త రుణాలు కలిసి మొత్తంమీద వడ్డీ వ్యయాలు తడిసిమోపెడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో కంపెనీల రుణాలు 13% పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల రుణాలు 3.3% మేర తగ్గాయి. ఈ కంపెనీలు మొత్తం రుణభారం రూ.11.2 లక్షల కోట్ల నుంచి రూ.12,7 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీల తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి. సగటు వడ్డీరేటు 8.85% నుంచి 9.01%కి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోని వడ్డీరేట్లతో పోల్చితే తర్వాతి రెండు క్వార్టర్లలో వడ్డీ రేట్లు 24 బేసిస్ పాయింట్లు తగ్గడం కొంత ఊరటనిచ్చే విషయం.
పేరుకుపోతున్న నిల్వలు
ఇన్వెంటరీ పలు రంగాల్లో అధికంగా పేరుకుపోయింది. ముఖ్యంగా వాహన, నిర్మాణ మౌలిక రంగాల్లో నిల్వలు బాగా పెరిగిపోయాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వాహన కంపెనీల వల్ల నిల్వలు పెరిగాయి. విద్యుత్, మౌలిక రంగ కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావలసిన చెల్లింపుల్లో జాప్యం నెలకొనటం కూడా ప్రభావం చూపించింది. రెండోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వినియోగం పెంచే చర్యలు తీసుకుంటుందని, సంస్కరణలను మరింత ముందుకు తీసుకుపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు సాకారమైతే, అమ్మకాలు పుంజుకొని కంపెనీల నిర్వహణ లాభం మెరుగుపడుతుందని, అంతకంతకూ పెరిగిపోతున్న వడ్డీ వ్యయాల నుంచి ఉపశమనం లభించగలదని కంపెనీలు ఆశిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment