working capital
-
కార్పొరేట్ రుణాలకు డిమాండ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో నిర్వహణ మూలధనానికి గణనీయంగా డిమాండ్ నెలకొందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. దాదాపు రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో కార్పొరేట్ల దగ్గర మిగులు నిధులు పుష్కలంగా ఉండేవని కానీ ప్రస్తుతం తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సామర్థ్యాల విస్తరణకు కావాల్సిన నిధులను రుణంగా తీసుకునేందుకు అవి బ్యాంకులను సంప్రదిస్తున్నాయని ఖారా వివరించారు. మరోవైపు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఏడాది రిటైల్ వ్యవసాయం, చిన్న .. మధ్యతరహా సంస్థలకు (ఆర్ఏఎం) రుణాలు 16 శాతం పెరగవచ్చని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగ రుణాలు 16 శాతం వృద్ధి రేటుతో రూ. 21 లక్షల కోట్లకు చేరాయి. ఆర్ఏఎం రుణాలిచ్చేటప్పుడు రిసు్కలను మదింపు చేసేందుకు చాలా కఠినతరమైన ప్రక్రియను పాటిస్తామని, వడ్డీ రేట్ల పరిస్థితులు, రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లించే అవకాశాలు మొదలైనవన్నీ పరిశీలిస్తామని ఖారా చెప్పారు. కఠినతరమైన ప్రమాణాల కారణంగా తమకు ఈ విభాగంలో ఎలాంటి సవాళ్లు లేవని వివరించారు. -
వైజాగ్ స్టీల్ వినూత్న ప్రతిపాదన..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (ఆర్ఐఎన్ఎల్ – వైజాగ్ స్టీల్) నిధుల సమీకరణ కోసం మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమకు నిర్వహణ మూలధనం లేదా ముడి సరుకును సమకూర్చే కంపెనీలకు ప్రతిగా ఫినిష్డ్ ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసే వినూత్న ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చింది. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) దీనికి సుముఖంగా ఉన్న ఉక్కు, ఉక్కు సంబంధ ముడి వస్తువుల వ్యాపారం చేసే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాలని ఆహ్వానించింది. కోకింగ్ కోల్, ఇనుప ఖనిజం మొదలైన వాటిని సరఫరా చేయడం లేదా నిర్వహణ మూలధనం సమకూర్చడం ద్వారా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావచ్చని ఒక నోటీసులో ఆర్ఐఎన్ఎల్ తెలిపింది. దానికి బదులుగా పరస్పరం ఆమోదయోగ్యమైన నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను పొందవచ్చని వివరించింది. ఈవోఐల దాఖలుకు ఏప్రిల్ 15 ఆఖరు తేదీ. -
రుణ భారం, ఆదాయం రెండూ అప్
ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది. ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది. 18 సంస్థలపై.. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది. హెచ్ఏఎంలో.. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్హెచ్ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్‌చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
గంప లాభం చిల్లి తీసిందని..
గంప లాభం చిల్లి తీసిందని సామెత. దాదాపు మూడేళ్లపాటు అంతంతమాత్రంగా ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇప్పుడిప్పుడే ఒక దారికి వస్తున్నాయి. అయితే అలాంటి కంపెనీల లాభాలను వడ్డీ చెల్లింపులు హరించేస్తున్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే... స్టాక్ మార్కెట్లో లిస్టైన టాప్ కంపెనీల (ఆర్థిక, ఆయిల్, గ్యాస్ కంపెనీలు మినహా) వడ్డీ చెల్లింపులు 15 శాతం మేర పెరిగాయి. స్టాక్మార్కెట్లో లిస్టయిన 1,202 కంపెనీల ఆరు నెలల ఆర్థిక ఫలితాలను విశ్లేషిస్తే వెల్లడయిన వాస్తవమిది. అయితే ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, గ్యాస్, చమురు కంపెనీలు మాత్రం లేవనుకోండి. ఇంకా ఈ విశ్లేషణలో ఏం తేలిందంటే.. వడ్డీ భారం భరించలేనంత... నికర అమ్మకాలు, నిర్వహణ లాభాల కంటే వడ్డీ చెల్లింపులే జోరుగా పెరిగాయి. గత మూడున్నరేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వడ్డీ వ్యయాలు ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు క్వార్టర్లలో కంపెనీల నిర్వహణ లాభం (ఎబిటా) 6 శాతం తగ్గింది. గత మూడున్నరేళ్ల కాలంలో ఇదే అత్యంత అధ్వాన్న పరిస్థితి. ఇదే కాలంలో నికర అమ్మకాలు మాత్రం 11 శాతం పెరిగాయి. ఇక సీక్వెన్షియల్‌గా చూసినా నికర అమ్మకాలు పుంజుకున్నాయి. లాభాలు ఆవిరి... నిర్వహణ లాభంలో పెద్దగా మెరుగుదల లేకపోవడం, వడ్డీ వ్యయాలు పెరగడంతో కంపెనీల నికర లాభాలు తగ్గాయి. కంపెనీల నికర లాభం (అసాధారణ లాభాలు, నష్టాలను మినహాయించుకొని) గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో 3.5 శాతం తగ్గిపోయింది. మూడున్నరేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత ఘోరమైన పనితీరు. అసాధారణ లాభాలను మినహాయిస్తే. నికర లాభం 24 శాతం తగ్గింది. గత ఏడాది కాలంలో నిధుల కొరత సమస్య తీవ్రంగా ఉంది. అంతే కాకుండా వడ్డీరేట్లు పెరిగాయి. మరోవైపు కంపెనీల రుణాలు కూడా పెరిగాయి. ఈ కారణాల వల్ల నికర లాభం కుదేలైంది. పాత వాటికితోడు కొత్త రుణాలు... డిమాండ్ తగ్గడంతో వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల వద్ద నిల్వలు పెరిగిపోయాయి. దీంతో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగిపోయాయి. ఫలితంగా కంపెనీలు రుణాలు తీసుకోవడం కూడా పెరిగింది. పాత రుణాలు, కొత్త రుణాలు కలిసి మొత్తంమీద వడ్డీ వ్యయాలు తడిసిమోపెడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో కంపెనీల రుణాలు 13% పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల రుణాలు 3.3% మేర తగ్గాయి. ఈ కంపెనీలు మొత్తం రుణభారం రూ.11.2 లక్షల కోట్ల నుంచి రూ.12,7 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీల తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి. సగటు వడ్డీరేటు 8.85% నుంచి 9.01%కి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోని వడ్డీరేట్లతో పోల్చితే తర్వాతి రెండు క్వార్టర్లలో వడ్డీ రేట్లు 24 బేసిస్ పాయింట్లు తగ్గడం కొంత ఊరటనిచ్చే విషయం. పేరుకుపోతున్న నిల్వలు ఇన్వెంటరీ పలు రంగాల్లో అధికంగా పేరుకుపోయింది. ముఖ్యంగా వాహన, నిర్మాణ మౌలిక రంగాల్లో నిల్వలు బాగా పెరిగిపోయాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వాహన కంపెనీల వల్ల నిల్వలు పెరిగాయి. విద్యుత్, మౌలిక రంగ కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావలసిన చెల్లింపుల్లో జాప్యం నెలకొనటం కూడా ప్రభావం చూపించింది. రెండోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం వినియోగం పెంచే చర్యలు తీసుకుంటుందని, సంస్కరణలను మరింత ముందుకు తీసుకుపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు సాకారమైతే, అమ్మకాలు పుంజుకొని కంపెనీల నిర్వహణ లాభం మెరుగుపడుతుందని, అంతకంతకూ పెరిగిపోతున్న వడ్డీ వ్యయాల నుంచి ఉపశమనం లభించగలదని కంపెనీలు ఆశిస్తున్నాయి. -
డేటావిండ్‌కు కొత్త కష్టాలు
♦ కొన్ని నెలలుగా భారీగా తగ్గిన ఆర్డర్లు ♦ హైదరాబాద్ ప్లాంటులో పడిపోయిన ఉత్పత్తి ♦ కంపెనీని వీడిన వందలాది కార్మికులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చవక ట్యాబ్లెట్ పీసీల తయారీలో ఉన్న డేటావిండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అమ్మకాలు లేకపోవడంతో హైదరాబాద్ ఫెసిలిటీలో ఉత్పత్తిని సగానికి తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తయారీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. తాజా పరిస్థితులతో కంపెనీ పెద్ద ఎత్తున కార్మికులకు ఉద్వాసన పలికింది. హైదరాబాద్‌కు విడిభాగాలు రావాల్సి ఉందని, వాటి కోసం చూస్తున్నామని, అమృత్సర్ ప్లాంటులో యధావిధిగా ఉత్పత్తి కొనసాగుతోందని కంపెనీ వెల్లడించింది. అయితే ఆర్డర్లు లేక కంపెనీ సమస్యల్లో చిక్కుకుందని, ఆరు నెలల కిందటి నుంచే హైదరాబాద్ ప్లాంటు కార్మికులు ఒక్కొక్కరుగా కంపెనీని వీడుతున్నారని తెలియవచ్చింది. గత రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి స్వయంగా వెల్లడించారు. వర్కింగ్ క్యాపిటల్పైనా దీని ప్రభావం ఉందన్నారు. అయితే ఉద్వాసనకు గురైన 200 మందికిపైగా కార్మికులు తెలంగాణ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆర్.చంద్రశేఖరంను కలిసి న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతానని కమిషనర్ వారికి తెలిపారు. మరోవంక డేటావిండ్ మాత్రం ‘‘ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా శంషాబాద్ ప్లాంటు స్థలాన్ని ఖాళీ చేయాలని జీఎంఆర్ యాజమాన్యం మమ్మల్ని కోరింది. దీంతో ప్లాంటును సికింద్రాబాద్‌కు మార్చాలనుకుని, ఆ విషయాన్ని కార్మికులకు చెప్పాం. కార్మికుల్లో అత్యధికులు శంషాబాద్ చుట్టుపక్కల వారు కావటంతో మారటం ఇష్టం లేక విధ్వంసం సృష్టించారు. వారిని తొలగించాం. వారే సమస్యను సృష్టించారు’’ అని వివరించింది. కాగా ఒకదశలో 400 మంది వరకు పనిచేసిన ఈ ప్లాంటులో ప్రస్తుతం 15 మందిలోపే ఉన్నారు. -
కొత్త ఏడాదిలో ఐపీఓల జోరు..!
రూ. 8,000 కోట్ల విలువైన పబ్లిక్ ఆఫర్లకు కంపెనీల క్యూ. న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో దేశీ కంపెనీల పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు జోరందుకోనున్నాయి. 2015లో కనీసం రూ.8,000 కోట్ల విలువైన ఐపీఓలు వరుసలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ ఇతరత్రా అవసరాల కోసం నిధుల సమీకరణకు ఇదే అదనుగా కంపెనీలు భావిస్తున్నాయి. రానున్న నెలల్లో పబ్లిక్ ఆఫర్ల బాట పట్టనున్న కంపెనీలో వీడియోకాన్ డీ2హెచ్, లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్టైన్మెంట్, వైజాగ్ స్టీల్, ఎంఈపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి లభించిన ఏడు కంపెనీలు రూ.2,965 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా చెప్పారు. మరో 12 కంపెనీలు రూ.5,362 కోట్ల సమీకరణ కోసం సెబీ ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు సంస్కరణల జోరు కారణంగా మార్కెట్లు పరుగులు పెడుతుండటం ఐపీఓ మార్కెట్లో ఈ ఏడాది జోష్ నింపనుందని జియోజిత్ బీఎన్పీ పారిబా రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూ అభిప్రాయపడ్డారు. గతేడాది(2014)తో పోలిస్తే ఈ సంవత్సరం ఐపీఓల నిధుల సమీకరణ మొత్తం భారీగా పెరగనుందని చెప్పారు. 2014లో పబ్లిక్ ఆఫర్ల ద్వారా కంపెనీలు సమకరించిన మొ త్తం కేవలం రూ.1,528 కోట్లే(2012లో రూ.1,619 కోట్లు) కావడం గమనార్హం. ఈ జనవరి-మార్చి మధ్య ఐపీఓలు అధికంగా రావచ్చని హాల్దియా పేర్కొన్నారు. కాగా, ఎలక్ట్రానిక్ ఐపీఓ(ఈ-ఐపీఓ)లకు సంబంధించి త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలను జారీ చేయవచ్చని.. ఇది మార్కెట్‌కు మరింత ఊతమిస్తుందనేది నిపుణుల అభిప్రాయం.