కొత్త ఏడాదిలో ఐపీఓల జోరు..!
రూ. 8,000 కోట్ల విలువైన పబ్లిక్ ఆఫర్లకు కంపెనీల క్యూ.
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో దేశీ కంపెనీల పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)లు జోరందుకోనున్నాయి. 2015లో కనీసం రూ.8,000 కోట్ల విలువైన ఐపీఓలు వరుసలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ ఇతరత్రా అవసరాల కోసం నిధుల సమీకరణకు ఇదే అదనుగా కంపెనీలు భావిస్తున్నాయి.
రానున్న నెలల్లో పబ్లిక్ ఆఫర్ల బాట పట్టనున్న కంపెనీలో వీడియోకాన్ డీ2హెచ్, లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వైజాగ్ స్టీల్, ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే సెబీ అనుమతి లభించిన ఏడు కంపెనీలు రూ.2,965 కోట్ల సమీకరణకు సిద్ధమవుతున్నాయని ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా చెప్పారు. మరో 12 కంపెనీలు రూ.5,362 కోట్ల సమీకరణ కోసం సెబీ ఆమోదం కోసం వేచిచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు సంస్కరణల జోరు కారణంగా మార్కెట్లు పరుగులు పెడుతుండటం ఐపీఓ మార్కెట్లో ఈ ఏడాది జోష్ నింపనుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూ అభిప్రాయపడ్డారు. గతేడాది(2014)తో పోలిస్తే ఈ సంవత్సరం ఐపీఓల నిధుల సమీకరణ మొత్తం భారీగా పెరగనుందని చెప్పారు. 2014లో పబ్లిక్ ఆఫర్ల ద్వారా కంపెనీలు సమకరించిన మొ త్తం కేవలం రూ.1,528 కోట్లే(2012లో రూ.1,619 కోట్లు) కావడం గమనార్హం.
ఈ జనవరి-మార్చి మధ్య ఐపీఓలు అధికంగా రావచ్చని హాల్దియా పేర్కొన్నారు. కాగా, ఎలక్ట్రానిక్ ఐపీఓ(ఈ-ఐపీఓ)లకు సంబంధించి త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త నిబంధనలను జారీ చేయవచ్చని.. ఇది మార్కెట్‌కు మరింత ఊతమిస్తుందనేది నిపుణుల అభిప్రాయం.