ముంబై: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుగుణమైన ఈక్విటీ కమిట్‌మెంట్స్, పెరుగుతున్న వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు రహదారుల అభివృద్ధి కంపెనీల రుణ భారాన్ని పెంచనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే ఇదే సమయంలో ఆయా కంపెనీల ఆదాయం సైతం పురోభివృద్ధి చెందనున్నట్లు తెలియజేసింది.
ఇందుకు భారీ కాంట్రాక్టులు, పటిష్ట ఎగ్జిక్యూషన్ దోహదపడనున్నట్లు వచ్చే ఏడాది అంచనాలపై నివేదిక వివరించింది. తక్కువ రుణ భారమున్న కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది ఆయా కంపెనీల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ స్థిరత్వానికి సహకరిస్తుందని పేర్కొంది. రుణ భారానికి చెక్ పెట్టేందుకు ఆస్తుల మానిటైజేషన్ కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడింది.
18 సంస్థలపై..
ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) కాంట్రాక్టులు చేపట్టే 18 కంపెనీలను నివేదికలో పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. ఈ రంగం మొత్తం ఆదాయంలో వీటి వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2025కల్లా మొత్తం రూ. 21,000 కోట్ల ఈక్విటీ కమిట్‌మెంట్ ఉన్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలియజేశారు. రానున్న రెండేళ్లలో ఆదాయం 10–15 శాతం స్థాయిలో వృద్ధి చెందే వీలుండగా.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు సైతం పెరగనున్నట్లు నివేదిక అంచనా వేసింది. వీటికి 45 శాతం నిధులు ఆర్జన ద్వారా లభించనున్నప్పటికీ ఆస్తుల మానిటైజేషన్, రుణాల ద్వారా మిగిలిన పెట్టుబడులను సమకూర్చుకోవలసి ఉంటుందని విశ్లేషించింది. 2022కల్లా నమోదైన రూ. 17,000 కోట్ల నుంచి 2025 మార్చికల్లా రుణ భారం రూ. 30,000 కోట్లకు చేరనున్నట్లు అభిప్రాయపడింది.
హెచ్‌ఏఎంలో..
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్‌ఏఎం) మార్గంలో ప్రకటించిన ప్రాజెక్టులలో అత్యధిక శాతం జాతీయ రహదారి అభివృద్ధి(ఎన్‌హెచ్‌ఏ) సంస్థ జారీ చేసినవే. వీటికి సంబంధించి 12–15% ప్రాజెక్ట్ వ్యయాలకు నిధులను ఈక్వి టీ రూపేణా సమకూర్చవలసి ఉంటుంది. వీటికి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు జత కలుస్తాయి. మధ్యకాలానికి ఇవి ఆదాయాలతోపాటు పెరిగే అవకాశముంది. ఈ రంగంలోని కంపెనీల ఆర్డర్ బుక్ మూడు రెట్లు జంప్‌చేయడం ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు రెండు, మూడేళ్లుగా భారీ స్థాయిలో జారీ చేసిన కాంట్రాక్టుల లాభదాయకతపై ప్రతికూల ప్రభా వం పడే అవకాశముంది. గతంలో నమోదైన 14–15% నుంచి లాభదాయకత వచ్చే రెండేళ్ల లో 12–13 శాతానికి పరిమితం కావచ్చు. వెరసి లాభాల మార్జిన్లు 1.5% మేర నీరసించవచ్చు. ఇందుకు ముడివ్యయాలు కారణంకానున్నాయి. అంతర్గత వనరులకుతోడు రోడ్ కాంట్రాక్టర్లు నిధుల సమీకరణకు ఆస్తుల మానిటైజేషన్, ఈక్విటీ జారీ, రుణాలు తదితరాలపై ఆధారపడవలసి ఉంటుందని క్రిసి ల్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలియజేశారు. అయితే తక్కువ రుణ భారమున్న కంపెనీలకు క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌పై ప్రభావం పడకుండానే పెట్టుబడుల సమీకరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment