డేటావిండ్‌కు కొత్త కష్టాలు
♦ కొన్ని నెలలుగా భారీగా తగ్గిన ఆర్డర్లు
♦ హైదరాబాద్ ప్లాంటులో పడిపోయిన ఉత్పత్తి
♦ కంపెనీని వీడిన వందలాది కార్మికులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చవక ట్యాబ్లెట్ పీసీల తయారీలో ఉన్న డేటావిండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అమ్మకాలు లేకపోవడంతో హైదరాబాద్ ఫెసిలిటీలో ఉత్పత్తిని సగానికి తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తయారీ అంతంత మాత్రంగానే జరుగుతోంది. తాజా పరిస్థితులతో కంపెనీ పెద్ద ఎత్తున కార్మికులకు ఉద్వాసన పలికింది. హైదరాబాద్‌కు విడిభాగాలు రావాల్సి ఉందని, వాటి కోసం చూస్తున్నామని, అమృత్‌సర్ ప్లాంటులో యధావిధిగా ఉత్పత్తి కొనసాగుతోందని కంపెనీ వెల్లడించింది.
అయితే ఆర్డర్లు లేక కంపెనీ సమస్యల్లో చిక్కుకుందని, ఆరు నెలల కిందటి నుంచే హైదరాబాద్ ప్లాంటు కార్మికులు ఒక్కొక్కరుగా కంపెనీని వీడుతున్నారని తెలియవచ్చింది. గత రెండు త్రైమాసికాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని డేటావిండ్ సీఈవో సునీత్ సింగ్ తులి స్వయంగా వెల్లడించారు. వర్కింగ్ క్యాపిటల్‌పైనా దీని ప్రభావం ఉందన్నారు. అయితే ఉద్వాసనకు గురైన 200 మందికిపైగా కార్మికులు తెలంగాణ కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆర్.చంద్రశేఖరంను కలిసి న్యాయం చేయాలంటూ వినతి పత్రం సమర్పించారు.
ఈ విషయమై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతానని కమిషనర్ వారికి తెలిపారు. మరోవంక డేటావిండ్ మాత్రం ‘‘ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా శంషాబాద్ ప్లాంటు స్థలాన్ని ఖాళీ చేయాలని జీఎంఆర్ యాజమాన్యం మమ్మల్ని కోరింది. దీంతో ప్లాంటును సికింద్రాబాద్‌కు మార్చాలనుకుని, ఆ విషయాన్ని కార్మికులకు చెప్పాం. కార్మికుల్లో అత్యధికులు శంషాబాద్ చుట్టుపక్కల వారు కావటంతో మారటం ఇష్టం లేక విధ్వంసం సృష్టించారు. వారిని తొలగించాం. వారే సమస్యను సృష్టించారు’’ అని వివరించింది. కాగా ఒకదశలో 400 మంది వరకు పనిచేసిన ఈ ప్లాంటులో ప్రస్తుతం 15 మందిలోపే ఉన్నారు.