జోరుగా పెట్టుబడులు..
♦ కొత్త గ్యాస్ విధానాలు ప్రయోజనకరం
♦ స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ వెల్లడి
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగంలో ప్రభుత్వ కొత్త విధానాలు పెట్టుబడులను ఆకర్షించేలా ఉన్నాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ పేర్కొంది. గ్యాస్ రంగంలో కొత్త ధరల విధానం, కష్టతరమైన క్షేత్రాల నుంచి వెలుపలికి తీసే గ్యాస్‌కు మార్కెటింగ్ స్వేచ్ఛనివ్వడం వంటి అంశాల కారణంగా భారత చమురు గ్యాస్ రంగంలో పెట్టుబడులు వస్తాయని ఈ సంస్థ వివరించింది. ప్రస్తుతమున్న లాభాలు పంచుకునే విధానాన్ని కాకుండా ఆదాయాన్ని పంచుకునే విధానంతో భవిష్యత్ వేలం ప్రక్రియను సరళీకరిస్తూ గత వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని చమురు అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలకు ఒకే ఒక లెసైన్స్ అవసరమయ్యేలా విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ కొత్త విధానాల నేపథ్యంలో స్టాండర్ట్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి...
♦ కొత్త విధానాలు ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌కు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే తగిన నగదు ప్రయోజనాలు అందడానికి కొన్నేళ్లు పడుతుంది.
♦ ఈ కొత్త విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. కానీ, కొంత సమయం పడుతుంది.
♦ పలు అన్వేషణ ప్రాజెక్టుల మూలధన కేటాయింపులకు ఆమోదాలు అవసరం. ఇవి కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి కార్యకలాపాలకు కనీసం మూడేళ్లు పడుతుంది.
♦ ప్రభుత్వంతో ఉన్న ధరల సంబంధిత వివాదాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపసంహరించుకుంటేనే ఆ కంపెనీకి మేలు. కొత్త ధరల విధానంతో ప్రయోజనం పొందాలంటే ఈ వివాదాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వస్తి చెప్పక తప్పదు.
♦ సాధారణ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరలు అంతంతమాత్రంగానే ఉండే అవకాశాలుండటంతో సాధారణ చమురు క్షేత్రాలపై పెట్టుబడులు మందగిస్తాయి.