లగ్జరీ షిప్‌లో మూడు ముళ్లు! | New start up trap card | Sakshi
Sakshi News home page

లగ్జరీ షిప్‌లో మూడు ముళ్లు!

Published Sat, Oct 28 2017 12:45 AM | Last Updated on Sat, Oct 28 2017 12:45 AM

New start up trap card

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో :  పెళ్లంటే... ఇంటి ముందు మండపంలోనో లేక ఫంక్షన్‌ హాల్‌లోనో కానిచ్చేయడం మనకు తెలుసు. కానీ, ఈ మధ్య కాలంలో క్రూయిజ్‌ (భారీ సముద్ర నౌక)లో, అది కూడా హంగూ ఆర్భాటాలతో... సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకునే సంప్రదాయం పెరుగుతోందండోయ్‌!!. మరి, క్రూయిజ్‌లో పెళ్లంటే మాటలు కాదు.

నౌకను బుక్‌ చేసుకోవడం నుంచి మొదలుపెడితే ప్రయాణ గమ్యస్థానం, పెళ్లి ఏర్పాట్లు, భోజన వసతులు.. ఇలా ప్రతిదీ పనే. దీన్నే వ్యాపారంగా మలుచుకుంది ట్రావ్‌కార్ట్‌.కామ్‌. దీనికోసం క్రూయిజ్‌ వెడ్డింగ్‌లో పేరు గాంచిన డ్రీమ్‌ క్రూయిజ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. మరిన్ని వివరాలు ట్రావ్‌కార్ట్‌ కో–ఫౌండర్‌ మన్హీర్‌ సింగ్‌ సేథి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

‘‘రెండు దశాబ్దాల కిందటే మా కుటుంబానికి సాహిబ్జీ ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ ఏజెన్సీ ఉంది. అందుకేనేమో!! చిన్నతనం నుంచే నాతో పాటు మా తమ్ముడు గుర్సాహిబ్‌ సింగ్‌ సేథికీ ట్రావెలింగ్‌ అంటే ఇష్టముండేది. చదువు పూర్తయ్యాక ఇద్దరం కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టాం.

తక్కువ కాలంలోనే వ్యాపారాన్ని మంచి స్థాయికి తెచ్చాం. అదే సమయంలో ఆన్‌లైన్‌ బూమ్‌ వచ్చింది. టూర్‌ మొత్తం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా వీలు కల్పిస్తే వేగంగా, సులువుగా కస్టమర్లను చేరుకోవచ్చనే ఆలోచనతో రూ.5 లక్షల పెట్టుబడితో 2016 డిసెంబర్‌లో ఢిల్లీ కేంద్రంగా ట్రావ్‌కార్ట్‌.కామ్‌ను ఆరంభించాం. బీ2బీ, బీ2సీ కస్టమర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండింట్లోనూ ప్రయాణ సేవలందించడం మా ప్రత్యేకత.

58 దేశాలు, 3,500 ప్యాకేజీలు..
థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజ్‌లాండ్, అమెరికా, యూరప్‌ వంటి 58 దేశాల్లో ఫ్యామిలీ హాలీడే, హనీమూన్, క్రూయిజ్, థీమ్‌ హాలిడేస్, డే ట్రిప్స్, వీకెండ్‌ గేట్‌వే ఇలా సుమారు 3,500 రకాల ప్యాకేజీలున్నాయి. రూ.1,500 నుంచి రూ.10 లక్షల వరకు ధరలున్నాయి.

క్రూయిజ్‌ వెడ్డింగ్‌ కోసం ఒక రాత్రికి ఒక్కరికి రూ.9 వేలు ఖర్చవుతుంది. గోవా, హువాహిన్, పుకెట్, కౌలాలంపూర్‌ గమ్యస్థానాల్లో క్రూయిజ్‌ వెడ్డింగ్‌ చేసుకునే వీలుంది. కస్టమర్లు అక్కడ సొంతంగా కారులో విహరించేందుకు కారు కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్‌ రెంటల్‌ కంపెనీ ఎవీస్‌తో ఒప్పందం చేసుకున్నాం.

ట్రావెల్‌ ఏజంట్లకూ ఫ్రాంచైజీ..
బీ2బీలో 8 వేలకు పైగా ట్రావెల్‌ ఏజెంట్లు, బీ2సీలో 3 వేలకు పైగా కస్టమర్లున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది ట్రావెల్‌ ఏజెంట్లున్నారు. సుమారు 3 వేల హోటళ్లు, 20కి పైగా విమానయాన సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ట్రావెల్‌ ఏంజెట్లకు బ్రాండింగ్, ప్రమోషన్, ప్రచారంతో పాటూ కస్టమర్లనూ అందించడం కోసం ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఈ డిసెంబర్‌ నాటికి 20 ఫ్రాంచైజీలు, 2020 నాటికి 100 ఫ్రాంచైజీలు లకి‡్ష్యంచాం.


నెలకు కోటి వ్యాపారం..
ప్రస్తుతం నెలకు 70 వరకు ఆర్డర్లు, కోటి రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఎక్కువగా ఫ్యామిలీ, హనీమూన్‌ ప్యాకేజ్‌లు బుక్‌ అవుతున్నాయి. మా మొత్తం వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా 8 శాతం. ప్రస్తుతం 68 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి మరో 100 మందిని తీసుకుంటాం. ‘‘వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో దుబాయ్, సింగపూర్‌లో ట్రావ్‌కార్ట్‌ సేవలను విస్తరిస్తాం. దానికి నిధులు సమీకరిస్తున్నాం’’ అని ’ మన్హీర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement